సీఎం సొంత నియోజకవర్గంలో బాలికలకే భద్రత లేదు
తాడేపల్లి: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బాలికలకే భద్రత లేదని వైయస్ఆర్‌సీపీ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు. ఈనెల 2వ తేదీన కుప్పంలో 12 ఏళ్ల బాలిక పై టిడిపి కార్యకర్త ఆర్.రమేష్ లైంగిక దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. తప్పు చేసిన టీడీపీ కార్యకర్తను శిక్షించాల్సింది పోయి పెద్దల సమక్షంలో బాలిక తండ్రితో బలవంతంగా రాజీకి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. బాలిక శీలానికి లక్ష రూపాయలు వెల కట్టడం విచారకరమన్నారు. తనకు తాను సనాతన ధర్మ పరిరక్షకుడని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారని, పిఠాపురంలో బాలిక పై టిడిపి పట్టణ అధ్యక్షురాలి భర్త అత్యాచారానికి పాల్పడితే కనీసం ఖండించలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేం ఏమి చేసినా చెల్లుతుందనేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీలో మహిళలకు రక్షణ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్నా...బయటికి వెళ్లినా మహిళలకు భద్రత లేదన్నారు. వైయస్ జగన్ తెచ్చిన దిశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ ను తెచ్చారని, కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రత , రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.