అమెరికాలో ఘనంగా వైయస్ఆర్ 76వ జయంతి వేడుకలు
తాడేపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం హార్ట్ ఫోర్డ్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ కన్వీనర్ కడప రత్నాకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం. పేదల పక్షపాతిగా, రైతు పక్షపాతిగా ఆయన సంపాదించుకున్న కీర్తి అజరామరం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, 108 దేశానికే మార్గనిర్దేశం చేశాయి. నేడు ఆ మహనీయుడిని స్మరించుకోవడం ఇక్కడ అమెరికాలో తోటి అభిమానులతో కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా ఆయన పేరుతో ఏర్పాటైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పని చేయడం, వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవడం నా అదృష్టంగా భావిస్తాను. తండ్రిని మించిన తనయుడిగా కరోనా కష్ట కాలంలోనూ అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు. సంక్షేమం, మ్యానిఫెస్టోను అమలు చేయడం అంటే ఇదీ అనేలా ఇంటింటికీ పథకాలను తీసుకెళ్లిన ఘనత జగన్ గారిది. రైతులకు, పేదలకు, విద్యార్థులకు, మహిళలకు ఇలా అన్ని వర్గాలకు భరోసా కల్పించే నాయకత్వం వైయస్ జగన్ గారిది. భవిష్యత్తులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, వచ్చే ఎన్నికల్లో దిగ్విజయంగా గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నాను.