17 మెడికల్ కాలేజీలతో చరిత్ర సృష్టించిన వైయస్ జగన్
తిరుపతి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించారని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పేర్కొన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేక చరిత్రహీనుడయ్యారని ఆమె ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ హయాంలో తొలి విడత మెడికల్ కాలేజీలు ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా వరుదు కళ్యాణి, ఎమ్మెల్యే దాసరి సుధ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికార సదస్సుకు హాజరైన వారు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. వరుదు కళ్యాణి మాట్లాడుతూ..వైయస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి అంకురార్పణ జరిగిందన్నారు. మూడు సార్లు సిఎం గా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మాణం చేయలేకపోయారని విమర్శించారు. రూ.8500 కోట్ల తో వైయస్ జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు మూడు దశల్లో ప్రారంభించారన్నారు. పాడేరు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు కూడా ప్రారంభం అయ్యాయని చెప్పారు.
ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ ఉండాలని వైయస్ జగన్ సంకల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రవేట్ వ్యక్తులకు, తన బినామీలకు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్య అందకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబు తానో విజనరీ అంటూ గొప్పలు చెప్పుకుంటూ సంపద సృష్టిస్తానని చెప్పి..ఉన్న సంపదను దోచుకుంటున్నారని ఆక్షేపించారు. మెడికల్ కాలేజీలపై హోంమంత్రి అనిత పవర్ పాయింట్ ప్రజేంషన్ లో అవాకులు చవాకులు పేలుతున్నారు.మీ పక్క జిల్లా అరకు మెడికల్ కాలేజి, మీరు ఇంచార్జిగా ఉన్న విజయనగరంకు రండి ..అక్కడ నిర్మించిన మెడికల్ కాలేజీలు చూపిస్తానని సవాల్ విసిరారు. మీ సొంత జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధులు తీసుకురాలేని అసమర్ధ మంత్రి అనిత అంటూ మండిపడ్డారు. మంత్రి సవిత కామెడీ స్కిట్స్ చేస్తున్నారు.
మంత్రిగా ఉండి రూ.50 కోట్లు కూడా కేటాయించుకోలేని అసమర్ధ మంత్రి మీరు కాదా అని నిలదీశారు. మీ సొంత నియోజకవర్గంలో ఏడాదిన్నరగా మీరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, కుట్టుమిషన్ల స్కాంలో మీరు బిజీగా ఉన్నారా అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
ఎంబీబీఎస్ సీట్లు వద్దని లేఖ రాసింది మీరు కాదా?: ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ
పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం లేఖ రాసింది నిజం కాదా అని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను ప్రవేట్ పరంచేయాలని చూడటం దారుణమన్నారు. వైయస్ జగన్ హయాంలో 58 వేల పోస్టులు వైద్యరంగంలో రిక్రూట్ మెంట్ చేశారని గుర్తు చేశారు. స్టాప్ కొరత ఉందని, మెడికల్ కాలేజి నడపలేమని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం చాలా దారుణమన్నారు. పేద విద్యార్దులకు వైద్య విద్య అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఎమ్మెల్యే సుధ హెచ్చరించారు.