వైయస్ జగన్ సంక్షేమ పథకాలే అభ్యర్ధుల విజయానికి బాటలు
తూర్పు గోదావరి : గడిచిన 9 నెలల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే వైయస్ఆర్‌సీపీ అభ్యర్ధుల విజయానికి బాటలు వేస్తాయని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్ధులు ప్రభంజనం సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కాకినాడ పార్లమెంటరీ నేతలు, కార్యకర్తలతో వైవి సుబ్పారెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్‌పై చిత్తశుద్ధితో 59.83 శాతం అమలు చేయాలని చూశామని, కానీ ప్రతిపక్ష పార్టీల నేతలు బీసీ ద్రోహులుగా కోర్టు ద్వారా ఆ ప్రక్రియను అడ్డుకున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి సుమారు రూ. 5 వేల కోట్ల సాయం నిలిచిపోయే పరిస్థితి ఉందన్నారు. అందుకే సీఎం వైయస్ జగన్ వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతాప్ రెడ్డి టీడీపీ నాయకుడని, సామాజికవర్గాన్ని బట్టి అతను వైయస్‌ఆర్ సీపీకి చెందిన వాడని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.