డ్వాక్రా సంఘాలకు టోకరా వేసిన సీఎం చంద్రబాబు
విశాఖపట్నం: ఎన్నికల్లో డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు... తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి టోకరా వేశారని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. గతేడాది కంటే ఈ దఫా ఏకంగా రూ.16,600 కోట్ల రుణాల్లో కోత పెట్టడం ద్వారా డ్వాక్రా సంఘాలను అధ్వాన్న స్ధితిలోకి నెట్టారని ఆక్షేపించారు. విశాఖపట్నంలో వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... నాబార్డు నివేదికతో నారా వారి వంచన బట్టబయలైందని
ఇది ముమ్మూటికీ మహిళా సంఘాలను మోసం చేయడమేనని తేల్చి చెప్పారు. సున్నావడ్డీ పథకానికి గుండు సున్నా చుట్టిన చంద్రబాబు మోసంతో గతంలోనే డ్వాక్రా సంఘాలు కుదేలవగా... వైయస్.జగన్ హయాంలో ఆసరా పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ. .25,500 కోట్లు మహిళల అకౌంట్లలో జమ చేసి వాటికి పునరుజ్జీవం పోశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్రాంతి పేరుతో మహిళలు తలదించుకునేలా అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై తీవ్రంగా మండిపడ్డ వరుదు కల్యాణి.. ఇది కూటమి పాలన కాదని కేసినో పాలన అని తేల్చి చెప్పారు. సంక్రాంతి పేరుతో రికార్డింగ్ డ్యాన్సులు, పేకాట క్లబ్బులు కూటమి నేతల ఆధ్వర్యంలో జరుగుతుంటే... మరోవైపు హోంమంత్రి అనిత మాత్రం సెటిల్‌మెంట్లలో బిజీ గా ఉన్నారని మండిపడ్డారు.టీడీపీనేతలపై కేసులు నమోదు చేసి ఎందుకు, రోడ్లపై నడిపించడం లేదని నిలదీశారు. అసభ్య నృత్యాలను, పేకాటను అడ్డుకోవాల్సిన పోలీసులు కాపలా కాయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పండగ పేరుతో మద్యం ఏరులై పారిస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే...
డ్వాక్రా సంఘాలు బాబు టోకరా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పరిస్ధితి అత్యం దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన నాటి నుంచి మహిళలను నిట్టనిలువుగా మోసం చేస్తూ.. వారికి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ధ పేద మహిళలందరినీ చంద్రబాబు నిలువునా మోసం చేశారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు బాబు ఈ రోజు టోకరా వేశారు. డ్వాక్రా మహిళలను నేనే కనిపెట్టానని చెప్పే చంద్రబాబు... ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల పరపతిని పూర్తిగా తగ్గించారు. మహిళలను కోటీశ్వరులు చేస్తానన్న బాబు.. వారికి బ్యాంకుల ద్వారా వచ్చే రూ.16,600 కోట్ల రుణాలను తగ్గించారు.
డ్వాక్రా సంఘాల మహిళలు నా అక్కచెల్లెమ్మలని పదే పదే చెప్పే ఆయన... ఇవాళ వారికిచ్చే సున్నావడ్డీ పథకానికి గుండు సున్నా చుట్టారు. మరోవైపు డ్వాక్రా సంఘాల పొదుపు రూ.479 కోట్లు తగ్గిందిని ఈ ఏడాది నివేదికలో బయటపడింది. చంద్రబాబు పాలన మహిళల పట్ల ఎంత దారుణంగా ఉందనడానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు వాళ్లకిస్తానన్న సున్నా వడ్డీ పథకం ఇవ్వకపోవడంతో పాటు వాళ్లకు చేస్తానన్న ఆర్ధిక భరోసా అందివ్వకపోవడమే దీనికి కారణం. ఎన్నికల ప్రచారంలో మహిళలను కోటీశ్వరులను చేయడంతో పాటు పారిశ్రామికవేత్తలుగా మారుస్తానని హామీ ఇచ్చిన ఆయన... ఇవాళ డ్వాక్రా సంఘాల పరపతిని తగ్గించేశారు. నాబార్డు నివేదిక ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది.
కుదైలైన డ్వాక్రా సంఘాలు..
