విద్యార్థులకు ఉప్పునీరు.. నీళ్లచారే గతి
అనంతపురం: కూటమి పాలనలో విద్యార్థులకు ఉప్పునీరు..నీళ్ల చారే గతి అయ్యిందని వైయస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు మీద ఈ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. జిల్లాలో నెలకొన్న విద్యార్థుల సమస్యలు, ప్రైవేట్ విద్యాసంస్థలు అనుసరిస్తున్న విధానాలపై ఇవాళ జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ..అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం సరిగా లేదని, ఆర్ ఓ వాటర్ ప్లాంట్లు చెడిపోవడం వల్ల వాటి మరమ్మత్తులకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఆర్ ఓ వాటర్ సిస్టమ్ ని అమర్చలేని పరిస్థితులలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. దీంతో విద్యార్థులు పురుగులు పడిన నీళ్లు తాగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పు నీటినే మంచినీరుగా తాగుతున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొందని పేర్కొన్నారు. కలుషిత నీటి వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. దసరా సెలవుల్లో కొన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యా సంస్థలని నడుపుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్ రెడ్డి, నాయకులు వెంకటేష్ రాయల్, ప్రధాన కార్యదర్శులు నిశాంత్ రెడ్డి, అశోక్ నగర అధ్యక్షుడు కైలాష్, నగర ప్రధాన కార్యదర్శులు ఫయాజ్, అశోక్ రాయల్, ఆదిల్,నవీన్, లోకేష్, వంశీ నాయుడు, నరేందర్ రెడ్డి, చిగండి రమేష్, రాహుల్ రెడ్డి, సాయి యాదవ్, సూర్య, శివ తదితరులు పాల్గొన్నారు.