ఏడాది కాలంగా రాష్ట్రంలో నియంత పాలన

24 Jun, 2025 16:05 IST

తాడేప‌ల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంగా రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేసి, శాంతిభద్రతలు అనే మాటకు అర్థమే లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేని దారుణమైన పరిస్థితిని తొలిసారి ప్రజలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిని గుడ్‌ గవర్నెన్స్‌ అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని మండిపడ్డారు. 

ఇంకా ఆమె ఏమన్నారంటే...

 చంద్రబాబు పాలనలో ప్ర‌జ‌ల కోసం ఏడాదిలో చేసిన మంచి ప‌ని ఒక్క‌టైనా ఉందా అంటే టార్చిలైట్ పెట్టి వెతికినా క‌న‌ప‌డ‌దు. రాష్ట్రంలో పేరుకే మ‌హిళా హోంమంత్రి. కానీ పోలీస్ వ్య‌వ‌స్థ మొత్తం లోకేష్ చెప్పు చేతల్లోనే ఉంటుంది. సాక్షాత్తు హోంమంత్రి అనిత తన వద్ద లాఠీ లేదు, భుజాన తుపాకీ లేద‌ని, తాను ఏం చేయలేనంటూ తన నిస్సహాయతను అంగీకరించింది. దీనిని బట్టి చూస్తే వైయ‌స్ జ‌గ‌న్‌ని తిట్ట‌డానికి మాత్ర‌మే ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌నిపిస్తుంటుంది. రాష్ట్రంలో వరుస‌గా మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై అత్యాచారాలు జ‌రుగుతుంటే నిందితుల‌ను ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షించాల్సిందిపోయి, వైయ‌స్ జ‌గ‌న్ మీద బుర‌ద జ‌ల్లడానికి స్క్రిప్టుతో ఆమె సిద్ధంగా ఉంటుంది. ఆమెకే మ‌న‌స్సాక్షి లేకుండా వైయ‌స్ జ‌గ‌న్‌కి మ‌న‌స్సాక్షి ఉందా అని మాట్లాడుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చాక మ‌హిళ‌ల‌పై ఇన్ని ఘోరాలు జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ దిశ యాప్‌ను రూపొందించి అమ‌లు చేస్తే, కూట‌మి ప్ర‌భుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. దిశ యాప్‌ను స‌రిగ్గా అమ‌లు చేసి ఉంటే అనంత‌పురంలో 14 ఏళ్ల బాలిక మీద 18 మంది రెండేళ్లుగా అత్యాచారం చేసేవారా? ఇదే అనంత‌పురంలో  ప్రేమోన్మాది అకృత్యానికి త‌న్మ‌య్ అనే బాలిక బ‌ల‌య్యేదా? శ‌్రీకాకుళం నుంచి కడ‌ప వ‌ర‌కు చిన్నారుల మీద దాడులు జ‌రుగుతుంటే ఒక్కదాని మీద‌నైనా వేగంగా స్పందించి నిందితుల‌ను శిక్షించిన దాఖ‌లాలు ఉన్నాయా? 

అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు

రాజకీయాల్లో ఓన‌మాలు కూడా నేర్చ‌ని లోకేష్ చేతికి పెత్త‌నం ఇచ్చి చంద్ర‌బాబు డ‌మ్మీ అయిపోయాడు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో  తండ్రీకొడుకులిద్ద‌రూ క‌లిసి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏం నేరం చేసినా వారిపై కేసులుండ‌వు. మ‌హిళ‌ల‌పై దారుణాలు చేస్తున్నా శిక్ష‌లుండ‌వు. కానీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నించినా, వైయ‌స్ జ‌గ‌న్‌కి అభిమానులుగా ఆయ‌న ప‌క్షాన నిల‌బ‌డినా కేసులు పెట్ట‌డానికి వారికి చ‌ట్టంతో ప‌నిలేదు. న‌చ్చిన సెక్ష‌న్ల కింద‌ కేసులు పెట్టి వేధిస్తారు. సాక్షిలో ప‌నిచేస్తున్నాడ‌నే కార‌ణంతో తాను చేయ‌ని నేరానికి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేనిపై అక్ర‌మ కేసు పెట్టి 70 ఏళ్ల వ‌య‌సులో జైలుకు పంపి క‌క్ష‌తీర్చుకున్నారు. ఈ రాక్ష‌స పాల‌న ఎప్పుడు పోతుందా అని మ‌హిళ‌లు ప్రార్థిస్తున్నారు. నారాసుర పాల‌న పోయి జ‌గ‌న్నాథుడు ఎప్పుడొస్తాడా అని ప్ర‌జ‌లు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇది గుడ్ గ‌వ‌ర్నెన్స్ కాదు.. వెరీ వెరీ బ్యాడ్ గ‌వ‌ర్నెన్స్‌.. దారుణాలు చేస్తూ ఎల్లో మీడియాలో మంచి చేశామ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇది ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్నారు. ఏడాది పాల‌న‌తోనే అప్పుల‌తో రాష్ట్ర దివాళా తీసింది. 

వైయ‌స్ జ‌గ‌న్‌ని తిట్టిపోవ‌డానికే ప‌వ‌న్‌కి డిప్యూటీ సీఎం ప‌ద‌వి

ప‌వ‌న్ క‌ళ్యాన్ గురించి ఎంత‌త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఆయ‌న‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు, ఎదిరించే త‌త్వం అస్స‌లు లేవు. ఎన్నిక‌ల‌కు ముందు మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు నాదీ పూచీ అని ఏవేవో మాట‌లు చెప్పి, ఇప్పుడు స‌నాత‌న ధ‌ర్మం పేరుతో పంచె క‌ట్టి దేశంలో తిరుగుతున్నాడు. చంద్ర‌బాబు పిలిచిన‌ప్పుడ‌ల్లా వచ్చి వైయ‌స్ జ‌గ‌న్‌ని తిట్టిపోవ‌డానికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి తీసుకున్నాడు. ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీలు అమ‌లు చేసింది లేదు. రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించిన పాపాన పోవడం లేదు. మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త కరువైంది. విద్య‌, వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతే సుపరిపాల‌న అందించామ‌ని ఎలా చెప్పుకుంటున్నారో అర్థం కావ‌డం లేదు. యోగాలు, గుడ్ గ‌వ‌ర్నెన్స్‌, పీ4 లు.. ఇలా ఈవెంట్‌లు ఏర్పాటు చేసుకుని విచ్చ‌ల‌విడిగా ప్ర‌జ‌ల సొమ్ము ఖ‌ర్చు చేయ‌డం త‌ప్పించి ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేదు. టీడీపీ, జ‌న‌సేన చేస్తున్న అరాచ‌కాల‌కు బీజేపీ అధ్య‌క్షురాలు పురంధీశ్వ‌రి కూడా వంత‌పాడుతున్నారు. మ‌హిళ‌ల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నా ఆమెకు చీమ‌కుట్టిన‌ట్ట‌యినా ఉండ‌టం లేదు. దీపం ప‌థ‌కం స‌హా మ‌హిళ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఇచ్చిన  ఏ హామీలు అమ‌లు కాలేదు. మాయ‌మాట‌ల‌తో ఓటేయించుకుని అధికారంలోక వ‌చ్చాక వెన్నుపోటు పొడిచారు.