చంద్రబాబు మెప్పు కోసమే నోరు పారేసుకుంటున్న ఆదినారాయణరెడ్డి

6 Nov, 2025 15:38 IST

ప్రొద్దుటూరు:  ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాపకం కోసమే  ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒళ్లంతా విషం నింపుకుని, సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి  మరల్చేందుకే వైయస్.జగన్ దంపతులపై అసందర్భ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 
రాజకీయాలకు సంబంధమే లేని భారతమ్మ ప్రస్తావన తేవడంపై రాచమల్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దానికి పైగా వేలాది మంది పేద పిల్లలతో పాటు దివ్యాంగులకు ఉచితంగా స్కూలు నిర్వహిస్తూ.... సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆమెపై ఇంగితం లేకుండా ఆరోపణలు చేస్తున్న ఆదినారాయణరెడ్డి తన తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. 2029 ఎన్నికల తర్వాత ఎవరేమవుతారో రాష్త్ర ప్రజలు నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు. 
ఇంకా ఆయన ఏమన్నారంటే...


ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికే...

బీజేపీ బీఫామ్ తో గెలిచి.. పచ్చ కండువా కప్పుకుని.. కేవలం చంద్రబాబు నాయుడి రాజకీయ కోరికలు నెరవేర్చడానికే ఆదినారాయణరెడ్డి ఒళ్లంతా విషం నింపుకుని మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రస్థాయికి చేరిన నేపధ్యంలోనే ... అవసరం లేకపోయినా, అసందర్బం అయినా విషం చిమ్మేలా చంద్రబాబు కోసం మాట్లాడుతున్నాడు. ఆరోగ్యశ్రీ నిల్చిపోయి ప్రజలుఅల్లాడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఆగిపోయి పిల్లలు కాలేజీలకు పోకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు. చంద్రబాబు తీవ్ర వైఫల్యం కారణంగా... ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేని స్ధితిలో ఉంది. వీటన్నింటికీ తోడు మొంథా తుపాన్ రైతులను తీవ్రంగా నష్టపరిచింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి కనీస చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రస్థాయికి చేరిన నేపధ్యంలోనే ... అవసరం లేకపోయినా, అసందర్బం అయినా విషం చిమ్మేలా చంద్రబాబు కోసం మాట్లాడుతున్నాడు. ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులతో చంద్రబాబు తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తున్నాడు. లేని పక్షంలో హఠాత్తుగా... వైయస్.జగన్ దంపతుల గురించి రాజకీయ పరమైన ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆదినారాయణరెడ్డి ఎంత సంస్కార హీనంగా మాటాడుతున్నాడో ప్రజలు గమనించాలి. నాయకులు ఏదైనా విషయం ఉండి మాట్లాడితే.. ఆదినాయారణరెడ్డి మాత్రం ఒళ్లంతా విషం నింపుకుని సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడు. మేము ఏనాడూ ప్రత్యర్థుల ఇళ్లలోని ఆడవాళ్ల గురించి ప్రస్తావించలేదు,అది సంస్కారం కూడా కాదు. అసలు రాజకీయాలు, భారతమ్మకు సంబంధమే లేదు..అలాంటప్పుడు ఆమె ప్రస్తావన తీసుకురావడం దారుణం.

నిలువెత్తు బంగారం లాంటి  వ్యక్తిత్వం...

వైయస్.జగన్‌ సీఎం అయినప్పుడు కూడా రాజకీయాల్లోనూ, ప్రభుత్వ నిర్ణయాల్లోనూ  ఆమె జోక్యం ఎక్కడా లేదు. కేవలం పులివెందులలో వైయస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలప్పుడు తప్ప.. మరో సందర్భంలో ఆమెను మరెప్పుడూ చూడలేదు. అలాంటి భారతమ్మను సంస్కార హీనంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతున్నాడు. 400 కేజీల బంగారం బారతమ్మ కొన్నారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. వారికి ధనదాహం అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వైయస్.జగన్, భారతమ్మ ఉన్నత కుటుంబాల్లోనే పుట్టారు. దివంగత నేత వైయస్. రాజశేఖరరెడ్డి సహాయం చేసి, నిలబెట్టిన రాజకీయం ఆదినారాయణరెడ్డి కుటుంబానిది. ఆయన కుటుంబం ఈ రోజు ఈ స్థితిలో ఉందంటే అది వైఎస్సార్‌ పుణ్యమే.అలాంటి కుటుంబాన్ని పట్టుకుని ఆదినారాయణరెడ్డి కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాడు.వైయస్.భారతమ్మ రాయలసీమలోనే పెద్ద డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి కుమార్తె, ఆ తర్వాత వివాహం అయ్యాక ఒక ముఖ్యమంత్రికి కోడలు.. ఆ తర్వాత ముఖ్యమంత్రికి భార్య. అలాంటి ఆమె డబ్బు కోసం పాకులాడుతుంది అనడం దారుణం. ఆమె వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారం. కారణం దశాబ్దానికి పైగా పులివెందులలో సొంత ఖర్చులతో వెయ్యి మంది పిల్లలను చదివిస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గురువు వెంకటప్ప పేరుతో స్కూల్‌ పెట్టి ఉచితంగా విద్యను అందిస్తోంది. విజేత అనే మరో స్కూలు స్థాపించి దాని ద్వారా మానసిక వికలాంగులకు సేవలందిస్తున్నారు.

