కల్పతరువులా వైయస్ జగన్

21 Nov, 2019 13:22 IST


అన్నా మా ప్రాంతానికి రోడ్లు కావాలి. మా మత్స్యకారుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు కావాలి. తీర ప్రాంత మత్స్యకారుల ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుంది గనుక పునాదుల నిర్మాణానికి కొంత మొత్తం ప్రత్యేకంగా సాంక్షన్ చేయాలి అంటూ ఎమ్మెల్యే సతీష్ ముమ్ముడివరంలో జరుగుతున్న మత్స్యదినోత్సవ సభలో సీఎం వైయస్ జగన్ ను కోరారు. ఒక ముఖ్యమంత్రిని అన్నా అని పిలుచుకుంటూ ధైర్యంగా తమకు కావాల్సినవేమిటో ప్రజా సమక్షంలో, సభాప్రాంగణంలోనే అడిగేంత చనువు, దగ్గరితనం ఎమ్మెల్యేలకు ఉండటం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. అధికారులు, నేతలు ప్రజలతో ఎలా ఉండాలని ముఖ్యమంత్రి చెబుతున్నారో, తన నాయకులతో ముఖ్యమంత్రి కూడా అదేవిధంగా ఉంటున్నారనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. అందుకేనేమో అడగకుండానే వరాలిచ్చే దేవుడు అంటూ అసెంబ్లీలో నాడు విపక్ష ఎమ్మెల్యే రాపాక వైయస్ జగన్‌ను మనసారా అభినందించారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఎమ్మెల్యేలు ముఖస్తుతి చేస్తూ, పొగుడుతూ, భజనలు చేస్తూ, పాటలు పాడిస్తూ కాలక్షేపం చేసారు. ప్రజా సమస్యల పై, ప్రజా అవసరాలపై ఏనాడూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని అడిగిన పాపాన పోలేదు. ప్రజలే తమ సమస్యలను తీర్చమంటూ నాటి ముఖ్యమంత్రి దగ్గరకు పోయి కష్టాలు చెప్పుకుంటే వారిని ఛీదరించుకుంటూ, అవమానకరంగా మాట్లాడినా ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కనీసం స్పందిచిన దాఖలాలు లేవు. ప్రచారాలు, ప్రగల్బాలు తప్ప చంద్రబాబుకు నిజమైన ప్రజాసమస్యలు పట్టవన్న సంగతి ఆ పార్టీ నేతలకు బాగానే తెలుసు. అందుకే సంపాదనలు, అవినీతి పనులు, కుంభకోణాల్లో మునిగిపోయారే తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదు.
నేటి పరిస్థితి వేరు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్వయంగా తాను ప్రజలకు సేవకుడిని అని ప్రకటించారు. నాయకులు, అధికారులు కూడా ప్రజలకు విధేయులై ఉండాలని నిర్దేశించారు. ప్రజా సమస్యలు, వారి అవసరాలను సహృదయంతో అర్థం చేసుకుని వాటిని పరిష్కరించడమే ప్రధానమైన బాధ్యత అని తెలియజేసారు. సీఎం జగన్ గారికి తెలియజేస్తే సమస్య తీరిపోయినట్టే అనే నమ్మకం అటు ప్రజల్లో, ఇటు ప్రజాప్రతినిధుల్లో కలిగేలా తన పరిపాలన నిర్వహిస్తున్నారు ఈ ప్రభుత్వాధినేత. ప్రజలు కోరినవన్నీ ఇచ్చే కల్పతరువు కనుకే ఎమ్మెల్యేలు వైయస్ జగన్ ముందు ప్రజా విన్నపాలు తెలియజేస్తున్నారు. సమర్థుడైన పాలకుడు ఉంటే నాయకులు సైతం నిబద్ధతతో ఎలా పనిచేస్తారో ప్రత్యక్షంగా చూస్తున్నారు తెలుగు ప్రజలు. 

Read Also: కేంద్ర సలహా సంఘాల్లో వైయస్ఆర్‌సీపీ ఎంపీల నియామకం