ఈనాడు, లూథ్రాకి డబ్బులుంటాయి.. రైతులకైతే ఉండవా..?
తాడేపల్లి: ప్రకటనలు, ఉత్సవాల పేరుతో ఈనాడు పేపర్‌కి.., వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసులు వాదించిన సిద్ధార్థ లూథ్రాకి ఇవ్వడానికి చంద్రబాబు వద్ద డబ్బులుంటాయి కానీ పంట నష్టపరిహారం ఇవ్వడానికి, గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులుండవా అని కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని.. సీఎం చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 30 ఏళ్లుగా అమలవుతున్న వ్యవసాయ విధానాలనే పంచసూత్రాల పేరుతో చంద్రబాబు మార్కెటింగ్ చేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి కర్నాటక రాష్ట్రం కృష్ణా జలాలు తరలించుకు పోతుంటే నీటి భద్రత పేరుతో రైతులకు కాకమ్మ కథలు చెబుతున్నాడని.. చంద్రబాబు సీఎం అయ్యాక వాస్తవం చూస్తే కెనాల్స్ కింద లాకు గుమాస్తాలు, సూపర్ వైజర్లే సరిగా లేరని స్పష్టం చేశారు. అగ్రిటెక్ గురించి మాట్లాడే చంద్రబాబు వరి కోత మెషీన్లు గతంలో వైయస్ఆర్‌సీపీ పాలనలో గంటకు రూ.2500 తీసుకుంటే ఇప్పుడు రూ. 4500 తీసుకుంటున్నారని, ఈ విషయం తెలుసా అని ప్రశ్నించారు. రైతులకు కనీసం గన్నీ బ్యాగులే ఇవ్వలేని చంద్రబాబు పంచ సూత్రాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని, రబీ కోసం ఉచిత పంటల బీమాను అమలు చేయాలని, డెల్టాలో రబీ సాగుకు అనుమతివ్వాలని వైయస్ఆర్‌సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
● రైతాంగ సమస్యలపై మోడీని ఒక్కసారైనా అడిగారా?
గడిచిన రెండు రోజులుగా రైతులకు పంచ సూత్రాలు అంటూ చంద్రబాబు పాత పాటనే కొత్త రాగంలో పాడుతున్నాడు. 1996 నుంచి ఒకటే పాటను ట్యూన్లు మార్చి పాడుతున్నాడు. పంచ సూత్రాలు నిజంగా ఈయన కనిపెట్టాడేమోనని చూస్తే.. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంట సాగు, అగ్రి టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రపంచ వేదికగా మార్కెటింగ్.. అని ఇప్పటికే రైతులు అవలంభిస్తున్న విధానాలనే తాను కనిపెట్టినట్టు కలరింగ్ ఇస్తున్నాడు. నీటి భద్రత అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి కృష్ణా జలాలను తీసుకెళ్లిపోతుంటే విశాఖలో భూములు దోచుకునే పనిలో ఉన్నాడు. కింగ్ మేకర్‌ని, డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటాడు. కేంద్రం నా చెప్పుచేతల్లో ఉందంటాడు. ఆయన చెప్పేది నిజమైతే ఏపీకి నష్టం చేస్తూ కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు పెంచి కృష్ణా జలాలను ఎలా తరలించుకుపోతోంది? దోచుకున్నది దాచుకోవడానికి తండ్రీ కొడుకులు నెలకోసారి దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా వెళ్లడం తప్పించి వీరి వల్ల రాష్ట్రానికి జరిగిన మేలు ఒక్కటైనా ఉందా? రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే కనీసం గన్నీ బ్యాగులు కూడా దొరకని పరిస్థితి ఉంటే రైతులను ఉద్ధరిస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటు. 18 నెలల్లో పదుల సంఖ్యలో మోడీని కలిసిన చంద్రబాబు, రైతుల సమస్యలపై ఎందుకు చర్చించడం లేదు? ప్రధానికి రాసిన లేఖలు ఏమయ్యాయని ఒక్కసారైనా అడిగారా?