2023-24 వైయస్.జగన్ హయాంలో పురోగమనంలో ఉన్న డ్వాక్రా సంఘాలు చంద్రబాబు పాలనలో తిరోగమనం పట్టాయి. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడమే కాకుండా, సున్నావడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టారు. దాంతో ఏ, బి గ్రేడ్లుగా ఉన్న డ్వాక్రా సంఘాల పరపతి తగ్గి సీ, డీ గ్రేడ్లుగా మార్పుచెందడంతో పాటు 18.36 శాతం సంఘాలు ఎన్ పీ ఏ లు గా మారాయి.
వైయస్.జగన్ హయాంలో డ్వాక్రా సంఘాల పునరుజ్జీవం...
మరలా వైయస్.జగన్ సీఎం అయిన తర్వాత వారికి ఆర్ధిక తోడ్పాటు అందివ్వడంతో పాటు 2019 ఏఫ్రిల్ వరకు ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలను ఆసరా ద్వారా రూ.25,500 కోట్లు నాలుగు విడతలుగా వారి అకౌంట్లలో జమ చేశారు. దీంతోపాటు సున్నావడ్డీకి కూడా ఠంచనుగా రుణాలు అందించారు. ఫలితంగా చంద్రబాబు హయాంలో ఎన్ పి ఏ లుగా పడిపోయిన 18.36 శాతం సంఘాలు తిరిగి 0.17 శాతానికి తగ్గాయి. సీ, డీ గ్రేడ్లుగా గతంలో ఉన్న సంఘాలన్నీ మరలా వైయస్.జగన్ పాలనలో ఏ, బీ గ్రేడులుగా పైకి వచ్చాయి. ఆసరాతోపాటు చేయూత పథకం, ఈబీసీ నేస్తం, కాపునేస్తం పథకాలతో ఆర్దిక భరోసా ఇవ్వడంతో పాటు అమూల్, రిలయన్స్, ఐటీసీ, పీ అండ్ జీ వంటి ప్రముఖ కంపెనీలతో టై అప్ అయి వీరి ఉత్పత్తులకు తగిన మార్కెట్ కల్పించి, వాటికి మంచి ధర లభించేలా చేస్తూ.. మహిళలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా ఊతమిచ్చారు.
నారా వారి వంచనపై నాబార్డు నివేదిక..
2023-24 ఆర్ధిక సంవత్సరం పొదుపుతో పోల్చుకుంటే 2024-25లో ఈ పొదుపు రూ. 479.11 తగ్గిపోయిందని నాబార్డు నివేదికలో వెల్లడైంది. అదే విధంగా 2023-24తో పోల్చి చూస్తే 2024-25లో బ్యాంకు రుణాలు రూ.16,607 కోట్లు తగ్గాయని వెల్లిడించారు. వైయస్.జగన్ హయాంలో 2023-24 ఆర్దిక సంవత్సరంలో రూ.59,777 కోట్ల రుణాలిస్తే.. ఇవాళ చంద్రబాబు సీఎం అయన తర్వాత బ్యాంకు రుణాలు కేవలం రూ.43,169 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. అంత దారుణంగా చంద్రబాబు పాలనలో డ్వాక్రా సంఘాలు తిరోగమనంలో ఉన్నాయని నాబార్డు నివేదిక స్పష్టం చేసింది.
గతంలో 2023-24లో ఒక్కో పొదుపు సంఘానికి సగటున రూ.8.8 లక్షల రుణాలివ్వగా చంద్రబాబు హయాంలో రూ.6.43 లక్షలు మాత్రమే రుణాలు మంజూరు చేశారు. డ్వాక్రా సంఘాల పరపతి తగ్గిందనడానికి ఇదే నిదర్శనం. ఇంకా చంద్రబాబు డ్వాక్రా మహిళలను ఎంతలా మోసం చేశారంటే.. ఎన్నికల సమయంలో రూ.3లక్షల వరకు ఉన్న సున్నా వడ్డీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచుతానని హామీ ఇచ్చి 19 నెలల కాలంలో రూ.7,000 కోట్లు మహిళలకు సున్నా వడ్డీ కింద బకాయి పడ్డారు. రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తారని ఆశపడ్డ మహిళల పరిస్థితి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నట్టు తయారైంది. సున్నా వడ్డీ రుణపరిమితి పెంచకపోగా... ఉన్న పథకానికే బకాయి పెట్టారు.
కూటమి పాలన కాదిది - కేసినో పాలన...
