టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా?

లా అండ్‌ ఆర్డర్‌లో పోలీసులు అట్టర్‌ఫెయిల్యూర్‌

రాష్ట్రంలో చెలరేగిన హింసపై ఎన్నికల సంఘం సమీక్ష చేయాలి

పల్నాడులో ఎన్నడూలేనంతగా హింస జరగడం బాధాకరం..

అధికారంలో ఉండికూడా మా వర్గంపై జరిగిన దాడుల్ని అడ్డుకోలేకపోయాం..

ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల అంతిమతీర్పు వైయ‌స్‌ఆర్‌సీపీకే అనుకూలం

సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆరుబూత్‌ల్లో రీపోలింగ్‌ పెట్టాలి

దమ్మాలపాడు, నార్నెపాడు, చీమలమర్రిలో కన్నా వర్గం రిగ్గింగ్‌కు పాల్పడ్డారు

కన్నా వర్గానికి అండగా పనిచేసిన సీఐ రాంబాబుపై చర్యలు చేపట్టాలి

వెబ్‌కెమెరాలను పరిశీలించి రీపోలింగ్‌తో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

మంత్రి, స‌త్తెన‌ప‌ల్లి వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబు డిమాండ్‌

స‌త్తెన‌ప‌ల్లి: పల్నాడులో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులకు తెగబడ్డారని, వారిని అడ్డుకోవడంలో పల్నాడులో పోలీస్‌ యంత్రాంగం విఫలమైందని మంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కన్నా లక్ష్మినారాయణ కుమారుడు ఓటర్లను బెదిరిస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. నిబద్ధతతో పనిచేసే పోలీస్‌ అధికారులను మార్చేశారని, టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా..? అని ప్రశ్నించారు. చీమలమ్రరి, నాగనుపాడు సహా కొన్ని చోట్ల పోలింగ్‌ సరిగ్గా జరగలేదని, దమ్మాలపాడు, నార్నేపాడులోని కొన్ని చోట్ల రిగ్గింగ్‌ చేశారని, రిగ్గింగ్‌ జరిగిన చోట రీపోలింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..

సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ నిన్న ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ జరిగింది. జరిగిన అన్ని ఎన్నికలతో పోల్చితే.. నిన్న జరిగిన ఎన్నిక చాలా ప్రతిష్టాత్మమైనదిగా చెప్పుకోవచ్చు. ఐదేళ్ల పాటు పరిపాలన కొనసాగించిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్నా..? లేదంటే, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ప్రజలకు ఏ మేలు చేయని చంద్రబాబును మరలా అధికారంలోకి తేవాల్నా..? అనేది తేల్చే ఎన్నిక ఇది. 

ఓటేసేందుకు వృద్ధులు, మహిళలు, వికలాంగుల తాపత్రయం
గతంలో చంద్రబాబు పరిపాలన చూసినవారూ.. వైయ‌స్ జగన్‌ పాలనతీరును చూసినవారూ ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్న తీరును చూస్తే నాకు ఒకింత ఆశ్చర్యమేసింది. ఉదయం 5 గంటలకే మహిళలు, వృద్ధులు, వికలాంగులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిలబడ్డారు. గంటల తరబడి వేచియుండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిని చూసినప్పుడు ప్రతీ ఒక్కరి మొఖంలో ఒక ప్రత్యేకమైన తాపత్రయం కనిపించింది. ఈ వాతావరణం దేనికి సంకేతం..? దీనికి గల కారణాల్ని విశ్లేషించుకోవాల్సిన అవసరముంది. 

