మొక్కజొన్న రైతుల పాలిట దళారీగా మారిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
తాడేపల్లి: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మొక్కజొన్న రైతుల పాలిట 'దళారీ మాఫియా గ్యాంగ్ లీడర్'గా మారారని వైయస్ఆర్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ధ్వజమెత్తారు. కేంద్రం ప్రకటించిన రూ. 2400 మద్దతు ధర ఇవ్వకుండా, తన సొంత డెయిరీ అవసరాల కోసం రైతుల నుంచి కేవలం రూ. 1650కే పంటను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడాల్సిన ఎమ్మెల్యే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్య రైతుల గోదాముల తాళాలు పగలగొట్టడం, వారిపై అక్రమ కేసులు పెట్టించడం దుర్మార్గమని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...
- రూ. 2400 మద్దతు ధర ఏమైంది?
మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులు క్వింటాల్ రూ. 1,400 నుండి రూ. 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వైయస్ .జగన్ హయాంలో నాలుగేళ్ల పాటు రైతులు రూ. 2,400 మద్దతు ధర పొందితే... ఇప్పుడు సామాన్య రైతును దళారుల పాలు చేస్తున్నారు.
- సంగం డెయిరీ మాటున ఎమ్మెల్యే 'మారు బేరాలు':
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన సొంత ప్రయోజనాల కోసం రైతులను వంచిస్తున్నారు. సంగం డెయిరీకి అనుబంధంగా ఉన్న కాకాణి వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ కోసం లక్షలాది క్వింటాళ్ల మొక్కజొన్నను కేవలం రూ. 1,650కే కొనుగోలు చేస్తున్నారు. దీనికోసం ఏకంగా దళారీ అవతారం ఎత్తారు. కేంద్రం ప్రకటించిన రూ. 2,400 ఇవ్వకుండా తక్కువ ధరకు కొంటున్న ఎమ్మెల్యే కూడా ఒక దళారీ కిందకే వస్తారు. నిజంగా రైతుల పట్ల నరేంద్రకు చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పొన్నూరు నియోజకవర్గంలోనే కాకుండా అన్ని చోట్ల సంగం డెయిరీ కేంద్రాలున్నాయి. మీరు పొన్నూరులో కొంటున్నామని చెబుతున్న రూ.2100 కే రాష్ట్ర వ్యాప్తంగా సంగం డెయిరీ పాలకేంద్రాల వద్ద రైతుల నుంచి రూ.2100కే కొనుగోలు చేయండి. మిగిలిన రూ.300 కేంద్ర మద్ధతు ధరను మద్ధతు ధర కేంద్రాలను తెరిచిన తర్వాత చంద్రబాబు నాయుడు చేత ఇప్పించండి. రైతులు అందుకు సిద్ధంగా ఉన్నారు. రైతులు పంటను ఉంచుకోవాలో అమ్ముకోవాలో తెలియని స్ధితిలో ఉన్నారు.
మారు బేరాలు చేసుకోవడంతో మీరు నెంబర్ వన్ నరేంద్ర గారూ? పొన్నూరులో ఆవులు ఉన్నాయో లేవో తెలియదు కానీ ట్యాంకర్ల కొద్దీ అవునెయ్యి తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి సరఫరా చేస్తున్నారు.
- మామిళ్లపల్లిలో అరాచకాలు - రైతులపై అక్రమ కేసులు:
మునిపల్లె, మామిళ్లపల్లి గ్రామాల్లో రైతులు తమ సరుకును గోదాముల్లో దాచుకుంటే, అది అంబటి మురళీకృష్ణ సరుకని ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేశారు. పోలీసులను, మీడియాను వెంటేసుకుని వచ్చి రైతుల గోదాముల తాళాలు పగలగొట్టి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అధికారుల విచారణలో ఆ సరుకు రైతులకు చెందినదని తేలిపోయినా, కక్షపూరితంగా వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు.
- టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్:
రైతులపై దాడి చేసిన బండ్లమూడి బాబూరావుతో సహా 31 మంది టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
- పవన్ కళ్యాణ్ గారు.. 'సీజ్ ది సంగం డెయిరీ' అనగలరా?
కాకినాడలో దొంగ బియ్యం వెళ్తుంటే 'సీజ్ ది షిప్' అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.. ఇక్కడ లక్షలాది క్వింటాళ్ల మొక్కజొన్నను తక్కువ ధరకు కొని నిల్వ చేసిన సంగం డెయిరీని ఎందుకు సీజ్ చేయమని అడగడం లేదు. రైతు పక్షపాతి అని నిరూపించుకోవాలంటే వెంటనే ఎమ్మెల్యే నరేంద్ర అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
- రేపు 'ఛలో మామిళ్లపల్లె'కు పిలుపు:
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరాచకాలకు బలైన రైతులకు సంఘీభావం తెలియజేయడానికి, మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ . జగన్ ఆదేశాల మేరకు రేపు "ఛలో మామిళ్లపల్లె" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మురళీకృష్ణ ప్రకటించారు. జిల్లా నేతలందరం కలిసి శాంతియుతంగా బాధితులను పరామర్శిస్తామని చెప్పారు. ఈ నేపధ్యంలో
మొక్కజొన్నకు వెంటనే రూ. 2,400 మద్దతు ధర చెల్లించడంతో పాటు, రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన రైతుల మొక్కజొన్నను వెంటనే వారికి తిరిగి ఇవ్వాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయడంతో పాటు, కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులకు ఆత్మహత్యలే శరణ్యం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే 'ఛలో మామిళ్లపల్లి' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టి రైతులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.