హత్యలు, అత్యాచారాల కన్నా ప్రశ్నించడమే రాష్ట్రంలో పెద్ద నేరం

14 May, 2026 17:03 IST

తాడేపల్లి: చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులున్నాయని, హత్యలు, అత్యాచారాలు చేయడం కన్నా ప్రభుత్వాన్ని విమర్శించడమే రాష్ట్రంలో అతిపెద్ద నేరం అయిపోయిందని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మలసాని మనోహర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్‌ మీడియాలో విమర్శించినా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపినా ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని చెప్పారు. మంత్రివర్గ నిర్ణయాలను పోస్టు చేసినా, ప్రెస్‌మీట్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేసినా పోలీసుల నుంచి తొలగించాలని అదేపనిగా మెటా, ఎక్స్‌కి నోటీసులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ విచిత్రంగా మన రాష్ట్రానికి సంబంధం లేని ఎవరో ఒక వ్యక్తి ఉత్తరాఖండ్‌ ప్రధాని మోడీని విమర్శిస్తూ పోస్టు చేస్తే దానికీ జగనన్న కనెక్టŠస్‌కి నోటీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
    ఇప్పటికే పార్టీ అధికారిక ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాను సస్పెండ్‌ చేయించిన పోలీసులు ఎలాగైనా జగనన్న కనెక్టŠస్‌  సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ తొలగించడానికి అదే పనిగా పాకులాడుతున్నారని ఆరోపించారు. కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించే పనిలో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు ఆదేశాలతో అమాయకులను వేధిస్తున్న పోలీసుల వివరాలను డిజిటల్‌ బుక్‌లో నమోదు చేస్తున్నామని, వారంతా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోతప్పదని మలసాని మనోహర్‌ రెడ్డి హెచ్చరించారు. 
ప్రెస్‌మీట్‌లో ఎం.మనోహర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

- రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులు:
    
ఏపీలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య సంస్కృతికి భిన్నమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులను తలపిస్తోంది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాల గొంతు నొక్కడం అలవాటైంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులను, మీడియాను, సోషల్‌ మీడియా వారియర్స్‌ని అక్రమ కేసులతో వేధిస్తున్న పరిస్ధితులతో నిర్బంధ వాతావరణం కనిపిస్తోంది. 
    పోలీస్‌ వ్యవస్థ ద్వారా ఈ ప్రభుత్వం పౌరుల మాట్లాడే హక్కును, భావ ప్రకటనా స్వేచ్ఛను కాల రాస్తోంది. దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాల కన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నేరంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్‌ మీడియా మీడియాలో ప్రశ్నించినా, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపినా, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినా ఈ ప్రభుత్వానికి అస్సలు నచ్చడం లేదు. ప్రశ్నించిన వారిని తీవ్రవాదుల కన్నా దారుణంగా పరిగణిస్తున్నారు. ఇదే సందర్భంలో టీడీపీ అనుకూల మీడియాలో ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి నీచాతినీచంగా మాట్లాడిన వారిపై చర్యలుండవు. 

- తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడటంలో పోలీసులు:

పోలీసుల ద్వారా నోటీసులు పంపించి వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక ఇన్‌స్టా ఖాతాను తొలగించారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీని పార్టీ ఎక్స్‌ హ్యాండిల్‌లో ప్రశ్నిస్తే నోటీసులు పంపారు. అద్దాలు బిగించడానికి రూ.2,540 కోట్లు ఖర్చు చేస్తున్నారని చివరకు ఎల్లో మీడియాలో వచ్చిన వార్తను పోస్టు చేసినా తప్పే. కరెంట్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించినా నేరమే. బెల్ట్‌ షాపుల్లో విచ్చలవిడిగా  విక్రయిస్తున్న నకిలీ మద్యం కారణంగా కర్నూలు బస్సు ప్రమాదం జరిగిందని ఆరోపించినందుకు అక్రమ కేసులు.

టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాసలీలల వీడియోలను పోస్టు చేసినా, రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని విమర్శించినా ఓర్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వ విధానాలను సహేతుకంగా విమర్శిస్తూ ఏ పోస్టు పెట్టినా వారికి నచ్చడం లేదు. విమర్శించడమే నేరమైనట్టు ఆ పోస్టులు తొలగించమని పోలీసుల ద్వారా  నోటీసులు పంపుతున్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీస్‌ వ్యవస్థను తన పార్టీ ప్రయోజనాల కోసం, ప్రతిపక్ష పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాను అణిచి వేయడానికి వాడుతున్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే కొంతమంది పోలీస్‌ అధికారులు వీరభక్తి ప్రదర్శిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. లేని అధికారులను ఉపయోగిస్తూ అక్రమ చర్యలకు పాల్పడుతున్నారు. 

