బండారుపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
తాడేపల్లి: రాష్ట్రమంత్రి రోజా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణపై వైయస్ఆర్‌సీపీ మహిళా నేతలు ఏపి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ..బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళా మంత్రిని అవమానించదానికి సిగ్గుపడాలని మండిపడ్డారు. మహిళలను అగౌరవపరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబుకు అన్యాయం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భువనేశ్వరి , బ్రాహ్మణి లు ప్రజల కష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడి అన్యాయం జరిగిందని రోడ్లపైకి వస్తే.. ప్రజలు ఆదరించాలా..? అని నిలదీశారు. చంద్రబాబు అక్రమాలను సిఐడి ఆధారాలతో బయటపెట్టిందని చెప్పారు. టిడిపి మహిళలు కూడా బండారు సత్యనారాయణ వాఖ్యలను ఖండించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని సునీత హెచ్చరించారు.