చంద్రగిరిలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త అరెస్ట్..
తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మల్లయ్యపల్లె గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జల్లికట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బొమ్మగుంట రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికు సంబంధించిన ప్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని పోలీసులు సూచించడంపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన ప్లెక్సీలు తొలగించకుండా, కేవలం వైయస్ఆర్‌సీపీకి సంబంధించిన వాటినే తీసేయడం ఏ విధమైన న్యాయమని క్యాడర్ ప్రశ్నిస్తోంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు బైఠాయించి, బొమ్మగుంట రవిని తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. శాంతియుత కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా వారు అభివర్ణించారు. పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లోబడి వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో సమాన న్యాయం పాటించాల్సిన అవసరం ఉందని వైయస్ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించారు. అరెస్టు చేసిన కార్యకర్తను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.