ఉపాధి కూలీకి మడకశిర టికెట్‌ 

ఈర లక్కప్పకు ఊహించని చాన్స్‌ 

టిప్పర్‌ డ్రైవర్‌ వీరాంజనేయులుకు శింగనమల నుంచి అవకాశం 

సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకు మైలవరం టికెట్‌   

సామాన్యులను చట్టసభలకు పంపాలన్నదే వైయ‌స్ జగన్‌ సంకల్పం  

రూ.కోట్ల సంచులు చూపించిన వారికే బాబు టికెట్లు 

సామాన్యులు, పేదలు చట్ట సభల ప్రతినిధులైనప్పుడే వ్యవస్థకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నది ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ నమ్మకం. ఆ లక్ష్యంతోనే ఈ సారి సాధారణ ఎన్నికల్లో సామాన్యులకు టికెట్లు కేటాయించారు. ఈ అభ్యర్థులంతా నిన్న మొన్నటి వరకు నిత్యం ప్రజా సంబంధాల్లో, సేవలో నిమగ్నమైన వారే కావడం విశేషం.

ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.కోట్లకొద్దీ డబ్బుండాలి. కానీ ఇక్కడ సీఎం వైయ‌స్ జగన్‌ నోట్ల కట్టలు చూడలేదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. అదే ప్రామాణికంగా సీట్లు కేటాయించారు. రూ.కోట్లు ఇస్తే కానీ సీటు ఇవ్వలేమని టీడీపీ తెగేసి చెబుతుంటే... వైయ‌స్ జగన్‌ మాత్రం పేదలకే పెద్దపీట వేశారు. ఈసారి ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో ఇద్దరు నిరుపేదలకు టికెట్లిచ్చి రికార్డు సృష్టించారు. 

అభాగ్యులకు అండ దండ ‘దద్దాల’ 
కనిగిరి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున టికెట్‌ దక్కించుకున్న దద్దాల నారాయణ యాదవ్‌ విద్యార్థి దశ నుంచే వైయ‌స్ఆర్ అభిమాని. 2014, 2019 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో హనుమంతునిపాడు జెడ్పీటీసీగా పోటీ చేసి 8.900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2007 నుంచి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారు. దద్దాల చారిటబుల్‌ ట్రస్టును స్థాపించి అభాగ్యులకు అండగా నిలిచి ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు.  

ఉపాధి కూలీకి, టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్లు 
మడకశిర అభ్యర్థిగా ఎంపిక చేసిన ఈర లక్కప్ప (మాదిగ) ఉపాధి కూలీ. రెండు గదుల పక్కా గృహంలో ఉంటున్న అతనిని పిలిచి మరీ టికెట్‌ ఇవ్వడం విశేషం. 
శింగనమల అభ్యర్థిగా  ప్రకటించిన వీరాంజనేయులు కూడా సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారే. 

టిప్పర్‌ డ్రైవర్‌గా ఉన్న ఈయనకు ఆస్తులేమీ లేవు. మైలవరం స్థానానికి ఎంపిక చేసిన సర్నాల తిరుపతిరావు సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. పదో తరగతి వరకు చదవుకున్నారు. తండ్రి సర్నాల చిన్న జమలయ్య సహకార బ్యాంకులో అటెండర్‌గా పని చేస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో 2014 నుంచి 2019 వరకు వైయ‌స్ఆర్‌సీపీ మైలవరం మండల సెక్రటరీగా పని చేశారు. 2021లో మైలవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి 16 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

సేవాభావం తాటిపర్తి తత్వం  
యర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలు అందించారు. 2024లో తొలిసారిగా యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. తాటిపర్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో వేసవి కాలంలో కొండపి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో మినరల్‌ వాటర్‌ క్యాంపులు నిర్వహించారు. రోగగ్రస్తులకు, హెచ్‌ఐవీ బాధితులు, వితంతువులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు రక్త శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 

చేతిలో పైసాలేని డాక్టర్‌ దాసరి సుధ..
బద్వేల్‌ ఎమ్మెల్యేగా ఉన్న వెంకటసుబ్బయ్య మృతి చెందటంలో ఆయన భార్య డాక్టర్‌ దాసరి సుధా ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. గెలిచిన మరుక్షణం నుంచి ఆమె నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై పని చేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఐదు తరాలకు సరిపడా డబ్బు సంపాదించి వెనకేసుకుంటారు. కానీ డాక్టర్‌ సుధా ప్రజాసేవే పరమావధిగా సాగారు. అందుకే ఆమెకే టిక్కెటివ్వాల్సిందిగా బద్వేల్‌ ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీ అధినాయకత్వంపై ఒత్తిడి చేశారు. ఆమె నిజాయితీ, కర్తవ్యదీక్ష గమనించిన సీఎం జగన్‌ ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండదండలు అందిస్తున్నారు. 

సేవా తత్పరుడు అంబటి 
సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి భజరంగ్‌ ఫౌండేషన్‌ను అంబటి మురళీకృష్ణ స్థాపించారు. భజరంగ్‌ ఫౌండేషన్‌ వారు తలసేమియా రహిత ఆంధ్రప్రదేశ్‌ కోసం కృషి చేస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలోని 52 గ్రామాల్లో నేత్ర, గుండె, దివ్యాంగ, ఫిజియోథెరపీ వంటి ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి అనేక వేలమందికి ఉచిత కంటిపరీక్షలు నిర్వహిస్తున్నారు. తద్వారా ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొన్నారు. ఇప్పుడు పొన్నూరు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

Back to Top