మా బిడ్డ వైయ‌స్‌ జగన్‌ సీఎం కావాలనే తాపత్రయంతో..
ఐదేళ్లపాటు సంక్షేమ కార్యక్రమాలు అందించిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన చూసిన తర్వాత .. ప్రతీ ఒక్క తల్లిలో ఒకటే భావన కనిపించింది. మా బిడ్డ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంతో వారు గంటలతరబడి క్యూ లైన్లలో నిల్చొని వృద్ధులు, మహిళలు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

పాజిటివ్‌ ఓటుతోనే వైయ‌స్ జగన్‌ సీఎం ఖాయం
కిందటి ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 79.8 శాతం ఉంటే.. ఈసారి కూడా దాదాపు కొంచెం అటూఇటూ వుండే పరిస్థితి కనిపిస్తోంది. అంటే, ఇంకా అధికారికంగా పోలింగ్‌ పర్సంటేజీ రాలేదు కనుక అలా నేనూ ఊహిస్తున్నారు. అంటే, అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. పోలింగ్‌శాతం పెరగ్గానే దాన్ని ప్రభుత్వ వ్యతిరేకతగా గతంలో అనుకునేవారు. కానీ, ఈనాటి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఎంత ఓటింగ్‌ పర్సంటేజీ పెరిగితే.. అంత పాజిటివ్‌ ఓటుతో వైయ‌స్ జగన్‌ మళ్ళీ సీఎం కాబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తోన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలంతా ఐదేళ్లపాటు సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలనలో పొందిన సంక్షేమ మేలును గుర్తుకు తెచ్చుకుంటూ తమ వంతు బాధ్యతను సమర్ధంగా ఓటు రూపంలో వినియోగించుకున్నారు. 

70 శాతం మహిళలంతా ఫ్యాన్‌గుర్తుకే .. 
ఎన్నికల ప్రక్రియలో నిన్న మహిళల ఓటింగ్‌ను పరిశీలిస్తే.. కులమతాలు, రాజకీయపార్టీలకతీతంగా 70 శాతం మంది వైయ‌స్‌ఆర్‌సీపీ వైపే మొగ్గు చూపి ఫ్యాన్‌గుర్తుకే ఓట్లేశారు. ఈ వాతావరణం నిన్న పోలింగ్‌లోనే కాదు. నా ఎన్నికల ప్రచారంలోనూ కనిపించింది. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజక వర్గంలో ప్రతీ గ్రామంలోనూ పురుషులు కంటే మహిళల్లోనే వైయ‌స్ జగన్‌ పాలన పట్ల, వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వ సంక్షేమం పట్ల చాలా ఉత్సాహం కనిపించింది. ఎక్కడకెళ్లినా మహిళా సోదరీ, సోదరమణులే వైయ‌స్‌ఆర్‌సీపీ జెండాలు పట్టుకుని నా ప్రచార రథం ముందు సాగారు. మహిళా సాధికారత విషయంలో వైయ‌స్ జగన్‌ చిత్తశుద్ధిని మహిళలు గుర్తించారు. కనుకే, వారు ఆయన్ను ఒక బిడ్డలా.. అన్నలా, సోదరుడిలా ఆరాధిస్తున్నా రు. అందుకే, గంటలతరబడి క్యూలైన్‌లలో నిల్చొని మరీ వేలిమీద ముద్ర వేయించుకుని ఫ్యాన్‌గుర్తుపై బటన్‌లు నొక్కారు.

ప్రభుత్వ వ్యతిరేకతే లేదని స్పష్టమైంది
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఉదయం 5 గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి క్యూలైన్లల్లో బారులుదీరిన వాతావర ణాన్ని చూశాం. అందులోనూ కిటకిటలాడిన క్యూ లైన్లన్నీ మహిళలు, వృద్ధులు, వికలాంగులతో నిండిఉన్నాయంటే.. అది ప్రభుత్వ సానుకూలత కిందనే చూడాలి. ఎన్నికల ప్రచారంలో విపక్షాలు పదేపదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అన్నట్లు .. అసలు, వ్యతిరేకత అనేది ఉంటేనే కదా..? చీలడం.. చీలకపోవడమనేది ఉండేది. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓర్పుగా అర్ధరాత్రి వరకూ నిలబడి తమ ఓటును వేసిన తర్వాతే వెళ్లారంటే రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత అనేదే లేదని చాలా స్పష్టమైంది. ప్రభుత్వ పాజిటివ్‌ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటమనేది చరిత్రలో ఒక అరుదైన సంఘటనగా చెప్పుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నందుకు వారికి వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

