సాల్మన్ హత్య ప్రభుత్వ హత్యే
పల్నాడు జిల్లా : పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్త మందా సాల్మన్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనను, అలాగే ఈ ఘటనపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ నరసరావుపేటలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, టీజేఆర్ సుధాకర్ బాబు, నంబూరు శంకర్రావు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ గజ్జల సుధీర్, భార్గవ్ రెడ్డి (సత్తెనపల్లి సమన్వయకర్త), పూనూరు గౌతమ్ రెడ్డి, అలాగే ఎస్సీ సెల్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు: విడుదల రజిని
“ఈ రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదు. లోకేష్ రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు అత్యంత దారుణంగా హత్య చేశారు . ఈ హత్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత వహించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్, మాచవరం ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విడదల రజిని డిమాండ్ చేశారు.
ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు: కాసు మహేష్ రెడ్డి
“ఆంధ్రప్రదేశ్‌లో ఇంత దుర్మార్గమైన పాలనను ఎప్పుడూ చూడలేదు. దళితుడైన సాల్మన్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసి, చివరకు అతని అంత్యక్రియలు కూడా జరగకుండా అడ్డుకోవడం హేయమైన చర్య” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్మన్ కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు గ్రామాలు విడిచి వెళ్తున్నారు: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
“కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో వందలాది కుటుంబాలు గ్రామాలను విడిచి వెళ్లి బతుకుతున్నాయి. సాల్మన్ కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే గ్రామం విడిచి వెళ్లిపోయాడు. ఇది స్పష్టంగా ప్రభుత్వ హత్య” .
కార్యకర్తలను చంపడం కాదు… మమ్మల్ని ఎదుర్కోండి : బొల్లా బ్రహ్మనాయుడు
“పిన్నెల్లి గ్రామంలానే నా నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. సాల్మన్ హత్య ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే.
మీకు దమ్ముంటే కార్యకర్తలను చంపడం కాదు… మమ్మల్ని ఎదుర్కోండి. కార్యకర్తల జోలికొస్తే తోలు తీస్తాం” అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు.
బాధితుడిపైనే కేసులు పెట్టడం దారుణం: నంబూరు శంకర్రావు
“వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్‌ను అన్యాయంగా చంపేశారు. తెలుగుదేశం నాయకుల చేతిలో గాయపడి కోమాలోకి వెళ్లిన సాల్మన్‌పైనే కేసు పెట్టడం అత్యంత దారుణం” అని పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు.
పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి: భార్గవ్ రెడ్డి
“తెలుగుదేశం నాయకులు చేసే హింస చాలా దారుణం. వారికి అండగా నిలుస్తున్న పోలీస్ అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది: ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్ బాబు
“రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడవడం లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగమే నడుస్తోంది. సాల్మన్ హత్య ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే. దాచేపల్లి సీఐ, మాచవరం ఎస్సైపై వెంటనే చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.
ఈ నిరసనలో పాల్గొన్న నేతలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, సాల్మన్ హత్యకు బాధ్యులైన వారందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.