ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి

27 Apr, 2026 16:22 IST

పల్నాడు:  మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఫిర్యాదులు ఇచ్చినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త నంబూరి శంకర్రావు, సత్తనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వెంటనే న్యాయం జరగాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.