రిజల్ట్స్‌తో చంద్రబాబు అండ్‌ కో భ్రమలు వీడిపోతాయి
మేం గెలుస్తామని తెలుగుదేశం పార్టీ, జనసేన గానీ ఏదో సాధిస్తామని ఊహాల్లో విహరించే ఎల్లోమీడియా పత్రికలు, ఛానెళ్లు, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లాంటోళ్లు ఎంత మంది కట్టగట్టుకొచ్చినా ఫలితం లేదు. జూన్‌ నెల నాల్గోతేదీన వచ్చే ఎన్నికల ఫలితాలతో, వారి భ్రమలన్నీ వీడి పోతాయి. మరలా వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక మెజార్టీ స్థానాలతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని నేను ఘంటాపథంగా చెబుతున్నాను. ఇది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు పచ్చమీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5లు రాసిపెట్టుకుంటే మంచిది. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజానీకం కూడా నన్ను తిరిగి పెద్ద మెజార్టీతో గెలిపిస్తున్నారనే ప్రగాఢ విశ్వాసం నాకుంది.

పల్నాడులో ఎన్నడూలేనంత హింస
ఈ సందర్భంలో కొన్ని బాధాకరమైన అంశాల్ని కూడా ప్రస్తావించుకోవాలి. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలతో పాటు పల్నాడు మొత్తం ముందెన్నడూ ఎరుగని రీతిగా పెద్ద ఎత్తున హింస జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. గతంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఇంత పెద్ద ఎత్తున హింస జరగలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపైన దాడులు చేస్తున్నారని ఇప్పటికీ పలు గ్రామాల నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరం.

లా అండ్‌ ఆర్డర్‌లో పోలీసులు అట్టర్‌ ఫెయిల్యూర్‌
 ప్రధానంగా గ్రామాల్లో లా అండ్‌ ఆర్డర్‌ కాపాడటమనేది , ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయుతంగా ఓటింగ్‌ వినియోగించుకోవడమనేది అవసరం. ఈ సందర్భంలో ఎన్నికల కమిషన్‌ కూడా డీజీపీ స్థాయి అధికారులనూ మార్చడంలాంటి కొన్ని మార్పులు చేశారు. దానికీ మాకెలాంటి అభ్యంతరాలు లేవు. ఐజీలు, ఎస్పీలనూ మార్చేశారు. ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలనే ఉద్దేశంతో చాలాచోట్ల ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను మార్చేశారు. అయితే, ఇంతమందిని మార్చేశారే.. మరి, పల్నాడులో లా అండ్‌ ఆర్డర్‌ కాపాడబడిందా..? పోలింగ్‌ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగిందా..? ఎందుకు అలా జరగలేదు..? ఇరుపార్టీల వైపు చాలామంది గాయపడ్డారు. తమ ఇళ్లపై కర్రలు, బరిసెలు, రాళ్లుతో దాడిచేస్తున్నారంటూ.. తలలుపగిలి రక్తాలు కారుతున్నట్లు చెబుతూ.. పోలీసుల్ని పంపాలని ఫోన్‌కాల్స్‌ చేశారు. నేనొక మంత్రిస్థాయిలో ఉండి ఎవరికి ఫోన్‌ చేసినా, పోలీసులెవ్వరూ స్పందించలేదు. గంటలతరబడి వేచి చూసినా గొడవలు జరిగే గ్రామాల వైపు పోలీసులు కన్నెత్తి చూడకపోవడం చాలా బాధాకరం. తగినంత పోలీసు సిబ్బంది లేరా..? సమాచారం ఇవ్వగానే పోలీసులు ఎందుకు ఘటనా స్థలాలకు చేరుకోలేకపోయారు..? తలలు పగిలాక రక్తాలు కారక సినిమా పోలీసుల్లా చివరకు వెళ్తారా..? ఏంటి ఈ దుర్మార్గం..? ఎన్నికల ప్రక్రియలో లా అండ్‌ ఆర్డర్‌ కాపాడటంలో పోలీసులు అట్టర్‌ఫెయిల్యూర్‌ అయ్యారు. 

