ఊతక్రర కోసం టీడీపీ ప్రయత్నాలు

8 Aug, 2022 18:07 IST

తాడేపల్లి: ఎన్నికల్లో గెలవడానికి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఊతక్రర కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును పిలిచినట్లుగా కలరింగ్‌ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ప్రజల బాగోగులు పట్టవని, వెంటలేటర్‌పై ఉన్న తన పార్టీని ఎలా కాపాడుకోవాలన్నదే ఆయన తపనగా కనిపిస్తుందన్నారు. ఆయన ప్రజలకు  ఒక్క మంచి పని కూడా చేయలేదని, ఢిల్లీ వెళ్లి ఏం చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎప్పుడు ఒంటరిగా గెలవలేని టీడీపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ సహకారం కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజల సంక్షేమమే ఎజెండాగా ఉంటుందని, దీర్ఘకాలం ప్రజలకు మేలు చేసే విధంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, ఎన్నికల్లో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశారన్నారు. వైయస్‌ జగన్‌ అంటే ప్రజలని, ఆయనకు ప్రజలపైనే నమ్మకం ఉందని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

*+బాబుకు ఎందుకంత పులకరింపు?
    ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌పై ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో భేటీ తర్వాత చంద్రబాబునాయుడు ఎందుకంతగా పులకరించాడు? గతంలో ప్రధాని మోదీని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు తిట్టారు. మొన్న ఢిల్లీలో సమావేశం తర్వాత అందరినీ కలిసినట్లుగానే, ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, చంద్రబాబును కూడా కలిశారు. ఓ అయిదు నిమిషాలు మాట్లాడారు. మరి మోదీని తిట్టిన ఆ నోటితోనే ఆ 5 నిమిషాలు మహర్భాగ్యం అన్నట్లుగా ఎల్లో మీడియా విపరీత ప్రచారం చేశారు. అది చూస్తుంటే చంద్రబాబు దిగజారుడులో మరో ఛాప్టర్‌ ఇక మొదలైందనుకోవాలి.

డిన్నర్‌ టేబుల్‌పై గంటసేపు:
    నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో కలిసి డిన్నర్‌ చేశారు. ఆ టేబుల్‌పై కూర్చునే అవకాశం కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులకే వచ్చింది. అప్పుడు గంటకు పైగా అనేక అంశాలపై చర్చ జరిగింది. అయినా జగన్‌గారు దాన్ని ఎక్కడా ప్రస్తావించ లేదు. ప్రచారమూ చేసుకోలేదు.
    నిజం చెప్పాలంటే చంద్రబాబుకు విపరీతంగా అభద్రతా భావం ఏర్పడింది. అందుకే మోదీ పలకరింపులంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.

సెల్ఫ్‌ మోటివేషన్‌. హిప్నటిజమ్‌:
    2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి, వెంటిలేటర్‌ దశకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ, ఈ మూడేళ్లలో జరిగిన ఏ ఒక్క ఎన్నికల్లో కూడా కనీసం ఉనికి చాటుకోలేకపోయింది. అదే 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నెరవేర్చారు. వాటికి మించి కూడా ఆయన అనేకం అమలు చేశారు. ప్రజలతో మమేకం అవుతూ, వారికి మరింత చేరువ అవుతున్నారు.
    మరోవైపు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు నిద్రలో కలవరిస్తున్నట్లు మళ్లీ మేమే వస్తాము అని చెప్పుకుంటున్నారు. ఒకటికి పది సార్లు చెప్పిందే చెబుతూ, ఏదో విధంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి వారు సెల్ఫ్‌ మోటివేషన్, సెల్ఫ్‌ హిప్నటిజమ్‌ చేసుకుంటూ, పూర్తి నిరాశ, నిస్పృహలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం పెంపొందించేలా నీతి తప్పి, గతి తప్పి వ్యవహరిస్తున్నారు.

ప్రజలే అంతిమ నిర్ణేతలు:
    ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజలే ఆదరించాలి. ఏ పని చేసినా ప్రజల ఎజెండా ఉండాలి. అంటే వారి కోసమే పని చేయాలి. ఇది జరగకపోతే, ప్రజాస్వామ్యం అనే వ్యవస్థే ఉండబోదు. ప్రజలను ఏదో ఒకసారి భ్రమల్లో ఉంచొచ్చు కానీ, ఎప్పటికీ అది సాధ్యం కాదు.
    ఒకప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురులేదు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఆ పార్టీని ఓడించి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు వైయస్సార్‌గారు. ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీని మట్టికరిపించారు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. 

ఢిల్లీలోనూ అవే మాటలు:
    వాస్తవాలు ఇలా ఉన్నా, ఎన్నికలు ఇంకా రెండేళ్ల తర్వాత ఉన్నా, చంద్రబాబు తన విన్యాసాలు వీడడం లేదు. ఎందుకంటే ఆయనకు తెలిసిన విద్యలు ఇవే కాబట్టి. తాజాగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, అక్కడ కూడా బట్టీ పట్టిన మాటలు చెబుతున్నాడు. రాష్ట్రంలో జగన్‌గారిని సాగనంపడానికి ప్రజలు సిద్ధమవుతున్నారంటూ, అక్కడి మీడియాకు చెప్పుకొచ్చారు. అలా తన విన్యాసం మొదలుపెట్టారు.
    చంద్రబాబును ప్రజలు ఛీత్కరించి మూడేళ్లు అవుతోంది. ఆయనను చిత్తుగా ఓడించారు. ఆ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారు. గతంలో రాష్ట్రంలో తన పాలన ఎలా ఉంది? ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? మళ్లీ తాము వస్తే ఏం చేస్తామనేది చెప్పడం లేదు.