- టీడీపీ చేయాల్సిన పనులు పోలీసులే చేస్తున్నారు:
    
ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 69 ప్రకారం, కేంద్రం రూపొందించిన నిబంధనల ప్రకారమే ఎవరైనా నడుచుకోవాల్సిందే. సోషల్‌ మీడియలో ఏదైనా కంటెంట్‌ను పోస్టు చేసినప్పుడు అనుచితంగా ఉంటే సదరు పోస్టు చేసిన వారికి నోటీసులు ఇవ్వాలి. బాధితులు, బాధ్యులు ఇద్దరి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకోవాలి. ఆ తర్వాత కమిటీకి రిఫర్‌ చేయాలి. కమిటీ సూచన మేరకు ఆ కంటెంట్‌ను ఉంచాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారు. కానీ, కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి ఏకంగా అకౌంట్‌లను సస్పెండ్‌ చేసే కుట్రలకు తెర లేపింది. సాధారణమైన విమర్శలకు కూడా అసభ్యకరమైన కంటెంట్‌ అంటూ నేరుగా మెటా, ఎక్స్‌ లకు పోలీసులే నోటీసులు పంపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నదనే కారణంతో జగనన్న కనెక్టŠస్‌ అనే ఫేస్‌బుక్, ఎక్స్‌ ఖాతాలను ఎలాగైనా తొలగించాలని వరుస కుట్రలు చేస్తున్నారు. పలు పోస్టులపై ఒకే సందేశంతో అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించాలని పలు పోలీస్‌ స్టేషన్ల నుంచి మెటా, ఎక్స్‌లకు నోటీసులు పంపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేయాల్సిన పనిని పోలీసులు చట్టాలను అతిక్రమించి చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన వాడు టీడీపీ కార్యకర్త అయితే చాలు ముందూ వెనుకా ఆలోచించకుండా పోలీసులు కేసులు నమోదు చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. 

- ఉత్తరాఖండ్‌లో మోడీని విమర్శిస్తే జగనన్న కనెక్ట్స్ కు నోటీసులా!:

ఎక్కడో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ప్రధాని మోడీని విమర్శిస్తూ పెట్టిన పోస్టుకు జగనన్న కనెక్టŠస్‌ కి లింక్‌ చేసి హ్యాండిల్‌కి నోటీసులు పంపారు. తప్పుడు కేసులకు ఇది పరాకాష్ట. పేర్ని నాని ప్రెస్‌మీట్‌ వీడియోలను పోస్టు చేసినా తొలగించమంటూ నోటీసులిచ్చారు. ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉందని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణలు అసవరం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని చెప్పడానికి ఇటీవల ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యం. శాంతి భద్రతలు విఫలమైన రాష్ట్రాల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉంది. 
    సాక్షి టీవీ కేఎస్సార్‌ లైవ్‌ షోలో వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన రూ 1200 కోట్ల పంచాయతీ నిధులు దారిమళ్లాయని ఆధారాలు చూపిస్తూ మాట్లాడితే దాని మీద కాకినాడ, సత్తెనపల్లిలో కేసులు నమోదు చేశారు. ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ప్రశ్నించే గొంతులు నొక్కడానికి ప్రభుత్వం వ్యవస్థీకృతంగా చేస్తున్న కుట్రలకు పరాకాష్ట. రెండేళ్ల పాలన పూర్తి కాకుండానే రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే నిర్ణయానికొచ్చిన చంద్రబాబు కక్షపూరత రాజకీయాలకు తెర లేపాడు.
    వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా వాస్తవాలను ఆధారాలతో సహా వివరించేవాళ్లం. కానీ నేడు ఏకంగా కేసులు పెట్టి అరెస్ట్‌ చేయడం, పోలీసులను అడ్డం పెట్టి ఏకంగా సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ తొలగించే కుట్రలు చేస్తున్నారు. డీజీపీ సహా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి వివరాలను ఆధారాలతో సహా డిజిటల్‌ డైరీలో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నాం. చట్టాన్ని ఉల్లంఘించే వీరంతా రాబోయే రోజుల్లో చట్టం ముందు నిందితులుగా నిలబడక తప్పదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఆదేశాలతో అమాయకులను ఇబ్బంది పెడుతున్న వారంతా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎం.మనోహర్‌ రెడ్డి హెచ్చరించారు.