ఈ ఏడాది కూటమి పాలనలో సంక్రాంతి సంబరాలు మహిళలు తలదించుకునేలా నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశ్లీల నృత్యాలకు అడ్డాగాను, క్యాసినోలకు కేరాఫ్అడ్రస్ గా, జూదానికి బ్రాండ్ అంబాసిడర్ గానూ, పేకాటకు పేటెంట్ గా మార్చివేశారు. ఎక్కడ చూసినా పబ్లిక్ గా ఇలాంటి సంస్కృతిని కూటమి నాయకులు తీసుకొచ్చారు. ఈ రోజు గోవా, శ్రీలంక, థాయ్ లాండ్ లో ఉన్న కేసినో సంస్కృతిని మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ పాలన కాదు తెలుగు డర్టీ పాలన అని, ఎన్ డీ ఏ అంటే నారా వారి డర్టీ అడ్మినిస్ట్రేషన్ అని సంక్రాంతి సంబరాల ద్వారా రుజువు చేశారు. ఇది కూటమి పాలన కాదు కేసినో పాలన, ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వమని రుజువు చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కాదు.. రికార్డింగ్ డ్యాన్సులు చేయించే గవర్నెన్స్ అన్నది తేటతెల్లం అయింది. తెలుగు వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామా ఉన్న రాష్ట్రానికి తెగులు పుట్టించేలా వ్యవహరించారు. కుటుంబవిలువలు తెలియజెప్పేలా గతంలో సంక్రాంతి పండగ ఉంటే.. దీన్ని జూదరులు, వ్యవనపరులు, పోకిరీల పండగగా మార్చివేశారు.
సెటిల్మెంట్లలో బిజీగా ఉన్న హోంమంత్రి...
ఒక మహిళా ప్రజాప్రతినిధి హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇంత దారుణంగా అశ్లీల, అర్గనగ్న నృత్యాలు, కేసినోలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్న మీ తీరు చూసి... మీకు ఎందుకు ఓట్లేసి గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు.
విపక్షాలపై భారీ స్టేట్ మెంట్లు ఇస్తూ.. వైయస్ఆర్‌సీపీ నేతలకు వార్నింగ్ లు ఇచ్చే హోంమంత్రి గారు మీ పార్టీ నేతలు ఇంత విశృంఖలంగా వ్యవహరిస్తుంటే వారిపై న ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారిని ఎందుకు నడిరోడ్డు మీద ఎందుకు నడిపించలేదు? హోంమంత్రిగారు సెటిల్మెంట్లలో బిజీగా ఉన్నారా? ఒక మహిళా హోంమంత్రిగా మీ కూటమి నాయకులు మహిళల పట్ల ఇంత దారుణంగా మాట్లాడుతుంటే మీరు సిగ్గుతో తలదించుకోవాలి.
కూటమి ఆధ్వర్యంలో అశ్లీల నృత్యాలు- కాపలాగా పోలీసులు...
మరోవైపు తనను స్పూర్తిగా తీసుకుని రాష్ట్రానికి సంక్రాంతి సందర్బంగా వివిధ ప్రాంతాల నుంచి 30 లక్షల మంది వచ్చారని, 3 లక్షల కార్లు వచ్చాయన్న చంద్రబాబు, తన భార్య భువనేశ్వరే సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లడం రాష్ట్ర ప్రజలు నేర్పించిందని చెప్పడం విడ్డూరం. మరి అలాంటప్పుడు విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన కేసినోలు, బూతు డ్యాన్సులు ఎవరి స్ఫూర్తితో ఈ ఏడాది రాష్ట్రంలోకి వచ్చాయో సమాధానం చెప్పాలి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అశ్లీల నృత్యాలు ఏర్పాటుకు కారణమైన అధికార పార్టీ నేతలను హోంమంత్రి అనిత రోడ్డు మీద ఎందుకు నడిపించరో సమాధానం చెప్పాలి.
గతంలో వైయస్.జగన్ పాలనలో చిన్నారులు ఐక్యరాజ్యసమితి వేదికమీద ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే.. కూటమి పాలనలో స్కూలుకు వెళ్లే చిన్నారుల అశ్లీల నృత్యాల వేదికమీదకు వెళ్లి డ్యాన్స్ చేయడం కనిపిస్తోంది. సమాజంలో పరిస్ధితులను ఎంతలా దిగజార్చారనడానికి ఇదే నిదర్శనం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దారుణంగా మినీబార్లు, పేకాట క్లబ్బులు, అర్ధనగ్న ప్రదర్శనలు చూస్తుంటే... ఏ సందర్భంలోనూ పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితి లేదు. అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్ద ఉందా? మూసివేశారా? అన్నట్టు రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తోంది.