మంత్రినేమో హౌస్‌అరెస్టు చేసి.. ప్రత్యర్థిని వదిలేస్తారా..?
రాష్ట్రమంతా కూడా మరీ ముఖ్యంగా పల్నాడులో లా అండ్‌ ఆర్డర్‌లో పోలీసు యంత్రాంగమంతా విఫలమయ్యారు. ఎన్నడూ జరుగని రీతిలో ఇలా పోలింగ్‌ అస్తవ్యస్థంగా జరగడమేంది..? పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ కాపాడటంలో ఫెయిల్‌ అయ్యారా..? లేదంటే, తెలుగుదేశం పార్టీతో కొల్యూడ్‌ అయ్యారా..? అనేది అర్ధం కాని పరిస్థితి. చాలా విచిత్రమైన పరిస్థితుల్ని నేను గమనించాను. నా నియోజకవర్గంలోనే కొన్ని పోలింగ్‌ బూత్‌లు తిరుగుతూ నకరికల్లు వెళ్లినప్పుడు అక్కడి ఎస్‌ఐ ఫోన్‌ చేసి .. మీరు తిరగడానికి వీల్లేదు. అందర్నీ హౌస్‌ అరెస్టు చేయమన్నారని చెప్పాడు. నేను వెంటనే ఎస్పీ బిందుమాధవికి ఫోన్‌చేస్తే.. అవునండీ ఎలక్షన్‌ కమిషన్‌ ఆర్డర్‌ అని చెప్పారు. నకరికల్లు నుంచి వెంటనే సత్తెనపల్లి ఇంటికి రావాలన్నారు. అలాగేనని నేనొచ్చి సత్తెనపల్లి ఇంట్లో కూర్చొన్నాను. ఆ తర్వాత కుంకలగుంటలో కన్నా లక్ష్మీనారాయణ తిరుగుతున్నాడని నాకు ఫోన్‌ వచ్చింది. మరలా కాసేపటికీ, ఆయనే గుళ్లపల్లిలోనూ తిరుగుతున్నాడని ఫోన్‌ వచ్చింది. దీంతో నేను మరలా ఎస్పీకి ఫోన్‌ చేసి ఇదేంటని అడిగాను. లేదండీ, కమ్యూనికేషన్‌ గ్యాప్‌ మాత్రమేనని .. ఆ ప్రత్యర్థిని కూడా ఆపేస్తామని సమాధానమిచ్చారు.

చాగంటివారిపాలెంలో సీఐ రాంబాబు అత్యుత్సాహం
 ఆ తర్వాత చాగంటివారిపాలెం గ్రామానికి కన్నా లక్ష్మీనారాయణ కొడుకు వచ్చి మా వాళ్లను మీ అంతు తేలుస్తానంటూ వార్నింగ్‌ ఇస్తున్నాడని నాకు ఫోన్‌ వచ్చింది. అక్కడున్న సీఐ రాంబాబుకు ఫోన్‌ చేస్తే అతను లిఫ్ట్‌ చేయలేదు. దగ్గర్ల ఉన్న ఎంపీపీకి ఫోన్‌ చేసి సీఐకి ఇవ్వమని మాట్లాడాను. ఆ ఫోన్‌లో రాంబాబాబు సీఐ అనే అతను నాతో చాలా వల్గర్‌గా మాట్లాడాడు. ఏంటండీ.. మీరొక పోలీసని మరిచిపోయి మాట్లాడుతున్నారు.. నేనే అక్కడకి వస్తున్నానంటూ చాగంటివారిపాలెం వెళ్లాను. నేను వెళ్లేటప్పటికే రాంబాబు సీఐ తన ప్రత్యేక సిబ్బందితో వెళ్లి మా వాళ్లను కొట్టించే ప్రయత్నం చేశాడు. ఈ సీఐ రాంబాబు నేను ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడే నా దగ్గరకొచ్చి నా సిఫార్సుతోనే పోస్టింగ్‌ వేయించుకుని వచ్చాడు. అలాంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణకు అమ్ముడుబోయాడు. కన్నా కొడుకు నాగరాజు దగ్గరకెళ్లి డబ్బులు తెచ్చుకున్నాడని నేను ఆరోపిస్తున్నాను. పైసా లంచం తీసుకోకుండా నిన్ను సీఐగా ఇక్కడ పోస్టింగ్‌ వేయించుకున్న మంత్రినే నువ్వు బెదిరించి భయపెట్టి ప్రత్యర్థుల దగ్గర డబ్బులు తీసుకున్నావంటే.. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది..? ఒక సీనియర్, సిన్సియర్‌ మంత్రిగా ఉన్న నేను ఏం చేయాలి..? నిజంగా, ఇది చాలా బాధాకరం. 

