వైయస్‌ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం

12 Jan, 2026 16:26 IST

కాకినాడ: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మ‌ళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే లక్ష్యంతో పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేయాలని వైయస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసే కార్యకర్తలకే సంస్థాగత కమిటీల్లో ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని క్రమబద్ధంగా, పారదర్శకంగా పూర్తి చేసే దిశగా కాకినాడ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈరోజు కాకినాడలోని వైయస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు  దాట్ల సూర్యనారాయణ రాజు, మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం, ప్రతిపాడు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి  ముద్రగడ గిరిబాబు పాల్గొన్నారు. అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కురసాల కన్నబాబు, పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయడమే ఈ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పించేలా కమిటీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ విధానాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

అనంతరం ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ, వైయస్‌ఆర్‌సీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పనిచేసే వారినే వివిధ కమిటీల్లో సభ్యులుగా నియమిస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే అన్ని స్థాయిల్లో కమిటీల నిర్మాణం పూర్తవుతుందని, పార్టీ కార్యకర్తల కృషికి తగిన గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.