నెల్లూరు కార్పొరేషన్‌లో చంద్రబాబు అనైతిక రాజకీయం
తాడేపల్లి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌లో చంద్రబాబు అనైతిక రాజకీయానికి తెర లేపారని, అందుకే సీబీఎన్ అంటే ‘కానిస్టిట్యూషన్ బైపాస్ నాయుడు’ అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చురకలంటించారు. టీడీపీకి నెల్లూరు మేయర్ పదవి దక్కేలా సీఎం చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాలపై వైయస్ఆర్‌సీపీఅధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్, వెంకటగిరి నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..:
మేయర్ పదవి కోసం అంత దారుణ రాజకీయమా?: వై.నాగార్జునయాదవ్, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి.
– చంద్రబాబు రాజకీయ జీవితమంతా కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలే. ఏ మాత్రం సంఖ్యాబలం లేకపోయినా నెల్లూరు మేయర్ పదవి కోసం సీఎం చంద్రబాబు దారుణ రాజకీయాలు చేస్తున్నారు. కేవలం 8 నెలల పదవీకాలం ఉన్న నెల్లూరు మేయర్ పదవి నుంచి ఒక గిరిజన మహిళను తొలగించి, తన తాబేదార్లను కూర్చోబెట్టాలనే నీచ స్థాయికి చంద్రబాబు దిగజారారు. చంద్రబాబు రాజకీయాల్లో ఓటు కాదు.. నోటే ముఖ్యం అన్నది మరోసారి రుజువైంది. నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లను వైయస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయినా పదవుల కోసం వైయస్ఆర్‌సీపీ బీ–ఫామ్‌పై గెలిచిన కార్పొరేటర్లను సంతలో పశువులను కొన్నట్టు కొనుగోలు చేసి, మొన్న డిప్యూటీ మేయర్ పదవిని సంపాదించుకున్నారు. అంతటితో చంద్రబాబు కడుపు మంట చల్లారలేదేమో.. ఇవాళ ఒక గిరిజన మహిళను బలిపశువును చేయాలనే ఉద్దేశంతో పాటు, రాజకీయంగా అణగ దొక్కేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తీర్మానంపై 42 మంది కార్పొరేటర్లు సంతకం చేశారు. వారిలో ఐదుగురు మా పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ సమక్షంలో తిరిగి మా పార్టీ గూటికి చేరారు. అయినా ఓటమి భయంతో చంద్రబాబు పోలీసులను పహారాగా పెట్టి కార్పొరేటర్లను కిడ్నాప్ చేయించారు. అందుకే ఒక మాట స్పష్టమవుతోంది. సీబీఎన్ అంటే ‘కానిస్టిట్యూషన్ బైపాసింగ్ నాయుడు’ అని అభివర్ణించారు.
ఓటమి భయంతో కార్పొరేటర్ల కిడ్నాప్:
అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఓటింగ్ జరగాలి. 54 మంది కార్పొరేటర్లు తమ అభీష్టం మేరకు, కన్న తల్లిలాంటి వైయస్‌ఆర్‌సీపీకి వెన్నుపోటు పొడవకుండా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతో చంద్రబాబు కిడ్నాప్ రాజకీయాలకు తెర లేపారు. గిరిజన కార్పొరేటర్ రవిచంద్ర, మరో కార్పొరేటర్ కుమారుడు శ్రీధర్, 34వ వార్డు కార్పొరేటర్ తండ్రి, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన నజీర్‌ను కిడ్నాప్ చేశారు. చంద్రబాబు పాలనలో కొత్త పథకం వచ్చింది. ‘ఖాకీ క్యాబ్ సర్వీస్’ అనే కొత్త స్కీమ్ తెచ్చారు. పోలీసు వాహనాల్లో, ఖాకీ చొక్కాలు వేసుకుని వచ్చి కిడ్నాప్‌లు చేస్తున్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ల పేర్లు మార్చి, ‘బాబు అన్యాయ సమిత సెక్షన్లు’గా మార్చేశారు. కిడ్నాప్ చేసిన వారిని పోలీసులే టీడీపీ క్యాంపులకు తరలిస్తున్నారు. ఒక్కో కార్పొరేటర్‌కు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతోంది?: వైయస్ఆర్‌సీపీ నేత నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
– నెల్లూరు కార్పొరేషన్‌లో సీఎం చంద్రబాబు చేస్తున్న దారుణ రాజకీయం చూస్తుంటే, అసలు రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతోంది? అన్న సందేహం వస్తుంది. ఇది ప్రజాస్వామ్యమా? లేక తాలిబన్ల పాలనా? అనేది కూడా అర్థం కావడం లేదు. 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా తండ్రి సయ్యద్ నజీర్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తే, ఆయన్ను విడిపించుకొచ్చాను. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైయస్‌ఆర్‌సీపీలో చురుగ్గా పనిచేస్తూ, జీవనోపాధిగా పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎటువంటి నోటీసు లేకుండా, బంధువులకు సమాచారం ఇవ్వకుండా పోలీసులు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరినైనా తీసుకెళ్లాలంటే సెక్షన్–41 కింద నోటీసు ఇవ్వాలి. స్థానిక పోలీసులతో సమన్వయం చేయాలి. బంధువుల సంతకాలు తీసుకోవాలి. నజీర్ విషయంలో వీటిలో ఏ ఒక్కటీ పాటించలేదు. మరి అది అరెస్టా? కిడ్నాపింగా?. నెల్లూరు మేయర్ పదవి కోసం సీఎం చంద్రబాబు ఇంత దారుణ రాజకీయం చేస్తున్నారు. పోలీసులు ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలి. చట్టం పట్ల గౌరవంతో వ్యవహరించాలి. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.