యువతను తీర్చిదిద్దే బాధ్యత మనదే

24 Oct, 2019 11:58 IST


గన్నవరం: పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేసిన తొలి రాష్ట్రం మనదేనని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గర్వంగా చెప్పారు. యువతరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మన భుజస్కందాలపై ఉందని చెప్పారు.  గన్నవరంలో  రూ.50 కోట్లతో నిర్మించిన సీ పెట్‌ భవనాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, కేంద్ర మంత్రి సదానందగౌడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. 
సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) బిల్డింగ్‌ను ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. సీ పెట్‌లో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు మరింత చేరువగా ఉంటాయని పూర్తిగా విశ్వసిస్తున్నాను. అందుకే ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలే రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే కార్యక్రమాలు చేపడుతాం. ఇది ఎందుకు చేయబోతున్నామన్న సంగతి మీ అందరికి తెలుసు. దేశంలో ఎక్కడ జరగని విధంగా మన రాష్ట్రంలో 75 శాతం స్థానికులకే పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం చేశామని గర్వంగా చెబుతున్నాను. ఒకవైపు మన పిల్లలను ప్రోత్సహిచేందుకు, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచేందుకు ఏకంగా చట్టాన్ని తెచ్చాం. ఆ చట్టంతో పాటు మనపై బాధ్యతలు కూడా పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు అవసరమైన స్కిల్స్‌ పెంచి, వారికి ఉపయోగపడేలా మన పిల్లలను తీర్చిదిద్దాలి. ఆ బాధ్యతను పూర్తిగా మన భుజస్కందాలపై వేసుకున్నాం. అందుకోసమే ప్రతి పార్లమెంట్లో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలని ఆకాంక్షిస్తూ, కేంద్రం కూడా వారు చేయగలిగిన సాయాన్ని మనకు చేయాలని కోరుతున్నాను. దీని వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాల్సి ఉంది. మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా..

 

Read Also: సద్గుణుడి పాలనకు ప్రకృతి సహకరించింది