ఎస్సీలపై చంద్రబాబు నరమేధం
పల్నాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీలపై సాగుతున్న దాడులు, అణచివేతలు పరాకాష్టకు చేరాయని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. మందా సాల్మన్‌ను దారుణంగా హత్య చేయడం కూడా చంద్రబాబు చేస్తున్న నరమేధంలో భాగమేనని ఆయన ఆరోపించారు.
పరిపక్వత లేని నారా లోకేష్ తీసుకొచ్చిన ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఈ తప్పుడు సంస్కృతితో పల్నాడు జిల్లాలోనే వందలాది కుటుంబాలపై దాడులు జరిగాయని తెలిపారు. కాపాడాల్సిన పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌కు అండగా ఉన్నారన్న కారణంతోనే దళితులపై కూటమి ప్రభుత్వం పగ పట్టిందని అన్నారు. దళితులకు పథకాలు ఇవ్వలేక, రక్షణ కల్పించలేని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ, వైయస్సార్సీపీకి ఓటేస్తే చంపేస్తామన్న స్థాయిలో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. స్వేచ్ఛగా ఓటు వేసినందుకే దళితులను ఊచకోత కోసి చంపుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. హాయిగా బ్రతకాలంటే తుపాకీ లైసెన్సులు కావాల్సిన పరిస్థితి వస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాయాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో దళితుల సత్తాను కూటమి ప్రభుత్వానికి చూపిస్తామని, వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్‌సీపీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. మందా సాల్మన్ హత్యను కోర్టులు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా వైయస్ఆర్‌సీపీ నాయకుడు చంద్రగిరి యేసురత్నం మాట్లాడుతూ, చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో కూటమి నాయకులు ఏడాదిన్నరగా చేస్తున్న అరాచకాలకు హద్దులు లేకుండా పోయాయని విమర్శించారు. దళితులపై దాడులతో మోయలేనంత పాపాన్ని మూటగట్టుకున్నారని అన్నారు. మందా సాల్మన్ హత్యకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కూటమి నాయకుల వేధింపులకు ఏ వర్గమూ మినహాయింపు కాదని, అధికార పార్టీకి వంతపాడుతున్న పోలీసులు శాశ్వతంగా పదవుల్లో ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 300 కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంటూ, వెనుకబడిన వర్గాలన్నీ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.