‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అత్యంత దుర్మార్గం’
ఢిల్లీ: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా విమర్శించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయాలనే దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణకు పూనుకుందని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో వైయస్ఆర్‌సీపీ గళం విప్పుతుందని స్పష్టం చేశారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైయస్ఆర్‌సీపీ తరఫున ఫ్లోర్ లీడర్లు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడేలా చట్టబద్ధ హామీలు బిల్లులో చేర్చితే మేము మద్దతు ఇస్తాం” అని స్పష్టం చేశారు. కానీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చిచెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించిన ఆయన, అవసరమైన నిధులు కేటాయించకుండా రాయలసీమ ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్రం ప్రస్తుతం అప్పుల కుప్పగా మారిందని, నిర్దేశించిన అప్పుల పరిమితిని మించి 69 శాతం ఎక్కువగా అప్పులు చేశారని విమర్శించారు. అప్పుల ద్వారా తెచ్చిన నిధులు ఏ పనులకు ఖర్చు చేస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎనిమిది త్రైమాసికాలుగా చెల్లించలేదని, హాస్టల్ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు పంటల బీమా అమలు చేయడం లేదని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గిపోయాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల లోటును పూడ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ప్రతి అంశంపై వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.