ఈ తప్పుడు కార్యక్రమాలకు కాపలాగా పోలీసుల్ని ఉంచారే తప్ప... వీటిని అడ్డుకోవడానికి ఉంచలేదు. హైకోర్టు ఆదేశాలన్న ఈ ప్రభుత్వానికి భయం లేదు. మహిళ భద్రత పట్ల కూడా చిత్తశుద్ధి లేదు. టీడీపీ నేతలే ముడుపులు తీసుకుని ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఏకంగా కూటమి మంత్రే రికార్డింగ్ డ్యాన్స్ వేదికపైకి వెళ్లి బహిరంగంగా డ్యాన్స్ చేశారంటే...ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి.
తప్పు చేసిన కూటమి నేతలను రోడ్డుపై నడిపించరా?
వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ ను హత్య చేసిన టీడీపీ నేతలను హోంమంత్రి అనిత ఎందుకు నడిరోడ్డు మీద నడిపించలేదు. మేక ను కోస్తే కేసు పెట్టిన ప్రభుత్వం... మనిషి పీక కోస్తే ఎందుకు కేసు పెట్టడం లేదు? మహిళలు బట్టలు విప్పి డ్యాన్స్ చేయాలన్నవారిపై నో కేస్? కేసినోలు నిర్వహిస్తున్న వారిపైనా నో కేస్? మినీ బార్లు రన్ చేస్తున్న వారిపై నో కేస్? ఎందుకు వీళ్లందరినీ నడిరోడ్డుపై నడిపించడం లేదు హోంమంత్రి గారూ? మీ పార్టీ నేతలు ఎంత తప్పు చేసినా కేసులుండవా? వారిని రోడ్డు మీద నడిపించరా?
సంక్రాంతిలో వేలాదిగా బెల్టుషాపులు- ఏరులై పారిన మద్యం..
మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న కూటమి ప్రభుత్వంలో మినీబార్లు, అశ్లీల నృత్యాలు, గుండాటలు, కేసినోలు ఇన్ని జరుగుతున్నా ఎందుకు ఆపలేకపోయారు పవన్ కళ్యాణ్ గారూ? మీరు ప్రాతనిధ్యం వహిస్తున్న జిల్లాల్లో విచ్చలవిడిగా జూదం, రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నా ఎందుకు ఆపలేకపోయారు మీరు? మరోవైపు మద్యం ఏరులై పారుతున్నా ఎందుకు నోరు మెదపడంలేదు? గతేడాది కంటే ఈ దఫా రూ.266 కోట్ల మద్యం అధికంగా విక్రయించారు. కేవలం సంక్రాంతిలోనే ఈ నెల 1వ తేదీ నుంచి రూ.1800 కోట్లు మద్యం ఏరులై పారించారు. సంక్రాంతి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.500 కోట్ల మద్యం తాగించారంటే పరిస్థితి ఎంత విచ్చలవిడిగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా వెలిసిన బెల్టుషాపులే దీనికి కారణం. చివరకు మద్యాన్ని డోర్ డెలివరీ చేసే స్థితికి తీసుకురావడం అత్యంత దారుణం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ సహా బెల్టుషాపులు లేని నియోజకవర్గం లేదు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్సైజ్ అధికార్లు కుమ్మక్కై మద్యాన్ని ఏరులై పారించారు. ఇంత నీచమైన పాలన మునుపెన్నడూ లేదని వరుదు కల్యాణి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పాలకులకు మరోసారి ఓట్లేసి లేదని మహిళలు నిర్ణయించుకున్నారని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా అశ్లీల నృత్యాలు, పేకాట, కేసినోలు నిర్వహించేవారిని అరెస్టు చేసి నడిరోడ్డు మీద నడిపించడంతో పాటు డ్వాక్రా సంఘం మహిళలకు మీరిచ్చిన హామీ మేరకు రూ.10 లక్షల వరకు రుణాలివ్వాలని డిమాండ్ చేశారు.