డీఎస్సీ స్కామ్‌పై రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు

1 Jun, 2026 20:49 IST

తాడేపల్లి: తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025లో అంతులేని అక్రమాలు చోటు చేసుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వైయస్ఆర్‌సీపీయువజన విభాగం పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత తరలి వచ్చారు. డీఎస్సీ–2025 పరీక్ష నిర్వహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువత, ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
    స్పోర్ట్స్‌ కోటా టీచర్‌ పోస్టుల భర్తీలో ఇష్టానుసారం నియమావళి మార్చడమే కాకుండా, కేవలం ఈ పరీక్ష కోసమే జీఓలు జారీ చేసి, ఈ వెంటనే రద్దు చేయడం, ఏనాడూ గ్రౌండ్‌లోకి అడుగు పెట్టని వారు కూడా శాప్‌ నుంచి సర్టిఫికెట్లు తీసుకు రావడం, అర్హులైన వారందరినీ కాదని, డబ్బులిచ్చిన వారికే ఉద్యోగాలు ఇచ్చారని యువత ఆరోపించారు. మొత్తం ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, డీఎస్సీ–2025లో స్కామ్‌కు బాధ్యత వహిస్తూ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్‌ చేశారు. 
రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటే..:

- విశాఖ కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్తత:

వైయస్సార్‌సీపీ యువజన విభాగ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు వైయస్సార్‌సీపీ నేతలు, నాయకులు కలెక్టరేట్‌లోకి పోకుండా అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి, అడ్డుకోవడంతో పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదం చేయాల్సి వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారు, డీఎస్సీలో అక్రమాలను ఎండగట్టారు. అంతకు ముందు జిల్లా పరిషత్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు వైయస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

- విజయనగరం:

కలెక్టరేట్‌ ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. డీఎస్సీలో అక్రమాలపై యువత ఆందోళన

- అనకాపల్లి:

మెగా డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ అనకాపల్లి పార్టీ కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్‌ వరకు వైయస్సార్‌సీపీ నాయకుల ర్యాలీ. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, ఉమాశంకర్‌ గణేష్, అదీప్‌రాజ్‌ తదితరులు.

- కోనసీమ:

డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ అమలాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్, నిరసన ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేతలు అనురాధ, పాముల రాజేశ్వరి, సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాస్‌ 

- కాకినాడ:

మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కలెక్టరేట్‌ ఎదుట వైయస్సార్‌సీపీ యువజన విభాగం ఆందోళన. మంత్రి లోకేష్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌.. ర్యాలీలో పాల్గొన్న జక్కంపూడి రాజా, వరుదు కల్యాణి, రవిబాబు, కేకే రాజు, వాసుపల్లి దేవన్, మళ్ల విజయ్‌ప్రసాద్‌.

- పశ్చిమ గోదావరి:

కూటమి సర్కార్‌ దగా డీఎస్సీకి నిరసనగా భీమవరంలో వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద ఆందోళన, డీఎస్సీ స్కామ్‌పై న్యాయ విచారణ జరపాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

- ఏలూరు:

జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద భారీ నిరసన. కూటమి ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకుందంటూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ఆగ్రహం. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలు. డీఎస్సీ అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత  

- విజయవాడ:

ఎన్టీఆర్‌ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పణ. టీడీపీ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో మోసం చేసిందని, దీనికి విద్యా శాఖ మంత్రి సమాధానం చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌. టీడీపీ కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్న పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌

- కృష్ణా:

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మచిలీపట్నంలో నిర్వహించిన ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమంలో పేర్ని కిట్టు, మెరుగుమాల కాళి తదితరులు పాల్గొన్నారు.

- గుంటూరు:

డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, అంబటి మురళి, నూరి ఫాతిమా, వనమా బాల వజ్రపు బాబు, అన్నాబత్తుని శివకుమార్, ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు.

- బాపట్ల:

బాపట్ల జిల్లా కేంద్రంలో పోలీసుల ఓవరాక్షన్‌. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ వైయస్సార్‌సీపీ యువజన విభాగం చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థుల బైక్‌ తాళాలను దౌర్జన్యంగా లాగేసుకున్న పోలీసులు

- ప్రకాశం:

మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ఒంగోలులో నిరసన కార్యక్రమం. వైయస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన

- నెల్లూరు:

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి నారా లోకేష్‌ రాజీనామా కోరుతూ, నెల్లూరులో వైయస్సార్‌సీపీ యువజన విభాగం నిర్వహించిన ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు, చంద్రశేఖర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.  

- తిరుపతి:

మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైయస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

- అనంతపురం:

డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ అనంతపురంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

- శ్రీసత్యసాయి జిల్లా:

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని కలెక్టరేట్‌ ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం ధర్నా

- అన్నమయ్య:

మెగా డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మదనపల్లి కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ధర్నా  

- కర్నూలు:

మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారని వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని నరసింహారెడ్డి, బుట్టా ప్రతుల్‌ తదితరులు పాల్గొన్నారు.  

- నంద్యాల:

కలెక్టరేట్‌ ఎదుట వైయస్సార్‌సీపీ నాయకుల ధర్నా. మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని నిరసన. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ పదవికి రాజీనామా చేయాలని వైయస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌.