సాక్షి పత్రికపై చంద్రబాబు కక్షసాధింపులు
తాడేపల్లి: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి పత్రికపైన చంద్రబాబు దుర్మార్గంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి ఎడిటర్ నివాసంలో ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించడం చంద్రబాబు అధికార దుర్వినియోగంకు పరాకాష్టగా నిలుస్తోందని అన్నారు. వైయస్ జగన్ వెంట ఉన్న వారిపై వేధింపుల్లో భాగంగా లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి, దానిలో వారిని భాగస్వాములుగా చూసే దారుణానికి చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా ఆయనేమన్నారంటే..
దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే ఏపీలో మాత్రం చంద్రబాబు రాజకీయంగా కక్షలు తీర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. లేని లిక్కర్ స్కామ్ను తెరమీదికి తీసుకువచ్చి వైయస్ జగన్ వెంట ఉన్న వారిని దోషులుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రజల గొంతుక సాక్షి పత్రికపైన కూడా దుర్మార్గమైన దాడికి చంద్రబాబు ప్రయత్నించడం సిగ్గుచేటు. దేశంలో ఒకవైపు యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు దేశ రక్షణ బలగాలకు సంఘీభావంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదర్కోవడానికి సమాయత్తమవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు తన కుటిల రాజకీయ కుతంత్రాలను అమలు చేయడానికే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నారు. లేని లిక్కర్ స్కాంను సృష్టించి, అబద్ధాలను ఆరోపణలుగా మార్చి దానిచుట్టూ కక్ష తీర్చుకునే దుర్మార్గమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనిలో భాగంగా రోజుకు ఒకరిని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి… కొన్నాళ్లపాటు వారి ఆటలు చెల్లుతాయి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. అమావాస్య చీకట్లు ఎలా ఉంటాయో, వెలుగు కూడా దాని వెనుకకే ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా చట్టం ముందు నిలబడి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేసిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిమీద, ఓఎస్డీగా పనిచేసిన ఒక నిజాయితీపరుడైన మాజీ ప్రభుత్వ ఉద్యోగి మీద చంద్రబాబు మొత్తం బలాన్ని, బలగాన్ని ప్రయోగించడం సిగ్గు చేటు. అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు. ఇది ఒక కుట్ర. దీనిలో అందరినీ భాగస్వాములను చేసి, వైయస్ జగన్ గారి చుట్టూ ఉన్న వారిని దీనిలో ఇరికించాలనే ఈ కక్ష సాధింపు చర్యలు. కక్షలు తీర్చుకోవడంలో చంద్రబాబు అన్ని లైన్లు క్రాస్ చేశాడు. తెలుగు పత్రికా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న సాక్షి ఎడిటర్ మీద కూడా పోలీసులను చంద్రబాబు ప్రయోగించడం దుర్మార్గం. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఒక పెద్ద పత్రిక సంపాదకుడ్ని టార్గెట్ చేయడం దారుణం. సాక్షి కథనాలు చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కూటమి పార్టీలకు, ముఖ్యంగా తెలుగుదేశంకు ఎల్లో పత్రికల్లాగ సాక్షి పత్రిక డబ్బా కొట్టాలని అనుకోవడం వారి అవివేకం. సమాజం పట్ల, ప్రజలపట్ల తన బాధ్యతను సాక్షి నిర్వహిస్తోంది. అలా సాక్షి పత్రికను, సంపాదకుడ్ని, జర్నలిస్టులను భయపెట్టాలనుకోవడం వారి దురాశే అవుతుంది. ప్రజల పక్షాన ఎన్నికల హామీలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ప్రజల అండ ఉన్నంత వరకూ సాక్షి పత్రికను ఎవ్వరూ ఏమీ చేయలేరు. గతంలో కూడా సాక్షిపైన ఇలాంటి కుట్రలే చేసి విఫలమయ్యారు. నీతీ, నిజాయితీగా పనిచేసే సాక్షి పత్రికా బృందాన్ని కూటమి ప్రభుత్వం తన బలంతో అణిచివేయాలని చూసినా ప్రయోజనం లేదని తెలుసుకోవాలి.