కనీస జ్ఞానం లేకుండా అవాకులు చెవాకులు...

అలాంటి మహిళను వ్యక్తిత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి... నోటి కొచ్చినట్లు మాట్లాడ్డానికి నీకు బుద్ధి, జ్ఞానం ఉందా ? వైయస్.జగన్, భారతమ్మలు కలిసి వివేకానందరెడ్డిని హత్య చేశారనడానికి నీకు కనీసం ఇంగితం  ఉందా? వాళ్లిద్దరూ జైలుకు పోతారంటూ  అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడు. ముప్పై ఏళ్లు ఫ్యాక్షన్‌ చేసి, బాంబులేసిన నీలాంటి వాళ్లే జైలుకు వెళ్లలేదు..ప్రజా సేవ చేస్తున్న వాళ్లెందుకు జైలుకు వెళ్తారు.? 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుంది అంటున్న ఆదినారాయణరెడ్డి ఒక్కసారి  ఒక్క సారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు.. మతం, కులం, సినిమా రంగం కలిసి పోటీ చేస్తే...  వైయస్.జగన్ కు 40 శాతం ఓట్లు వచ్చాయి. మీ డబ్బాలో కమలం, సైకిల్, గ్లాసు ఓట్లున్నాయి..మా డబ్బాలో ఒకే ఒక్క ఫ్యాన్‌ ఓట్లు మాత్రమే ఉన్నాయి. మేం ఓడినా గర్వపడతాం..మాకు 40 శాతం ఓటింగ్‌ ఉంది. 

నువ్వే సిగ్గుపడాలి ఆదినారాయణ రెడ్డీ..

వైయస్.జగన్‌ బయట అడుగుపెడుతుంటే..ఏం జరుగుతుందో మీరే చూస్తున్నారు. జై జగన్‌ అనే శబ్ధం ఈ రాష్ట్రమంతా మారుమోగుతోంది. ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో వైయస్. జగన్‌ ఒకరు. ఆయన్ను చీ చా అనిపించడానికి మీ శక్తి ఎంత ఆదినారాయణరెడ్డి..? నువ్వేంటి వెంటాడేది..వేటాడేది.? జగన్‌ లాంటి నాయకుడిని మీరు వేటాడగలుగుతారా? అది మీ వల్ల కాదు.  ఓడిపోయినా అది దెబ్బతిన్న సింహమే..దాని గర్జన చాలా గొప్పగా ఉంటుంది. 2029లో జగన్‌ కొట్టే దెబ్బ కూడా సింహంలానే ఉంటుంది. గుర్తుపెట్టుకొండి.  అతన్ని మీరు వేటాడలేరు. 2029లో వైయస్.జగన్  జైలుకు వెళ్తారా? ఆదినారాయణరెడ్డి బెంగుళూరు వెళ్తారో చూద్దాం. సిగ్గు పడాల్సి వస్తే ఎన్నో పార్టీలు మార్చిన నువ్వు సిగ్గుపడాలి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నీ మనస్తత్వానికి నువ్వే సిగ్గు పడాలి. ఆనాడు వైఎస్సార్సీపీలో గెలిచి చంద్రబాబుకు అమ్ముడుపోయి... మంత్రి పదవులు  తీసుకున్నందుకు మీలాంటి వాళ్లు సిగ్గు పడాలి. 

ధైర్యము, ఓర్పు, నిజాయితీయే వైయస్.జగన్‌ బలమని... దాన్ని మీరు ఏమీ చేయలేరని రాచమల్లు స్పష్టం చేశారు.  ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తుల నమ్మక ద్రోహమే ఆయన బలహీనత అని... ఈ రాష్ట్రం ఉన్నంత కాలం వైఎస్సార్సీసీ దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో వైయస్.భారతమ్మని విమర్శిస్తే... ఉపేక్షించేదిలేదు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.