దమ్మాలపాడులో రిగ్గింగ్‌కు పాల్పడిన ‘కన్నా’ వర్గం
ఇంకో చిత్రమేమంటే, దమ్మాలపాడు గ్రామంలో ఈ సీఐ రాంబాబు ఒక బూత్‌వద్ద కేవలం ఒకేఒక్క పోలీసును పెట్టాడు. అవతల నాకనుకూలంగా రెడ్ ఓట్లున్న బూత్‌ దగ్గర మాత్రం ఆరుగురు పోలీసుల్ని పెట్టాడు. అంటే, సీఐ రాంబాబాబు అనే వ్యక్తి ప్రత్యర్థుల దగ్గర డబ్బులు తీసుకుని పక్కా ప్లాన్‌తో పోలీసుల్ని పెట్టాడు. ఎంపీకి ఎవరికైనా ఓటేసుకోండని.. ఎమ్మెల్యే ఓటు మాత్రం అంబటి రాంబాబుకు వద్దని.. కన్నా లక్ష్మీనారాయణకు మేమే ఓటు నొక్కుతామని వాళ్ల మనుషులే ఓట్లేశారు. మా వర్గం అదేంటని అడిగితే.. పోలీసులతో దౌర్జన్యంగా బయటకు నెట్టించారు. అలా సుమారు అక్కడ వెయ్యి ఓట్లు నొక్కారు. ఆ బూత్‌ రీపోలింగ్‌ కోసం కూడా ఎన్నికల కమిషన్‌ను అడుగుతున్నాను. వారేం చేస్తారో చూద్దాం. 

నార్నెపాడులో దాడిపై ఒక్క పోలీసూ స్పందించలేదు
నార్నెపాడులో చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌గా ఉన్న నా అల్లుడు ఉపేష్‌ వెళ్తే అక్కడ అద్దాలు పగులకొట్టారు. పోలీసులకు ఫోన్‌లు చేస్తే ఎత్తరు. అక్కడికి వెళ్లమంటే వెళ్లలేదు. నార్నెపాడులో తెలుగుదేశం గ్రూప్‌తో పోలీసులు కుమ్మక్కయ్యారు. ఈ సీఐ రాంబాబు అనే వ్యక్తి పక్కా పథకంతో వారితో చేతులు కలిపి ఎన్నికల్లో నన్ను దెబ్బదీయడానికి పనిచేశాడు. ఒక్క నార్నెపాడు కాకుండా తొండపి, గుళ్లపల్లి, మాదల తదితర గ్రామాల్లో ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 

పోలీసుల వైఫల్యాలపై ఎన్నికల కమిషన్‌ రివ్యూ చేయాలి
గతంలో పనిచేస్తున్న పోలీసు అధికారులందర్నీ మార్చేశారు. సిన్సియర్‌గా పనిచేసే అధికారులను పెట్టామని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. మరి, ఏంటి ఈ అప్రజాస్వామిక విధానాలు..? అని అడుగుతున్నాను. లా అండ్‌ ఆర్డర్‌ ను ఎందుకు కాపాడలేకపోయారు..? అసలు, పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసిందనే విషయంపై ఎన్నికల కమిషన్‌ సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని నేను అప్పీల్‌ చేస్తున్నాను. మరీ, ఇంత దుర్మార్గమైన రాజకీయం చేస్తారా..? అసలు, మేము ప్రభుత్వంలో ఉన్నామోలేదోనని అర్ధం కాని పరిస్థితి ఉంది. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎలక్షన్‌ బాగా జరిగిందనిపిస్తోంది. వైయ‌స్‌ఆర్‌సీపీ కేడర్‌ ఆర్త నాథాలు చేస్తున్నప్పటికీ వారిని కాపాడుకునేందుకు అధికారంలో ఉండి కూడా ఏమీచేయలేని పరిస్థితికి రావడం మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. నాకు చాలా బాధగా ఉంది. సీఐ, డీఎస్పీలు ఫోన్లు ఎత్తరు. ఎస్పీ ఫోన్‌ ఎత్తి మాట్లాడినా.. ఐదు నిముషాల్లో పోలీసులొస్తారన్నా.. గంటతర్వాత కూడా వారు రీచ్‌కాని పరిస్థితిని చూశాం. 

