సోషల్ మీడియా కేసులో “కింగ్‌పిన్” అంటూ విచారణ హాస్యాస్పదం
తాడేపల్లి: సోషల్ మీడియా కేసులో “కింగ్‌పిన్” అంటూ విచారణ చేయడం హాస్యాస్పదమని, హైకోర్టు స్టే ఉన్నప్పటికీ జర్నలిస్టు కేవీ రెడ్డిని విచారణ పేరుతో వేధిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మనోహర్‌రెడ్డి ఆక్షేపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ వ్యవహారం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఉందని మండిపడ్డారు.
ప్రెస్‌మీట్‌లో మనోహర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారుతోంది
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మరింత దిగజారుతోంది. తెలంగాణకు చెందిన కేవీ రెడ్డి అనే యూట్యూబ్ జర్నలిస్టుపై కర్నూలు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా మహా టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శివోహం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. “ఆ కార్యక్రమంలో మహా టీవీ యజమాని వంశీ చంద్రబాబును దేవుడితో పోల్చారు. దీనిపై కేవీ రెడ్డి ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఎక్కడా అసభ్యకరమైన అంశాలు లేవు. వంశీ మాటలతో చేసిన వీడియోను వివరించినందుకు కేవీ రెడ్డిపై కేసు పెట్టారు. ‘అమరావతికి శివుడి తర్వాత రక్షకుడిగా చంద్రబాబు ఉన్నాడు’ అని వంశీ కీర్తించారు. దానిని కేవీ రెడ్డి యూట్యూబ్‌లో విశ్లేషించారు. అందులో ఎక్కడా మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు లేవు.
వేరే మతస్థుడితో ఫిర్యాదు
తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు మందలించినప్పటికీ, సిట్ దర్యాప్తులో ప్రసాదంలో జంతు కొవ్వు లేదని తేల్చినా కూడా ఎల్లో మీడియా ప్రచారం కొనసాగుతోంది. దీనిపై వ్యంగ్యంగా వీడియో చేసిన కేవీ రెడ్డిపై హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టించారు. ఆయనపై హిందువులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయవచ్చు. కానీ ఖలీల్ అనే పేరు గల వేరే మతస్తుడితో కర్నూలు ఫోర్త్ టౌన్‌లో ఫిర్యాదు చేయించడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ముందుగా ప్రాథమిక విచారణ జరపాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానాన్ని పాటించడం లేదు.
విచారణ పేరుతో కస్టోడియల్ టార్చర్
జర్నలిస్టు కేవీ రెడ్డిని విచారణ పేరుతో మార్చి 10న కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అతను రాత్రికి ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. రాత్రంతా కస్టడీలో హింసించారు. థర్డ్ డిగ్రీ పద్ధతులు ఉపయోగించారు. వీడియో తీసి అధికార పార్టీ నేతలకు పంపించారని కేవీ రెడ్డి చెబుతున్నాడు. హేబియస్ కార్పస్ కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ, పోలీసులు కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మళ్లీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపుతున్నారు.
కింగ్ పిన్ ఎవరో చెప్పాలనడం హాస్యాస్పదం
సోషల్ మీడియా కేసులో కింగ్‌పిన్ ఎవరో చెప్పాలని కేవీ రెడ్డిని అడగడం హాస్యాస్పదం. పెద్ద ఆర్థిక నేరాల్లో ఉండే పదజాలాన్ని ఈ కేసులో ఉపయోగిస్తున్నారు. కర్నూలు సీఐ విక్రమ సింహా రాజ్యాంగ పరిమితులను దాటి వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారు. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో సోషల్ మీడియా కేసుల్లో తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, కస్టోడియల్ టార్చర్ కొనసాగుతున్నాయి. జర్నలిస్టుల భావ ప్రకటన స్వేచ్ఛను అణగదొక్కుతున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను, వారిని ప్రోత్సహించే వారిని వదిలిపెట్టం” అని ఎం. మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు.