కంది, మొక్కజొన్న రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యం త‌గ‌దు

29 Dec, 2025 13:11 IST

తాడేప‌ల్లి: రాష్ట్రంలో రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే అనేక పంటల రైతులు నష్టాల బాటలో ఉన్న సమయంలో ఇప్పుడు కంది రైతులు కూడా సంక్షోభంలోకి జారిపోయార‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం – రైతు సంక్షేమం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ యం.వై.వి.ఎస్. నాగిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

ప్ర‌క‌ట‌న‌లో ఎంవీఎస్ నాగిరెడ్డి ఏమ‌న్నారంటే..
2025–26 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది పంట పూర్తిగా వర్షాధారంగా, మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే పంటగా, సంవత్సరానికి ఒక్కసారే సాగు జరుగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,000 కాగా, ప్రస్తుతం రైతులు తమ పంటను రూ.6,500 నుంచి రూ.6,600 మధ్యనే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 

క‌ర్ణాట‌క‌లో రూ.8 వేల‌కు కొనుగోలు
ప్రక్క రాష్ట్రం కర్ణాటకలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కందిని కనీస మద్దతు ధర రూ.8,000కే కొనుగోలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి, అదే సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోకి నెట్టేస్తోంది. పంట మార్కెట్‌కు వచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలు తెరిస్తే రైతు నష్టాల నుంచి బయటపడేవారు, అలాంటి కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. కంది సాగు ప్రధానంగా అనంతపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, పల్నాడు, శ్రీ సత్య సాయి జిల్లాల్లో జరిగింది. గత సంవత్సరం కంది ఉత్పత్తి 171 లక్షల టన్నులు కాగా, ఈ సంవత్సరం అంచనా ఉత్పత్తి 117 లక్షల టన్నులకు పడిపోయింది.
గత ఏడాది హెక్టారుకు సరాసరి దిగుబడి 473 కిలోలు ఉండగా, ఈ ఏడాది అది 401 కిలోలకు తగ్గే అవకాశం ఉంది. ఉత్పత్తి, దిగుబడి రెండూ తగ్గుతున్న పరిస్థితి రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టుతోంది.

మొక్క‌జొన్న క్వింటాల్  రూ.1,500 నుంచి రూ.1,900 మధ్యే..
మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని తెలిపారు. మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 కాగా, రాష్ట్రంలో సుమారు 4.6 లక్షల ఎకరాలలో సాగు జరిగినప్పటికీ, దిగుబడులు తగ్గడంతో రైతులు క్వింటాలుకు రూ.1,500 నుంచి రూ.1,900 మధ్యే అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రక్క రాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నా, మన రాష్ట్రంలో అలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం.  గత సంవత్సరం మొక్కజొన్నకు హెక్టారుకు సరాసరి దిగుబడి 4,710 కిలోలు ఉండగా, ఈ ఏడాది అంచనా 4,254 కిలోలకు పడిపోయిందని, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఇది ఇంకా తగ్గే పరిస్థితి ఉంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అనేక పంటల రైతుల పరిస్థితి ఇదే. అనావృష్టి, అధిక వర్షాలు, తుఫాన్ల ప్రభావంతో సాగు తగ్గడం, దిగుబడులు పడిపోవడం, మార్కెట్ ధరలు కుప్పకూలడం, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు.

ఉచిత పంటల బీమా పథకం రద్దు చేయడం, కనీస పెట్టుబడి సాయం కూడా అందించకపోవడం, సున్నా వడ్డీ రాయితీ జమ చేయకపోవడం, అలాగే అన్నదాత సుఖీభవ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం  అన్యాయం. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కన్నీరు పెడుతున్న రైతుల ప‌ట్ల  ప్రభుత్వం ఎందుకు అశ్రద్ధ చూపుతోంది?.
“అన్నదాత కంట కన్నీరు మంచిది కాదు” అని ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరిస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు తెరవాలని, నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని  డిమాండ్ చేశారు.