దమ్మాలపాడు, నార్నెపాడు, చీమలమర్రిలో రీపోలింగ్‌ జరపాలి
దమ్మాలపాడు, నార్నెపాడు, చీమలమర్రి పోలీంగ్‌ బూత్‌లలో రిగ్గింగ్‌ జరిగిందని .. ఆయాచోట్ల రీపోలింగ్‌పై నేను ఇప్నటికే ఎన్నికల కమిషన్‌కు అప్పీల్‌చేశాను. కనీసం, ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్‌ కెమెరాలను వెరిఫై చేసి మేము కోరే చోట్ల రీపోలింగ్‌ పెట్టాలని ఎన్నికల సంఘాన్ని నేను రిక్వెస్ట్‌ చేస్తున్నాను. ఇప్పటికే, ఎక్కడా రీపోలింగ్‌ అవసరం లేదని ఎన్నికల సంఘం అనడం.. మేము రీపోలింగ్‌ పెట్టము అని అనడం ప్రజాస్వామ్యంలో కరెక్టు కాదని మనవి చేస్తున్నాను. డబ్బులకో, బెదిరింపులకు భయపడోగానీ పోలీసులతో పాటు పోలింగ్‌ అధికారులు కూడా కొన్నిచోట్ల ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారు. అందుకే, పోలింగ్‌ అధికారులు రిగ్గింగ్‌ జరిగినట్లు వాళ్లు పుస్తకాల్లో రాయలేదు. కనుక, ఎన్నికల సంఘాన్ని మేము వెబ్‌ కెమెరాలను చూసి నిర్ణయం తీసుకోమని కోరుతున్నాం. 

6 చోట్లా వెబ్ కెమెరాల పరిశీలనతో రీపోలింగ్‌కు మా డిమాండ్
దమ్మాలపాడులో 253, 254, నార్నెపాడులో 236, 237, చీమలమర్రిలో 197, 198 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించి .. ఆయా బూత్‌లలో రీపోలింగ్‌ పెట్టాలని నేను రిక్వెస్టు చేస్తున్నాను. సహేతుకమైన అభ్యంతరాలున్నప్పుడు ఎన్నికల సంఘం వాటిని పరిగణలోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేస్తున్నాను. ఈ 6 చోట్లా వెబ్‌కెమెరాలను పరిశీలించి ఎన్నికల సంఘం రీపోలింగ్‌ నిర్వహించాలని మీడియా ద్వారా కూడా మరోమారు నేను డిమాండ్‌ చేస్తున్నాను. 

వైయ‌స్ జగన్‌ని గెలిపించే తీర్పు
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు కలిసి పోలీసులును, పోలింగ్‌ అధికారులను డబ్బులు పెట్టి కొనుగోలు చేసినా.. లేదంటే, హింసను ప్రేరేపించి వారిని భయపెట్టినా.. ఎవరెన్ని కుట్రలు చేసినా.. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలు ఒక తిరుగులేని నాయకుడిగా గుర్తించి గెలిపించేందుకు ఓట్లేశారు. చంద్రబాబు అనే మోసగాడికి తగిన బుద్ధిచెప్పేలా ప్రజలు తీర్పిచ్చారనేది జూన్‌ 4తేదీన అందరూ చూడబోతున్నాం. 

Back to Top