దోచుకున్నది దాచుకోవడానికే తండ్రీ–కొడుకుల విదేశీ పర్యటనలు

2 Jan, 2026 16:28 IST

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సీఎం చంద్రబాబు నాయుడు రూ.2.93 లక్షల కోట్ల అప్పులు చేసి, ఆ డబ్బును బినామీల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో దోచుకున్న ప్రజాధనాన్ని విదేశీ వ్యాపారాల్లో పెట్టుబడులుగా మార్చేందుకు తండ్రీ–కొడుకులు చంద్రబాబు, లోకేష్ రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లారని విమర్శించారు.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కానీ ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా పర్యటనలు చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆచూకీ కనబడటం లేదంటూ సోషల్ మీడియాలో ప్రజలు పోస్టులు పెడుతున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి ఆచూకీ కనబడటం లేదు

గత నాలుగు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచూకీ తెలియకపోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందని కారుమూరి వెంకటరెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో ‘సీఎం ఎక్కడ?’ అనే పోస్టులు వైరల్ అవుతున్నాయని చెప్పారు. సీఎం ఆచూకీపై రాష్ట్ర డీజీపీ, సీఎస్ వద్ద సమాచారం ఉంటే వెంటనే ప్రజలకు వెల్లడించాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి అయినా వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సీఎంతో పాటు సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ కూడా గత వారం రోజులుగా కనిపించకుండా పోయారని విమర్శించారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా టీడీపీ కార్యకర్తలు లోకేష్ ఆచూకీ కోసం వెతుకుతున్నారని అన్నారు. ఎల్లో మీడియా మాత్రం లండన్, బాలి వంటి పలు దేశాల పేర్లు చెబుతున్నా, ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు.

శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానాల్లో జంప్

వైకుంఠ ఏకాదశి రోజున రాష్ట్ర ప్రజలు పండుగను ఘనంగా జరుపుకుంటుంటే, అదే రోజు (30-12-2025) ఉదయం 10.28 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వీజేటీ–101 అనే ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు బాలి వెళ్లినట్టు సమాచారం ఉందని కారుమూరి వెంకటరెడ్డి వెల్లడించారు. అయితే ఎల్లో మీడియా మాత్రం లండన్ వెళ్లినట్లు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

మంత్రి నారా లోకేష్ కూడా కేబినెట్ సమావేశాన్ని వదిలేసి 28-12-2025న శంషాబాద్ నుంచి కేథ్‌వే పసిఫిక్ ఎయిర్‌లైన్స్‌లో హాంకాంగ్ వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. ప్రజాప్రతినిధులుగా కీలక పదవుల్లో ఉండి, ప్రభుత్వానికి కూడా తెలియకుండా ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వారి పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని నిలదీశారు.

ప్రతి మూడు నెలలకు చంద్రబాబు, రెండు నెలలకు లోకేష్

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు ప్రతి మూడు నెలలకు ఒకసారి విదేశీ పర్యటనలు చేస్తున్నారని కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు ఆరు సార్లు విదేశాలకు వెళ్లగా, అందులో రెండుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి రహస్య పర్యటనలు చేశారని అన్నారు. దుబాయ్, అబుదాబి, లండన్, దావోస్, యూరప్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లారని, ప్రస్తుతం బాలి పర్యటనలో ఉన్నట్టు సమాచారం ఉందన్నారు.

అదే విధంగా మంత్రి నారా లోకేష్ ఇప్పటివరకు తొమ్మిది సార్లు విదేశీ పర్యటనలు చేశారని విమర్శించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రత్యేక విమానాల్లో యూరప్, అమెరికా, దావోస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, డల్లాస్, కెనడా వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఏ దేశంలో ఉన్నారన్న విషయం కూడా టీడీపీ నాయకులకు స్పష్టంగా లేదని ఎద్దేవా చేశారు.

దోచుకున్నది దాచుకోవడానికే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.2.93 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములు, సంపదను బినామీలకు అప్పనంగా ఇచ్చి, ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులుగా మార్చేందుకే తండ్రీ–కొడుకులు రహస్య విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల సంపదను దోచుకుని విదేశాల్లో దాచుకోవడమే వీరి అసలు ఉద్దేశమని ఆరోపించారు.

కూటమి ఎమ్మెల్యేల కేంద్రంగా దారుణాలు

రాష్ట్రంలో 164 మంది కూటమి ఎమ్మెల్యేల వ్యవహారాలు చూస్తే ప్రజలకు ఒళ్లు గగుర్పొడిచే పరిస్థితి ఉందని కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. అవినీతి, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్నీ కూటమి ఎమ్మెల్యేల చుట్టూనే జరుగుతున్నాయని ఆరోపించారు. మహిళలను వేధించిన ఘటనలు వీడియోలతో బయటపడుతున్నాయని, మరికొన్ని బాధితుల ఫిర్యాదులతో వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.

శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. తమిళనాడు పోలీసులు ఆయనతో పాటు అనుచరులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జనసేన–టీడీపీ నేతల ఆధిపత్య పోరులో ఒక అమాయకుడు బలైపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ రాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయినప్పటికీ, ఇప్పటివరకు ఆయన స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.