కాశి నాయన క్షేత్రంలో కూల్చివేతలు బాధాకరం

వైయస్ఆర్ జిల్లా: కాశి నాయన క్షేత్రంలో అటవీ అధికారులు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ఆక్షేపించారు. బద్వేలు నియోజకవర్గం కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో కూల్చివేసిన భవనాలను గురువారం ఎంపీ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే సుధా , మాజీ ఎమ్మెల్యే మైదుకూరు రఘురాం రెడ్డి, ఆదిత్యరెడ్డి తదితరులు పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు క్షేత్రంలో కూల్చివేతలు చేపడితే ప్రభుత్వానికి తెలియదు అనడం విడ్డూరంగా ఉందని అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఈ క్షేత్రానికి అటవీ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి లేఖ రాశారని, కానీ కూటమి ప్రభుత్వం అదేశాలిచి మరీ కూల్చివేతకు పాల్పడిందని ఆయన అన్నారు. ఎంతోమంది భక్తుల మనోభావాలతో కూడుకున్న సున్నితమైన అంశమని, రాజకీయాలకు అతీతంగా ఈ క్షేత్రాన్ని కాపాడాలని వైయస్ అవినాష్ రెడ్డి సూచించారు. క్షేత్రానికి కేవలం బస్సులు పున: ప్రారంభించడం కాదని, అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానిదే అన్నారు. కాశి నాయన క్షేత్రానికి అటవీ అనుమతులు తీసుకురావడంలో ఈ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.