మదనపల్లి ఘటనపై కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
నెల్లూరు జిల్లా: మదనపల్లిలో మైనర్ బాలికపై జరిగిన విషాద ఘటనకు కూటమి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలంటూ వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత డిమాండ్ చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలు, మైనర్ బాలికలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దీనికి మదనపల్లిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. కూటమి పాలనలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో లేదని, తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందన్న భయం కూడా కనిపించడం లేదన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం విచ్చలవిడిగా లభిస్తుందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానాల కారణంగా మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు. మదనపల్లి ఘటన మద్యం మత్తులోనే జరిగిందని హోంమంత్రి వంగాలపూడి అనిత స్వయంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో బెల్ట్ షాపులను నిర్మూలించి, కఠిన నిబంధనలు అమలు చేశారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం మద్యం నియంత్రణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మద్యం కారణంగా మహిళల మాన, ప్రాణాలకు ముప్పు ఉన్నా కూటమి నాయకులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారనే భ్రమలో కూటమి నేతలు ఉన్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు లేకపోవడంతో పాటు శాంతిభద్రతలు క్షీణించి ప్రజలు అధోగతి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.