మార్కెట్ యార్డు కమిటీల్లో 50 శాతం మహిళలకే
విజయనగరం: ప్రభుత్వ నిబంధనల మేరకు విజయనగరం జిల్లాలోని మార్కెట్ యార్డు కమిటీలకు రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయనగరం జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ఎమ్మెల్యేలతో మంత్రి వెల్లంపల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు విజయనగరం జిల్లాకు సంబంధించి 9 మార్కెట్ యార్డులకు సంబంధించి రిజర్వేషన్లు కేటాయించామన్నారు. విజయనగరం మార్కెట్ యార్డు కమిటీ బీసీ ఉమెన్, పార్వతీపురం బీసీ ఉమెన్, బొబ్బిలి ఓసీ జనరల్, సాలూరు బీసీ ఉమెన్, గజపతినగరం ఓసీ జనరల్, చీపురుపల్లి ఎస్టీ జనరల్, ఎస్‌కోట ఓసీ ఉమెన్, కురుపాం ఎస్సీ జనరల్, నెల్లిమర్ల ఓసీ ఉమెన్‌గా ప్రభుత్వ నిబంధనల మేరకు లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగిందన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. గత ఐదేళ్లు చంద్రబాబు పాలనలో విజయనగరం జిల్లా అభివృద్ధిలో వెనకబడిపోయిందన్నారు. అన్ని సమస్యలపై దృష్టిసారించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.