టీడీపీ దండుపాళ్యం బ్యాచ్‌తో జాగ్రత్త
అనంతపురం : అనంతపురం నగర నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బిందెల శ్రీదేవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మహిళా విభాగం నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత 19 నెలలుగా అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రత్యక్షంగా, పరోక్షంగా భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసు శాఖ సుమోటోగా కేసులు నమోదు చేయకపోవడం దారుణమని ఆమె ప్రశ్నించారు. ఒక ముస్లిం మహిళా డాక్టర్‌తో అసభ్య పదజాలంతో మాట్లాడిన ఘటనపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి భార్యను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఘటనపై కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గానీ, మంత్రి నారా లోకేష్ గానీ స్పందించకపోవడం వల్లే నేడు అనంతపురం నగరంలో ఈ స్థాయిలో భూకబ్జాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే ఎమ్మెల్యే దగ్గుబాటి దౌర్జన్యాల వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉన్నట్టుగా స్పష్టమవుతోందని అన్నారు. అనంతపురం నగరంలో ఎప్పుడూ లేని విధంగా గంజాయి స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతోందని, గంజాయి మత్తులోనే గత నెల నగర సీఐ స్థాయి అధికారిపై కత్తితో దాడి జరగడం దీనికి నిదర్శనమని చెప్పారు. అలాగే నగరమంతా పేకాట స్థావరాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయని ఆరోపించారు.
నీతి, నిజాయితీ అంటూ మాట్లాడే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తిరిగి ఎన్నికలకు రావాలని బిందెల శ్రీదేవి సవాల్ విసిరారు. ఎన్నడూ లేని విధంగా అనంతపురం నగర నియోజకవర్గంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు గత 19 నెలల ఎమ్మెల్యే దగ్గుబాటి పరిపాలనలోనే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే దగ్గుబాటి ఇంటిని ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు.