హామీల అమలుపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే
తాడేపల్లి: ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి వారి కుటుంబసభ్యుల పేరుతో పథకాల ద్వారా ఎంతెంత మొత్తం ఇస్తారో హామీ ఇస్తూ సంతకాలు చేసి ఇచ్చిన బాండ్‌లపై చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దీనిపై వైయస్ఆర్సీసీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రశ్నిస్తే, సీఎం చంద్రబాబు తాటతీస్తానంటూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో సీఎంగా ఉన్న తాను ప్రజలకు జవాబుదారీననే విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారా అని మండిపడ్డారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
వైయస్ జగన్ ఇటీవల మీడియా సమావేశంలో ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేశారు. అన్ని ఆధారాలతో సహా మాట్లాడారు. వాటికి బదులివ్వకుండా సినిమా డైలాగ్‌కు సంబంధించిన రప్పా...రప్పా అనే అంశంపై మాత్రం స్పందించారు. తనను ప్రజలు మాత్రమే అడగాలి, వైయస్ఆర్‌సీపీ అడిగితే తాట తీస్తాను అని చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబును ప్రజలు వచ్చి అడిగేందుకు అవకాశం కల్పిస్తారా? మీరు చేయని వాటిని ప్రతిపక్షం తన బాధ్యతగా అడుగుతుంది. దానికి సమాధానం చెప్పాలిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అంతేకానీ తాట తీస్తానంటూ ఎలా మాట్లాడతారు? అంతకు ముందు భూస్థాపితం చేస్తానంటూ బెదిరించారు. వైయస్ జగన్ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానాలు లేవు.
పథకాల ష్యూరిటీకి గ్యారెంటీ ఏదీ?
ఎన్నికలు ముందు ఇంటింటికి వెళ్ళి మూడు రకాలుగా మోసం చేశారు. సంతకం, డేట్‌తో సహా ఒక బాండ్ రూపంలో ప్రజలకు తన హామీలపై పత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు 'బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ' పేరుతో ఓటర్ల ఇంటికి వెళ్ళి వారి పేరుతో డిజిటల్ సంతకాలు పెట్టి మరీ గ్యారెంటీ పత్రాలను అందించారు. ఇందులో ఆ ఇంట్లోని కుటుంబసభ్యులు ఎంత మంది, వారిలో ఎవరెవరికి ఏఏ స్కీంలు వస్తాయి, అయిదేళ్ళలో వారికి అందించే మొత్తం ఎంత అనే వివరాలతో సహా పత్రాలను అందించారు. ఓటర్లకు ఈ మేరకు క్యూఆర్ కోడ్‌తో సహా ఉన్న కార్డ్‌లను కూడా అందించారు. వీటిని చూపించి ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన బాండ్‌ల్లోనే జూన్ 2024 నుంచి ఈ అన్ని పథకాలు వర్తిస్తాయి, ఆ సొమ్ము అందచేస్తామని గ్యారెంటీ ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, గత వైయస్ఆర్‌సీపీ అమలు చేసిన పథకాలను కూడా అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారని అడిగారు.
ప్రజలను డైవర్ట్ చేసేందుకే లిక్కర్ స్కాం సృష్టి
చంద్రబాబు హామీల అమలుపై సమాధానం చెప్పలేక, లేని స్కామ్‌లను సృష్టించి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే లిక్కర్ స్కామ్ అనే బేతాళకథను సృష్టించారు. 371 కోట్ల పేజీల డేటాను డిలీట్ చేశారని, అయినా కూడా మేం సమాచారం సేకరించామని చెప్పుకున్నారు. రూ.౩ వేల కోట్ల లిక్కర్ స్కామ్ అంటూ మాట్లాడుతున్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా స్కామ్ జరగని విధానంలో, అత్యంత పారదర్శకంగా జరిగిన పాలసీలో అక్రమాలు ఎలా జరుగుతాయి? అటు లిక్కర్ వ్యాపారులకు రావాల్సిన లాభాలు కూడా కొత్త పాలసీ వల్ల తగ్గాయి, అలాగే కొత్తగా ఏ ఒక్కరికీ అనుమతులు కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎవరు ముడుపులు ఇస్తారు? కసిరెడ్డి రాజ్‌కు ఉన్న ఆస్తులన్ని కూడా లిక్కర్ స్కామ్ ద్వారా సంపాధించినవేనని అంటారు, ఈ జరగని స్కామ్ నుంచి సంపాధించిన సొమ్ముతో టాంజానియాలో ఫ్యాక్టరీలు పెడుతున్నారంటూ కథ మీద కథ అల్లుకుంటూ పోతున్నారు. నారా లోకేష్ ఇటీవల అమెరికా వెళ్ళి వచ్చారు. పలువురిని కలిసి వచ్చారు. హెరిటేజ్, నిర్వాణ ఇలా ఆయన పెట్టిన కంపెనీలకు కూడా ఏదో చేసుకుంటూ వెళ్ళాడని ఎవరో అంటారు. ఆయన గన్‌మెన్లను బెదిరించి వారితో ఆ మేరకు స్టేట్‌మెంట్లు రాసుకుని అవినీతి జరిగిపోయిందంటూ ఒక కథ అల్లవచ్చు కదా? ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు దానికి కూడా ఒక హేతుబద్దత ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం చెబుతున్నది చూస్తుంటే, లిక్కర్ స్కామ్ ద్వారా ఆర్జించిన దానితో ఎన్నికల్లో పంచారని ఒక వైపు చెబుతున్నారు, మరోవైపు విదేశాల్లో ఫ్యాక్టరీలు పెట్టారని అంటున్నారు, కసిరెడ్డి ఆస్తులను కొన్నాడని ఇంకోవైపు చూపుతున్నారు. దీనికి అసలు తలాతోకా ఉందా? ఇంత స్కామ్ జరిగితే కార్పోరేషన్‌లో పనిచేసిన అధికారులను ఎలా వదిలేశారు?
బేతాళ కథల్లో ఇంకా ఎన్ని పాత్రలు వస్తాయో
చంద్రబాబు ధీమా ఏమిటీ అంటే ఈ రోజు మాట్లాడినది రేపు ప్రజలు మరిచిపోతుంటారు, డెయిలీ సీరియల్ మాదిరిగా లిక్కర్ స్కామ్‌ను నడపాలని అనుకుంటున్నారు. దీనిలో ఇంకా ఎన్ని పాత్రలు వస్తాయో తెలియదు. నిజంగా వైయస్ జగన్ కు ఉన్నంత నిబద్దత చంద్రబాబుకు ఉంటే పథకాల అమలుకు సంబంధించిన వార్తలు పత్రికల్లో పతాక శీర్షికలతో వస్తాయి. కానీ ఏడాది చంద్రబాబు పాలనలో డొల్ల తప్ప ఏమీ లేదు. రూ.1.59 లక్ష కోట్ల అప్పులు మాత్రం చేశారు. ప్రజలకు చేసింది ఏమీ లేదు. అందుకే పత్రికల్లో వస్తున్న బ్యానర్లు బేతాళకథ లిక్కర్ స్కామ్‌కు సంబంధించినవే. అసలైన లిక్కర్ స్కామ్ అంటే 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన అవినీతి, దానిని అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తూ నమోదు చేసిన కేసు. ఏడాదికి రూ.1300 కోట్లు ప్రివిలైజ్ ఫీజులను ఎటువంటి రిప్రజెంటేషన్స్ రాకుండానే ముందుగానే రద్దు చేశాడు. తరువాత తాను చేసిన తప్పును గుర్తించి అసోసియేషన్ల నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. అయిదేళ్ళకు గానూ దాదాపు రూ.5000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కేవలం నాలుగైదు కంపెనీలే మొత్తం మద్యంను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. అలాగే మద్యం సిండికేట్‌ను ప్రోత్సహించారు. ఆ స్కామ్‌ను నీరుగార్చేందుకు కొత్తగా బేతాళకథగా లిక్కర్ స్కామ్‌ను తెరమీదికి తీసుకువచ్చారు. చంద్రబాబుకు వంతపాడే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రోజూ డెయిలీ సీరియల్ మాదిరిగా వార్తలను వండివారుస్తున్నారు. ప్రజలు విసిగేసి ఆ పత్రికలను ఆపేస్తే తప్ప, రోజూ మొహం మీద గుద్దినట్లుగా ఇవే తప్పుడు వార్తలను ప్రచురిస్తూనే ఉంటారు.
ఈవెంట్లతో కాలం గడిపేస్తున్నారు
ప్రజల దృష్టిని మళ్ళించేందుకు మధ్యమధ్యలో యోగా, పోలవరం, అమరావతి శంకుస్థాపనలు అంటూ ఈవెంట్లను తీసుకువస్తుంటారు. ఈ సందర్భాల్లోనూ వైయస్ జగన్ గురించే మాట్లాడతారు. అధికారంలో ఉన్నాం, ప్రజలకు సమాధానం చెప్పాలనే ఆలోచన లేదు. డెబ్బై ఏళ్ళ వయస్సును అడ్డం పెట్టుకుని ప్రశ్నిస్తే తాటతీస్తాను అని చంద్రబాబు అంటారు, ఇక ఆయన కుమారుడు ఏదేదో మాట్లాడతారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య అసలు కనిపించడం లేదు, ఫైనాన్స్ మంత్రి ఆర్థిక అంశాలు తప్ప అన్ని మాట్లాడతారు. తనను టీడీపీలో ఎవరూ పట్టించుకోవడం లేదని పాపం బుచ్చయ్యచౌదరి ఏకంగా వైయస్ జగన్ తల నరుకుతాను అని మాట్లాడతాడు. సత్తెనపల్లిలో ప్లకార్డ్ పట్టుకున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వైయస్ఆర్‌సీపీ నాయకుడిపైన నెపాన్ని మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యువకుడు టీడీపీ కార్యకర్త అని చాలా స్పష్టంగా సభ్యత్వ కార్డు కనిపించినా సరే దానిని గురించి మాట్లాడరు. ఇప్పుడు యోగా అంటూ ప్రజలు హామీల గురించి అడగకుండా యోగనిద్రలో ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించి తన ప్రశాంతతను భంగం కలిగించవద్దని కోరుతున్నారు. చంద్రబాబు తనను నేరుగా ప్రజలే ప్రశ్నించాలని అంటున్నారు. కాబట్టి ప్రజలు తమ వద్దకు వచ్చే టీడీపీ నాయకులకు గతంలో వారు ఇచ్చిన బాండ్‌లను చూపి, వడ్డీతో సహా వాటిని చెల్లించాలని కోరాలి.
యోగా చేసే వారిలో కనిపించే ప్రశాంతత చంద్రబాబులో ఏదీ?
చంద్రబాబు విశాఖపట్నంలో యోగా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగాసనాలు చేస్తే, వారి మాటల్లో ప్రశాంతత, పరిపక్వత, స్థితప్రజ్ఞత కనిపిస్తాయి. కానీ చంద్రబాబులో మాత్రం ఇటువంటి లక్షణాలు ఏ మాత్రం లేవు. ఆయన ముఖంలో క్రూరత్వం, కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చి, ప్రజానాయకుడిగా ఎదిగిన వ్యక్తి కాదు. మామ ఎన్టీఆర్ సృష్టించిన పార్టీని, అధికారాన్ని అడ్డదోవలో చేజిక్కించుకున్న నాయకుడు చంద్రబాబు. అందుకే ఆయనలో ఎప్పుడూ తాను ప్రజలకు బాధ్యుడిని అనే భావం కనిపించదు. ప్రజల తరుఫున మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన ఎప్పుడూ సూటిగా సమాధానం చెప్పడు. ఆయన చేసేదంతా ఎదుటివారి మీదకు నెట్టేసే ఘనుడు. యోగా దినోత్సవం పేరుతో ఇంత డబ్బు వృధా చేసే బదులు రుషికొండ వంటి భవనాలు నిర్మించవచ్చు కదా అని ఎవరో అడిగితే దానిపై చంద్రబాబు క్లాస్ పీకేశాడు. మరోపక్క గంజాయి అమ్మితే తాట తీస్తాను అని అంటున్నాడు. వైజాగ్ వీధుల్లో గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కుప్పంలో మహిళ మీద జరిగిన దాష్టీకం వైయస్ జగన్ పుణ్యమే అంటూ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు.
ఈవెంట్ల మీద ఉన్న శ్రద్ద రైతుల మీద లేదు
చంద్రబాబు తనకు ప్రచారం కల్పించే ఈవెంట్ల మీద ఉన్న శ్రద్ద రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న ప్రజలు, రైతుల మీద లేదు. రాష్ట్రంలో మద్దతుధర లభించక రైతులు అల్లాడుతున్నారు. ఇటీవలే వైయస్ జగన్ గుంటూరు మిర్చియార్డ్, పొదిలి పొగాకు వేలం కేంద్రాలకు వెళ్ళి రైతుల పక్షాన మాట్లాడారు. మిర్చి రైతులను వైయస్ జగన్ కలవగానే సీఎం చంద్రబాబు సీఎంకు లేఖ రాశారు. తరువాత ఒక ప్రతినిధి బృందం కేంద్ర మంత్రిని కలిసింది. ప్రస్తుతం ఏపీలో ఎంత రేటు ఉందో, రైతులు కోరుతున్న మద్దతుధరకు దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం ఇస్తుందని ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. కేంద్రం దానికి అనుగుణంగా ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? కేవలం ఏదో జరిగిపోతోందనే విధంగా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. పొగాకు రైతుల విషయంలో రాష్ట్రంకు వచ్చిన కేంద్ర మంత్రికి వివరించారు. ఆయన మేం చూసుకుంటామని హామీ ఇచ్చేశారంటూ తన అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి కిలో కేవలం రూ.4కే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీలు మామిడి కొనుగోలు చేయకుండా, ధరలు పడిపోయేలా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది. మార్కెట ఇంట్రవెన్షన్ ద్వారా ఎందుకు కొనుగోలు చేయడం లేదు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగేది. కూటమి ప్రభుత్వం మాత్రం మేం ఫ్యాక్టరీలను ఆదేశించాం, కానీ వారు కొనుగోలు చేయడం లేదని చెబుతున్నారు.
ప్రజల గురించి ఆలోచించే తీరిక లేదు
గత ఇరవై రోజులుగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం చంద్రబాబు, లోకేష్‌లు, మంత్రులు వైజాగ్ వెళ్ళి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదే క్రమంలో రైతుల పంటల గిట్టుబాటు కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే అక్కడికి వెళ్ళే తీరిక మాత్రం వారికి లేదు. ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? శాంతిభద్రతల విషయంలో అత్యంత దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. రోజూ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతుంటే, సీఎంగా చంద్రబాబు దానిని అడ్డుకునేందుకు ఏం చేస్తున్నారు? కేవలం రాజకీయ కక్షసాధింపులకు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని వాడుతున్నారు. దాని ఫలితమే నేడు రాష్ట్రంలో కనిపిస్తున్న దారుణాలు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం, తెనాలిలో నడిరోడ్డుపై యువకులను హింసించడం, తప్పుడు కేసులు పెట్టడం, జైళ్ళకు పంపడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటిల్లోనే చంద్రబాబు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంమే ఇందుకు నిదర్శన. ఇక మెగా డీఎస్సీ గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు తన అనుకూల మీడియాలో తన పాలనను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం ప్రజలను తాము అనుకుంటున్నదే నిజం, రాష్ట్రం అలాగే ఉండాలి, దానికోసం ఎన్ని అప్పులు చేసినా ఫరవాలేదు అన్నట్లుగా భ్రమలు కల్పిస్తున్నారు. ఆ ధైర్యం నుంచి ఆయన దబాయింపులు వస్తున్నాయి.