లోపాయికారి ఒప్పందం–ప్రయత్నం:
    కానీ చంద్రబాబు అవేవీ చేయకుండా కేవలం ఊతకర్రల కోసం చూస్తున్నాడు. పోనీ ఆ విషయాన్ని కూడా ఆయన ఒప్పుకోవడం లేదు. భేషజాలకు పోతున్నాడు. ఆ పార్టీ (బీజేపీ) వారే తన వెంట పడుతున్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారు. ఆ దిశలో ఎల్లో మీడియా ప్రొజెక్టు చేసింది. దీన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారు.
    ఇది మీ ఇల్లే అనుకొండి. మీరు ఎప్పడైనా రావొచ్చు అని ప్రధాని మోదీ అన్నట్లు ఎల్లో మీడియాలో రాశారు. దీన్ని బట్టి ఏం అర్ధమవుతుంది అంటే, తెలంగాణలో బీజేపీకి ఉపయోగపడే విధంగా తాము, పవన్‌కళ్యాణ్‌ పని చేస్తామని, అందుకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌లో తమకు సహకరించమని కోరుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఇప్పుడు కాదు. గత నాలుగైదు నెలలుగా కొనసాగుతోంది.
    వాస్తవానికి రాష్ట్రానికి సంబంధించి, ఏం చేస్తామనేది కాకుండా, తెలంగాణలో మద్దతు ఇస్తామని చెప్పడం ఏమిటి? ఇదేమన్నా వన్‌ ప్లస్‌ వన్‌ విధానమా?

చంద్రబాబు విలువలేని రాజకీయాలు:
    అసలు బీజేపీకి చంద్రబాబుపై అంత విశ్వాసం ఉందా? ఆయన వల్ల నిజంగా ఆ పార్టీకి ప్రయోజనం ఉంటుందా? 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు చంద్రబాబు మద్దతు ఇచ్చాడు. ఎన్నికలు అయిపోగానే, బిజేపీ వైపు మొగ్గు చూపాడు. 2014లో మోదీ, బీజేపీ, టీడీపీ, జనసేన.. అందరూ ఒకటయ్యారు. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ అధికారం పంచుకున్నాయి. ఆ తర్వాత బీజేపీ పుట్టి మునుగుతోందని భావించిన చంద్రబాబు, తనకు కావాల్సినవన్నీ రాబట్టుకుని, ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి, 2019 ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని భావించి, కాంగ్రెస్‌తో జత కట్టి, ఏకంగా ప్రచారమే చేశాడు.
    ఇక ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదట. అదే మాట పవన్‌కళ్యాణ్‌ కూడా చెబుతున్నాడు. ఇదీ చంద్రబాబు రాజకీయం.
ఎంతసేపూ ఇలాంటి విన్యాసాలు, పిల్లిమొగ్గలు వేయడం కాకుండా, తనకు తాను ఇది చేశాను అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? 

జగన్‌గారి విలువల రాజకీయం:
    చంద్రబాబు ఏ పని చేసినా, ఓట్ల కోసమే. స్వార్థ రాజకీయం కోసమే. అదే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ది ఒకే ఎజెండా. అదే ప్రజా ఎజెండా. నిరుపేదల సంక్షేమం. అన్ని వర్గాల అభివృద్ధి. ఆ దిశలోనే చిత్తశుద్ధితో పని చేయడం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం. ముక్కుసూటిగా వ్యవహరించడం. చేసేదే చెప్పడం. దాన్ని పక్కాగా చేసి చూపడం. దీన్ని ప్రజలు కూడా గట్టిగా నమ్ముతున్నారు.

బరి తెగించి విచ్చలవిడి రాతలు:
    ఒక సమావేశం తర్వాత మామూలుగా పలకరించడం సహజం. రైల్వే ప్లాట్‌ఫామ్‌ మీద కనబడినా మాట్లాడుకుంటారు. ఇది కూడా కామన్‌. చంద్రబాబు, మోదీ కలుసుకున్నప్పుడు, ఏవైనా మాట్లాడుకోవచ్చు. ఆరోజు మీరు వచ్చి కేవలం మట్టి మాత్రమే ఇచ్చారని అడిగి ఉండొచ్చు. నన్ను అంత తిట్టి మళ్లీ నా దగ్గరకు ఎందుకు వచ్చావు అని అడిగి ఉండొచ్చు. ఎవరికి తోసింది వారు అనుకోవచ్చు.
    విషయం ఇంత క్లియర్‌గా ఉన్నప్పటికీ, వారు బరి తెగించారు. ఎల్లో మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాసుకొచ్చారు. అందుకే వారిమీద జాలి కలుగుతోంది. అలా ఎప్పుడు రాస్తారంటే, కనీసం ఉనికి కూడా లేకుండా పోయినప్పుడు.      అందుకే చంద్రబాబు తన వైఖరి మార్చుకోకుండా, ప్రజలకు దగ్గర కాకుండా, ఎప్పటికప్పుడు తన పద్ధతి మార్చుకోకుండా, అదే మూస పద్ధతిలో పని చేస్తున్నారు.

