ప్రసాదంలో నత్త పడింద‌ని ప్ర‌శ్నిస్తే కేసా? 

31 Dec, 2025 13:00 IST

విజ‌య‌న‌గ‌రం: ప్రసాదంలో నత్త పడిందని ప్రశ్నించిన భక్తులపై పోలీసు కేసులు నమోదు చేయడాన్ని వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడు మజ్జి శ్రీ‌నివాస‌రావు(చిన్న శ్రీ‌ను)  తీవ్రంగా ఖండించారు. విశాఖలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన వ్యవహారంపై ఆయన స్పందిస్తూ ..కూటమి ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి, భక్తుల మనోభావాలకు విరుద్ధమని మండిపడ్డారు. “ప్రసాదంలో నత్త పడిన ఘటనపై భక్తులు ప్రశ్నిస్తే, వారి మీదే కేసులు పెట్టడం ఏ విధమైన న్యాయం? పోలీసు కేసులతో భక్తులను ఎంతకాలం భయపెడతారు? దేవాలయాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. చేసిన తప్పును సరిదిద్దుకోవాలి గానీ, ప్రశ్నించిన వారిని అణచివేయడం సరైంది కాదు” అని అన్నారు.

భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా, అధికారుల తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. “ప్రసాదంలో నత్త పడిన ఘటనలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఇందుకు భిన్నంగా, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై కేసులు పెట్టడం కూటమి పాలనలో పరిపాటిగా మారింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తులపై పెట్టిన అన్ని కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన మజ్జి చిన శ్రీనివాస్‌, “కూటమి పాలనలో ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారా? ఇదేనా ప్రజాస్వామ్యం?” అని ప్రశ్నించారు. సింహాచలం దేవస్థానంలో గతంలో జరిగిన తప్పుల నుంచి కూడా ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవడం లేదని విమర్శించారు.