టీడీపీ ఎమ్మెల్యేల నుంచే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదు

17 Aug, 2025 19:27 IST

నెల్లూరు:  టీడీపీ ఎమ్మెల్యేల నుంచే మహిళలకు రక్షణ లేని పాలన రాష్ట్రంలో సాగుతోంది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... తన పార్టీ ఎమ్మెల్యే అకృత్యాలకు, అఘాయిత్యాలకు సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. మహిళా రక్షణ విషయంలో చంద్రబాబు చెబుతున్నవనీ పచ్చి అబద్దాలేనని ధ్వజమెత్తారు. సొంతపార్టీకి చెందిన నేతల దుర్మార్గాలు వీడియోలతో సహా బయటకు వస్తుంటే, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కూటమి నేతలు మహిళల పాలిట రాక్షసులుగా మారారని, ఈ రాష్ట్రంలో మహిళకు భద్రత లేని దుర్మార్గ పాలనను చూస్తున్నామని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే...

మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసుల‌కు రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు చేయ‌డంలో బిజీ అయిపోయారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల జీవితాల‌తో ఆడుకుంటుంటే ప‌ట్టించుకోవ‌డం లేదు. చివరికి టీడీపీ ఎమ్మెల్యే నుంచే ప్రభుత్వ ఉద్యోగినులకు వేధింపులు ఎదురవుతుంటే, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? కూటమి ప్రభుత్వ దృతరాష్ట్ర పాలనపై మహిళా లోకం ఉద్యమించే ప‌రిస్థితి కల్పిస్తున్నారు. మహిళలకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం పోరాటానికి సిద్దం. 

నిందితుల‌కు శిక్ష‌లు ప‌డ‌టం లేదు:

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉండ‌టం లేదు. ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుని ఉన్న‌త ఉద్యోగం చేసుకునే మ‌హిళ‌లు సైతం వేధింపుల‌కు మిన‌హాయింపు ఉండటం లేదు. వాటిపై ఫిర్యాదు చేస్తే ప‌ట్టించుకునే తీరిక పోలీసుల‌కు కూడా ఉండ‌టం లేదు. వారికి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేయ‌డ‌మే స‌రిపోతుంది. దీంతో ఎన్ని నేరాలు చేసినా మాకేం కాద‌నే ధీమా నేర‌స్తుల్లో పెరిగిపోతోంది. నెల్లూరు జిల్లాలో కూట‌మి ఎమ్మెల్యేలు సైతం మ‌హిళ‌ల ర‌క్ష‌ణ గురించి త‌ప్ప ప‌నికిరాని విష‌యాల‌న్నీ మాట్లాడుతున్నారు. క‌నీసం టీడీపీలో ప‌నిచేసే మ‌హిళ‌లు సైతం ర‌క్ష‌ణ లేద‌ని వాపోతున్నారంటే రాష్ట్రంలో ప‌రిస్థితి ఎంత‌లా దిగ‌జారిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నాడు స్మార్ట్ ఫోన్ లో దిశ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని మ‌హిళ‌లు ధైర్యంగా తిరిగే వారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక దిశ యాప్‌కి శ‌క్తి యాప్ అని పేరు మార్చి నిర్వీర్యం చేసేశారు. మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నార‌ని సాక్షాత్తు ఎమ్మెల్యేల మీద‌నే ఆరోప‌ణ‌లొస్తుంటే వాటి మీద క‌నీసం విచార‌ణ కూడా జ‌ర‌ప‌కుండా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆడ‌పిల్ల‌ల మీద చెయ్యేస్తే తాట తీస్తామ‌ని చెప్ప‌డ‌మే త‌ప్ప అఘాయిత్యాలు చేసిన వారిని క‌ఠినంగా శిక్షించిన దాఖ‌లాలు 15 నెల‌ల కూట‌మి పాల‌న‌లో ఏనాడూ జ‌ర‌గ‌లేదు. కూటమి పాల‌న‌లో మ‌హిళ‌లు బ‌య‌ట‌కు రావాలంటేనే భ‌య‌ప‌డిపోయే ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. కూట‌మి నాయ‌కులు ఎంత‌లా దిగ‌జారిపోయారంటే, చివ‌రికి కూట‌మి అన్యాయాల మీద ఫిర్యాదు చేసిన మ‌హిళ‌ల‌ను కూడా వైయ‌స్ఆర్‌సీపీవారేన‌ని ప్ర‌చారం చేస్తుండ‌టం సిగ్గుచేటు. మ‌హిళ‌లు బాగుంటేనే స‌మాజం బాగుంటుంద‌ని ఇప్ప‌టికైనా ఈ ప్ర‌భుత్వం గ్ర‌హించాలి. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని ఏ ప్ర‌భుత్వం కూడా ఎంతోకాలం మ‌న‌జాల‌దనే విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు గ్ర‌హించాలి. మ‌హిళ‌ల‌ను వేధించిన వారికి, అఘాయిత్యాలు చేసే వారిని ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం త‌రఫున ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సీఎం స్పందించ‌కుంటే రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నాం.