వైయస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపడం దారుణం

అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేయడం దారుణమని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన పార్టీ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల నేతలతో మిథున్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏడాదిగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఎండీయూ వాహనాలపై ఆధారపడ్డ 10 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.ప్రజలకు ఉపయోగకరమైన సంక్షేమ పథకాలను రద్దు చేసి చంద్రబాబు రాక్షసానందం పొందడం దుర్మార్గమన్నారు. వైయస్ జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా చంద్రబాబు రోజుకో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి విదేశీ నిధులు ఆపడం వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారని తెలిపారు. హంద్రీనీవా లైనింగ్ పనులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, ఉషాశ్రీ చరణ్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు.