పారా మెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు దారుణం
కాకికాడ: కాకినాడ జీజీహెచ్‌లో పారా మెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు దారుణమని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైయస్ఆర్‌సీపీ మహిళా నాయకురాళ్లు జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టారు. అంబానీ ల్యాబ్,సెంట్రల్ ల్యాబ్ ను జక్కంపూడి విజయలక్ష్మీ, నగర వైయస్ఆర్ సిపి అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కుడా మాజీ ఛైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తీ, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి విజయలక్ష్మి తదితరులు పరిశీలించారు. బయోకెమిస్ట్రీ హెచ్‌వోడీ డాక్టర్ శ్రీవాణీ తో మాట్లాడి కీచకుల వేధింపులపై సమాచారం సేకరించారు. విద్యార్థినులపై వేధింపులు జరుగుతున్న ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని ఆర్ఎంసి ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ..చదువు కోసం వచ్చిన పారా మెడికల్ విద్యార్థినులు పలువురిపై అదే విభాగంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థినులపై ఈ దాష్టీకానికి పాల్పడటం అమానుషమన్నారు. బయటపెడితే చంపేస్తామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించడం హేయమన్నారు. కీచకుడికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.