● 18 నెలలుగా అతివృష్టి లేదా అనావృష్టి
1999-2004 మధ్య వాటర్ గేజ్‌లు, వాటర్ ప్లూమ్ లు పెట్టి ఏ రైతు ఎంత నీరు వాడుతున్నారో నీళ్లు కొలుస్తామన్నాడు. ఏరోజన్నా చేశాడా? మైకుల్లో చెప్పడమే నీటి భద్రత జరిగిపోయినట్టా? వాస్తవం చూస్తే కెనాల్స్ కింద లాకు గుమాస్తాలు, సూపర్ వైజర్లు లేరు, ఏఈలు డీఈలు లేరు. డిమాండ్ ఆధారిత పంట సాగు అని మాట్లాడుతున్నాడు.. చంద్రబాబు సీఎం అయ్కాక ఒక్క పంటకైనా డిమాండ్ ఉంటే చూపించాలి. తుపాన్లు వచ్చి రైతులు నష్టపోతుంటే పట్టించుకునే దిక్కులేదు. ఈ 18 నెలల చంద్రబాబు పాలనలో అతివృష్టి అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోతుంటే నష్టపరిహారం ఇవ్వకపోగా, దాన్ని ఎగ్గొట్టేందుకు పంట నష్టం తుది నివేదికలో తక్కువ చేసి చూపించిన దుర్మార్గ ప్రభుత్వం ఏపీలో పాలన సాగిస్తోంది. పత్తి, పొగాకు, కంది, మిర్చి, మొక్కజొన్న, మామిడి, అరటి, కొకో, కొబ్బరి, వేరుశెనగ, ధాన్యం, చెరకు.. ఏది చూసినా రైతు కంట కన్నీరే. ఒక్క రూపాయి చెల్లించి ఆదుకున్న దాఖలాలు లేవు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక వైయస్ జగన్ హయాంలో కన్నా ఒక్క పంటకైనా ఎక్కువ ధర పలికితే చూపించాలని సవాల్ విసురుతున్నా. పంట కోయడానికి వరి కోత మెషీన్‌కి గంటకు రూ.4 వేల నుంచి రూ. 4,500 చెల్లిస్తున్నారు. గతంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో గంటకు రూ. 2,500 తీసుకునేవారు. ఇదేనా చంద్రబాబు కనిపెట్టిన అగ్రిటెక్? గడిచిన 30 ఏళ్లుగా రాష్ట్ర రైతులు యంత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు. ఆయన రాకముందే వ్యవసాయంలో డ్రోన్లు వాడుతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడే చంద్రబాబు కొత్తగా ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మొదలు పెట్టి ఉంటే చూపించాలి. మామిడి, టమాట రైతులను ఆదుకున్నారా? మామిడి రైతులకు కేజీకి రూ.4లు ఇస్తామని మే నెలలో జీవో ఇచ్చి నవంబర్‌లో ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు వాదించడానికి లూథ్రాకి మాత్రం వేగంగా చెల్లింపులు చేస్తారు. ఈనాడు ప్రకటనలకు డబ్బులుంటాయి. ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్‌లలో తిరగడానికి డబ్బులుంటాయి. కానీ రైతులను మాత్రం అస్సలు పట్టించుకోరు.
● ధాన్యాన్ని బోర్డర్ దాటనివ్వడం లేదు
చంద్రబాబు పాలనలో ఏపీలో పండించిన ధాన్యాన్ని తెలంగాణలో అమ్ముకోవడానికి దిక్కులేకపోతే ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అంటున్నాడు.. తెలుగుదేశం నాయకులు ఆంధ్రా సరిహద్దుల్లో పోలీసులను మోహరించి ఇక్కడి రైతులు తెలంగాణకి తీసుకెళ్లి ధాన్యం అమ్ముకోనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. మంత్రులు ఒక్కరైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చొరవ చూపిస్తే కదా? పక్క రాష్ట్రంలో అమ్ముకునే స్వేచ్చే లేకపోతే అంతర్జాతీయంగా మార్కెటింగ్ అంటూ గాలి కబుర్లు చెబుతున్నాడు. రైతులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. కానీ చంద్రబాబు దిక్కుమాలిన పాలన వల్ల ఆయన దిగిపోయేనాటికి ఒంటి మీదున్న చొక్కా కూడా అమ్ముకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరో స్నేహితుడు చెబితే తప్ప గన్నీ బ్యాగులు రైతులకు అందడం లేదని తెలుసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఒక రైతు నేరుగా మంత్రికి చెప్పుకున్నాడంటే అధికారులంతా ఏమైనట్టు? ఆ జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, కొనుగోలు కేంద్రాలు ఏమయ్యాయి. మా హయాంలో సేవలందించిన రైతు భరోసా కేంద్రాలకు పేరు మార్చి రైతు సేవా కేంద్రాలని పెట్టుకున్నారు. అవన్నీ ఎందుకు పనిచేయడం లేదు?
● నిలదీయడానికి రైతులు సిద్ధంగానే ఉన్నారు
రైతన్న మీకోసం.. అంటూ నవంబర్ 24 నుంచి కొత్త కార్యక్రమం అంటున్నాడు. ఎమ్మెల్యేలు, అధికారులు ఇంటికొస్తే చొక్కా పట్టుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. పోలీసు భద్రత లేకుండా కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వచ్చే దమ్ముందా? చంద్రబాబు ఎలాగూ గిట్టుబాటు ధర ఇప్పించలేడని రైతులకు అర్థమైంది. కనీసం పక్క రాష్ట్రంలో అయినా అమ్ముకుందామంటే తెలుగుదేశం నాయకులు బోర్డర్‌లో అడ్డుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ క్రాపింగ్ అనేది జరగడం లేదు. పంట నష్టపరిహారం కోసం పొలాల్లోకి వచ్చిన అధికారులే లేరు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లల్లో కూర్చుని ఆ పార్టీ నాయకులకే రాసుకుంటున్నారు. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలు కూడా నెరవేర్చకుండా పూర్తిగా గాలికొదిలేశాడు. రైతులే స్వచ్ఛందంగా వ్యవసాయం వదిలే వాతావరణం సృష్టిస్తున్నాడు. వెనుబడిన కులాలు పండించుకునే అసైన్డ్ భూములు కూడా వదలకుండా లాక్కునే కుట్రలకు తెరలేపాడు. పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రబీ కోసం ఉచిత పంటల బీమాను అమలు చేయాలి. డెల్టాలో రబీ సాగుకు అనుమతివ్వాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. మినుము, పెసర పంటలకు మద్ధతు ధర కల్పించాలి.