సివిల్ స‌ప్ల‌య్‌కు కుప్ప‌కూల్చింది బాబే

10 Dec, 2019 11:17 IST

అసెంబ్లీ: ఐదు సంవ‌త్స‌రాల్లో సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్‌ను గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కుప్ప‌కూల్చింద‌ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు. సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్ ద్వారా చంద్ర‌బాబు వేల కోట్ల రూపాయ‌ల అప్పులు చేసి ఆ డ‌బ్బును దారి మ‌ళ్లించార‌న్నారు. అసెంబ్లీలో బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ... వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ చేస్తున్న ప్ర‌తీ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిప‌క్షం త‌ప్పుబ‌ట్టేందుకు చూస్తోంద‌న్నారు. 

 

గ‌త ఐదేళ్లు చంద్ర‌బాబు చేసిన కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలిస్తే.. 2018-19లో సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్‌కు రూ.3 వేల కోట్లు కేటాయించి కేవ‌లం రూ. 2 వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేశార‌న్నారు. ఇది కాకుండా ఐదేళ్ల‌లో సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్నుచంద్ర‌బాబు అప్పుల ఊబిలోకి నెట్టార‌న్నారు. రాష్ట్ర‌ విభ‌జ‌న 2014-15 నాటికి సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్‌కు రూ.6 వేల కోట్ల అప్పు ఉంటే.. దాన్ని చంద్ర‌బాబు రూ.20 వేల కోట్ల‌కు తీసుకెళ్లార‌న్నారు. 2017-18లో రూ.6500 కోట్లు, ఎన్నిక‌ల సంవ‌త్స‌రం 2018-19లో ఏకంగా రూ.7500 కోట్లు సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్ త‌రుఫున అప్పు చేశారని చెప్పారు. ఐదు సంవ‌త్స‌రాల్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్ ద్వారా రూ.13500 కోట్లు అప్పు చేసింద‌న్నారు. అప్పు చేసి తీసుకువ‌చ్చిన డ‌బ్బును కార్పొరేష‌న్‌కు వాడ‌కుండా.. దారి మళ్లించార‌న్నారు. బ‌డ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించి రూ.2 వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసిన చంద్ర‌బాబుకు నాణ్య‌మైన బియ్యం గురించి మాట్లాడే హ‌క్కు ఉందా అని ప్ర‌శ్నించారు. 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ సివిల్ స‌ప్ల‌యిస్ కార్పొరేష‌న్‌కు దాదాపు రూ.10500 కోట్లు క‌ట్టాల్సి ఉంద‌న్నారు. వాటిల్లో 2018-19 స‌బ్సిడీ బ‌కాయిలు రూ.3600 కోట్లు,  అంత‌కుముందు రూ.400 కోట్లు బ‌కాయిలు ఉన్నాయ‌ని, చివ‌ర‌కు చంద్ర‌న్న సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫాలో ప్ర‌జ‌ల‌కు పంచిన బియ్యంలో కూడా రూ.1050 కోట్లు సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్‌కు అప్పు క‌ట్టాల్సి ఉంద‌న్నారు. ప్ర‌భుత్వం క‌ట్టాల్సిన రూ.10500 కోట్లు చెల్లించ‌క‌పోగా.. తాజాగా రూ.13500 కోట్లు అప్పు చేసి.. ఆ డ‌బ్బును కానుక‌లు, వేరే మార్గంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉప‌యోగించి సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్ను కుప్పకూల్చే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చాడ‌న్నారు. చివ‌ర‌గా చేసిన రూ.7500 కోట్లు అప్పు కూడా ప‌సుపు కుంకుమకు వాడార‌న్నారు. 

 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌లంద‌రికీ నాణ్య‌మైన బియ్యం పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌ని, గ‌త బ‌డ్జెట్‌లో రూ. 4134 కోట్లు కేటాయించారని మంత్రి బుగ్గ‌న గుర్తుచేశారు. శ్రీ‌కాకుళంలో పైల‌ట్ ప్రాజెక్టును విజ‌య‌వంతంగా చేప‌ట్టామ‌ని, నాణ్య‌బియ్యం అంశంలో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉంటే ప్ర‌తిప‌క్షం స‌న్న‌బియ్యం, దొడ్డుబియ్యం అని వ‌క్రీక‌రిస్తూ మాట్లాడుతుంద‌ని బుగ్గ‌న మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్షం కేవ‌లం రాజ‌కీయం కోసం మాట్లాడుతున్నార‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతుంది.  

Read Also: తినగలిగే నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం