మహిళా శక్తి సాధికారతే లక్ష్యం

6 Apr, 2026 15:52 IST

నంద్యాల జిల్లా: మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వ‌రుదు క‌ళ్యాణి పేర్కొన్నారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని, వారిని ప్రోత్సహించడం ద్వారా బలమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. పార్టీ బలోపేతంలో మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తుందని, మహిళలకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితేనే ప్రజల సమస్యలకు సమగ్ర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆత్మీయ సమావేశం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వ‌రుదు క‌ళ్యాణి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సాధికారతపై కీలక ప్రసంగం చేశారు. మహిళలు రాజకీయాల్లో మరింత చురుకుగా పాల్గొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతంలో మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తుందని, మహిళలకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాల కోసం పుట్టిందని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాడుతామని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలు, ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆరోపించారు. మహిళలను రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో బలపరచడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. కూటమి నాయకులు అధికారంలో ఉండి మహిళలను వేధించడం, దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని, మహిళలకు భద్రత లేకుండా పరిస్థితులు మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర హోం మంత్రి మహిళల రక్షణపై దృష్టి పెట్టకుండా కేవలం వైయ‌స్ జ‌గ‌న్‌పై విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు.

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. మహిళలకు గౌరవం కాపాడాలని వైయ‌స్ జగన్ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. రాజకీయాల్లో మహిళలను మరింతగా ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీపై ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని, ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, జోనల్ ప్రెసిడెంట్ గాజుల శ్వేత రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ, రాష్ట్ర కార్యదర్శి వైజా అరుణ, కర్నూలు జిల్లా మహిళ అధ్యక్షురాలు సిద్ధారెడ్డి రేణుక, జనరల్ సెక్రటరీ శశికళ తదితరులు పాల్గొన్నారు.