“చలో గొలగమూడి రోడ్” కార్యక్రమం
నెల్లూరు జిల్లా : సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. వెంకటాచలం మండలం కాకుటూరు పంచాయతీ పరిధిలోని గొలగమూడి రోడ్డులో అనధికారంగా నిర్వహిస్తున్న పశువుల సంతను గో సంరక్షకులు, భక్తులు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతులు లేకుండా, పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా సంత నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. ఒక ప్రైవేట్ స్థలంలో సంత ఏర్పాటు చేసి ప్రతి నెల సుమారు రూ.10 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
సంత పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఇక్కడికి తీసుకువచ్చిన పశువులను అక్రమంగా చెన్నై పరిసరాల్లోని గోవధశాలలకు తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గోవుల అక్రమ రవాణాపై మాట్లాడే వారు మౌనంగా ఉండడం విచారకరమని పేర్కొన్నారు.
సోమిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కాకాణి, సర్వేపల్లి నియోజకవర్గం అవినీతికి అడ్డాగా మారిందని అన్నారు. గ్రావెల్, ఇసుక, బూడిద దోపిడీతో పాటు ప్రభుత్వ, రైల్వే భూముల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఆరోపించారు. ఇరిగేషన్ పనుల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు.
జాతీయ రహదారి పక్కనే ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ జిల్లా అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కుమ్మక్కై ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు.
“చలో గొలగమూడి రోడ్” కార్యక్రమానికి ఇచ్చిన పిలుపుతో పెద్ద సంఖ్యలో ప్రజలు, గో సంరక్షకులు, వైఎస్ఆర్‌సీపీ నాయకులు తరలి రావడంతో సంత నిర్వాహకులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు.
సంత నిర్వహణకు సంబంధించిన భూమి యాజమాన్యం, అనుమతుల అంశాలపై కలెక్టర్, ఎస్పీ తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎన్ని పశువులను గోవధశాలలకు తరలించారో కూడా వెలుగులోకి తేవాలని కోరారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా అనైతిక, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వాటిని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.