“జగనన్న 2.0” పాలనలో కార్యకర్తలకే పెద్దపీట
నంద్యాల జిల్లా: “జగనన్న 2.0” పాలనలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భరోసా కల్పించారు. నంద్యాల జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిన వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నప్పటికీ, గెలిచిన కూటమి నాయకులే భయాందోళనలతో, అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాబోయే “జగనన్న 2.0” పాలనలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని స్పష్టంగా ప్రకటించిన బుగ్గన, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికీ తమ “సూపర్ సిక్స్” హామీలను పూర్తి చేయకుండానే చేశామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. రైతుల పరిస్థితిపై ప్రత్యేకంగా స్పందించిన ఆయన, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పండించిన పంటలను వదిలేసి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తమ పాలన గొప్పదని ప్రచారం చేసుకోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.
ఇటీవల జరిగిన కలెక్టర్‌ల సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలు పూర్తయ్యాయని మంత్రులు చెప్పినప్పుడు, కలెక్టర్లు ఆశ్చర్యంతో నోరు తెరచి చూసిన పరిస్థితి కనిపించిందని బుగ్గన ఎద్దేవా చేశారు. “తల్లికి వందనం”, ఉచిత సిలిండర్లు వంటి పథకాలు ఎంతవరకు అమలయ్యాయో ప్రజలకు తెలుసు… దేవుడికి కూడా తెలుసు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు గొప్ప సంకల్పంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కానీ నేడు అదే రంగాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వైజాగ్‌లో గీతం వంటి ప్రైవేటు సంస్థలు కూడా టెండర్లకు ముందుకు రాలేకపోవడం, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హెచ్చరికకు నిదర్శనమని పేర్కొన్నారు. “మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు వేసుకున్నాం. కానీ నేడు కూటమి ప్రభుత్వం నాయకులు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలనే ప్రణాళికలు వేస్తున్నారు” అని తీవ్రంగా మండిపడ్డారు.
“ఇప్పుడు మీరు ఒక లడ్డు ఇస్తే, మేము 2029లో అధికారంలోకి వచ్చాక రెండు లడ్లు ఇస్తాం. మీరు ఉప్పు-కారం పెడితే, మేము డబుల్ పెడతాం” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. గత ఐదేళ్లుగా నీరు, చెరువు, బడిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని గుర్తుచేసిన ఆయన, రాబోయే రోజుల్లో అదే శ్రద్ధ ప్రజల జీవన ప్రమాణాలపై, మనుషుల మీద ఉంటుందని హెచ్చరించారు. కష్టాల్లో పుట్టిన వైయసీఆర్‌సీపీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రాబోయే రోజుల్లో మంచి కాలం తప్పక వస్తుందని ధైర్యం చెప్పారు.