    చంద్రబాబు ఇంకా పాతకాలంలోనే ఉన్నాడు. అందుకే అవే ఎత్తుగడలు, మానసిక స్థితిలో ఉన్నాడు. కాబట్టి, ఆయన మానసిక స్థితిని ఒకసారి చెక్‌ చేయించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంకా చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలి. జగన్‌గారి సంక్షేమ పాలన చూడాలి. తానూ అలా చేసి ఉంటే, బాగుండేది అనుకోవాలి.
    గతంలో చంద్రబాబు చిన్నాయన ఎవరో చెప్పారట.. రాజశేఖర్‌రెడ్డి గారి పాలన చేసి నేర్చుకోమని. నీవు అలాంటి పాలన చేస్తే బాగుండేది అని అన్నాడట. చంద్రబాబు ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోకపోతే, భవిష్యత్తులో ఆయన మనవడు మళ్లీ అవే మాటలు చెబుతాడేమో..

 మార్ఫింగ్‌ కాకపోతే చర్య తప్పదు:

    ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారానికి సంబంధించి, గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాం. ఆ వీడియో వాస్తవమని తేలితే తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. ఇవాళ టీడీపీ నాయకులు ఎవరో మాట్లాడారు. ఆ వీడియో వాస్తవమా? కాదా? అన్నది తేల్చడం చాలా సులభం. ఇన్ని రోజులు అవసరం లేదు. అరగంట చాలని అన్నారు.
    మరి 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు చంద్రబాబు, తన అనుంగు అయిన రేవంత్‌రెడ్డి ద్వారా ఏకంగా రూ.50 లక్షలు ఇచ్చి పంపాడు. ఆ తర్వాత ఆయనే స్వయంగా మాట్లాడాడు. అయినా ఇప్పటి వరకు, ఓటుకు కోట్లు కేసులో ఆ గొంతు చంద్రబాబుది అని తేల్చలేదు. నిజానికి అది తన గొంతు కాదని చంద్రబాబు చెప్పాలి. 
    ఇక్కడ ఒక ఎంపీకి సంబంధించి మాట్లాడిన వీడియోకాల్, వేరే ఫోన్‌లో రికార్డు చేశారు. అందులో ఎవరున్నారో తెలియదు. ఎవరు రికార్డు చేశారో తెలియదు. అయినా ఏదేదో జరిగిపోయినట్లు, మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే భంగం కలిగినట్లు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు. మళ్లీ చెబుతున్నాం. ఆ వీడియో మార్ఫింగ్‌ కాదని తేలితే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఆ రిపోర్టు రావడానికి కొంత సమయం పడుతుంది.

ప్రజల విశ్వాసమే కీలకం:
    ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలి. వారి విశ్వాసం పొందనంత కాలం, ఎవరు, ఎంతగా జత కట్టినా ప్రయోజనం ఉండదు. అది ఎక్కువకాలం నిలబడబోదు. మా పార్టీ ప్రజలను నమ్ముకుంది. వారి కోసమే పని చేస్తోంది. రేపు వచ్చే ఎన్నికల్లో అందరూ కట్ట కట్టుకుని వస్తే, వారి ఉద్దేశం ఏమిటి? దాని వల్ల ఎవరికి ప్రయోజనం? వంటివన్నీ ప్రజలకు వివరిస్తాం. వారు స్వార్థం కోసం ఎలా జత కట్టారనేది కూడా చెబుతాం.
    చంద్రబాబు ఎప్పుడు ఏం చేసినా మోసం, భ్రమలో పెట్టడం తప్ప, ఆయన ఏనాడూ ప్రజల మనిషి కాదు. ఈ విషయం ప్రజలకు కూడా అర్ధమైంది. అందుకే చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మబోరు.

మాకు ప్రచార యావ లేదు:
    పరిపాలన వికేంద్రీకరణ, వ్యవసాయానికి ప్రాధాన్యం, ఆ దిశలో తీసుకున్న చర్యలు.. అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు. వీటన్నింటినీ నిన్నటి నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో వివరించారు. దానికి ఆయనకు ప్రశంసలూ లభించాయి. నీతి ఆయోగ్‌ సమావేశం వేరు. గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం వేరు. మాకు ప్రచారం మీద యావ ఉంటే, నిన్న సీఎంగారు ప్రధానితో కలిసి లంచ్‌ చేశారు. కావాలంటే మేము ఆ ఫోటోలు, వీడియోలు చూపి, ప్రచారం చేసుకోవచ్చు. కానీ మేము చంద్రబాబు మాదిరిగా ప్రచారాన్ని నమ్ముకోలేదు. ప్రజలను నమ్ముకున్నాం.