ఉగాది జాబ్ క్యాలెండర్ మోసపూరితం

24 Mar, 2026 13:23 IST

గజపతినగరం: కూటమి ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం నేత‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. మంగ‌ళ‌వారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ క్యాలెండర్‌ను “మోసపూరితం”గా అభివర్ణిస్తూ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆరోపించారు. ఈ సమావేశం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు పైడిపునాయుడు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం వైఎస్ ప్రెసిడెంట్ మంత్రి క్రాంతికుమార్, దత్తిరాజేరు యువజన విభాగం అధ్యక్షుడు దత్తి చిరంజీవి, గజపతినగరం మండల యువజన విభాగం అధ్యక్షుడు కర్రి లక్ష్మణరావు, వైస్ ప్రెసిడెంట్ కర్రి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడిన నేతలు, కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేదని, కాలపట్టికలు అస్పష్టంగా ఉన్నాయని విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేసే విధంగా హామీలు ఇస్తూ, వాస్తవానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. “ఉగాది పండుగ రోజున యువతకు ఆశలు కలిగించాల్సింది పోయి, మాయమాటలతో మోసం చేయడం దురదృష్టకరం” అని నాయకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి, యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.