తిరుమల లడ్డూ దుష్ప్రచారం పూర్తిగా అసత్యం
వైయస్ఆర్ జిల్లా: తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలు చేసిన నీచమైన విషప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో స్పష్టంగా తేలిన విషయం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. కోర్టులో నిజాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ అదే అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తుండటం తీవ్రంగా ఖండనీయమని వారు అన్నారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పరిహార పూజలు నిర్వహించారు. ఈ పూజలను ఎమ్మెల్సీ శ్రీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి నిర్వహించి, తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఘోర అపచారాలకు బదులుగా కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు.
పూజల అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గారు, ఎస్ఈసీ సభ్యులు శ్రీ గిరిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను అపఖ్యాతికి గురిచేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. కోర్టు స్పష్టంగా అసత్యమని తేల్చిన అంశంపై ఇకనైనా కూటమి నేతలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.