వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేరా?
రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం కనీసం వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ పై లైటింగ్, ఫ్లైఓవర్ కు సర్వీస్ రోడ్లు వేయకపోవడంపై నేషనల్ హైవే అథారిటీస్ డీజీఎం సురేంద్ర నాధ్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం మార్గాని భరత్ మాట్లాడుతూ..మోరంపూడి ఫ్లైవర్ పై లైటింగ్ లేకపోవటం వల్ల నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డులో తట్టెడు మట్టి కూడా వేయలేదని మండిపడ్డారు. ఫ్లై ఓవర్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కూటమి నేతలు, లైటింగ్ వేయించడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. ఈ ప్రభుత్వం వీధిలైట్లు, సర్వీస్ రోడ్డులో గుంతలు పూడ్చకపోతే తామే చందాలు పోగు చేసి వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. అప్పరావు జంక్షన్, వేమగిరి జంక్షన్ మధ్యలో సింగిల్‌ఫ్లై ఓవర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ప్రభుత్వ మార్పుతో ఆ పనులు నిలిచిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ ఫ్లై ఓవర్ నిర్మించాలని డిమాండ్ చేశారు.