వైయస్ఆర్ జిల్లాలో జననేతకు ఘన స్వాగతం
వైయస్ఆర్ జిల్లా: ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకొని శుక్రవారం వైయస్ఆర్ జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుక్కలదొడ్డి వద్ద జననేతకు ఘన స్వాగతం పలికారు. 2017 నవంబర్ 6వ తేదీన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన వైయస్ జగన్ సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. ఈ నెల 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగించుకొని అక్కడి నుంచి నేరుగా తిరుపతికి వచ్చిన ఆయన అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అశేష సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అనుసరించగా.. తొలి మెట్టుకు మొక్కి వైయస్ జగన్ నడక ప్రారంభించారు.
పాదరక్షలు లేకుండా నడుస్తూ.. దారి పొడవునా శ్రీవారిని ధ్యానిస్తూ.. ‘గోవిందా.. గోవిందా.. శ్రీమన్నారాయణ’ అంటూ నామస్మరణ చేస్తూ.. భక్తి ప్రపత్తులతో వడివడిగా మెట్లు ఎక్కారు. దారిలో ఎక్కడా విశ్రమించకుండా ముందుకు సాగారు. కాలినడకన వచ్చే భక్తులకు దర్శనం కోసం ఇచ్చే ‘దివ్యదర్శనం’ టోకెన్‌ను సామాన్య భక్తుడిగా వైయస్ జగన్ తీసుకున్నారు. ఆయన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు కూడా దివ్యదర్శనం టోకెన్లు తీసుకుని ముందుకుసాగారు.
వైయస్ జగన్, ఆయనతో నడిచినవారు చేసిన నామస్మరణతో మెట్ల మార్గం మొత్తం గోవింద నామంతో మార్మోగింది. ఏకబిగిన మెట్లు ఎక్కిన జగన్.. సాయంత్రం 4.30 గంటలకు తిరుమల చేరుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ అతిథిగృహంలో కాసేపు ఆగారు. సంప్రదాయ దుస్తులు ధరించి సాయంత్రం 6 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దివ్యదర్శనం టోకెన్‌తో శ్రీవారి దర్శనానికి క్యూలైన్‌లో ప్రవేశించారు. ఆలయంలోకి వెళ్లిన తర్వాత ధ్వజస్తంభానికి మొక్కి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం.. ఆనంద నిలయంపైన కొలువై ఉన్న విమాన వెంకటేశ్వరస్వామికి మొక్కారు.
శ్రీవారి ఆలయం ప్రాంగణంలోని అన్నమయ్య భాండాగారాన్ని (అన్నమయ్య సంకీర్తనల ప్రతులను భద్రపరిచిన గది) సందర్శించారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం యోగనరసింహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయక మండపంలో వేదపండితులు వైఎస్ జగన్‌ను ఆశీర్వదించి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. దర్శనం అనంతరం రాత్రి 7 తర్వాత ఆయన శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం అక్కడి నుంచి సొంత జిల్లాకు బయలు దేరారు. దాదాపు 14 నెలల అనంతరం జననేత వైయస్ఆర్ జిల్లాకు రావడంతో పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ రోజు మధ్యాహ్నం కడప దర్గాను దర్శించుకోనున్నారు.
మూడు రోజుల పర్యటన
సుధీర్ఘ పాదయాత్రను ముగించుకున్న ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు వైయస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. కడపలోని అమీన్‌పీర్ దర్గాను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకొని అక్కడి సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం నేరుగా ఇడుపులపాయకు చేరుకొని వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు.