కూటమి ప్రభుత్వానిది 'మహిళా కక్షపాత' పాలన

9 Mar, 2026 17:20 IST

తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వేడుకలు కేవలం ఆడంబరాలకే పరిమితమయ్యాయని, మహిళలకు జరిగిన మేలు శూన్యమని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలు ప్రారంభిస్తామని కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకున్న చంద్రబాబు, అమల్లో ఉన్న పథకాల క్రెడిట్ తీసుకుంటూ... మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. లక్ష మందిని మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేశానని బాబు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధమని, తమ సొంత ఆస్తులను ష్యూరిటీగా పెట్టుకుని మహిళలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వాటిని తన ఖాతాలో ఎలా వేసుకుంటారని నిలదీశారు. కనీసం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రూ. 800 కోట్ల సబ్సిడీలను కూడా ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిందని తేల్చి చెప్పారు. చివరకు ఎన్నికల హామీలను అమలు చేయడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న వరుదు కల్యాణి... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి జిల్లాలకే పరిమితం చేశారని, గ్యాస్ సిలిండర్ల పంపిణీలో 55 లక్షల మందికి మొండిచేయి చూపారని ధ్వజమెత్తారు.  ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకుని, మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేంత వరకు చంద్రబాబుకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత లేదని తేల్చి చెప్పారు.  
ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

సున్నా వడ్డీకి ఎగనామం - మహిళా పారిశ్రామికవేత్తలంటూ మోసం.

వాస్తవానికి ఎంఎస్ఎంఈలకు కేంద్రం రాయితీతో రుణాలు మంజారు చేయడం గతం నుంచి ఉన్నా.. .ఇవాళ చంద్రబాబు తాన్ని తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. మరోవైపు డ్వాక్రా సంఘాల మహిళల్లో ఇంటికొక పారిశ్రామిక వేత్తను  తయారు చేస్తానన్న మీ మాటలు చూసి మహిళలు నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారూ. మహిళలకు మీరు ఇస్తానన్న సున్నా వడ్డీ పథకమే ఇవ్వకుండా ఇంటికొక పారిశ్రామిక వేత్తలను ఎలా తయారు చేస్తారు? గతంలో వైయస్.జగన్ హయాంలో మహిళలకు రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీ పథకం కింద వారి అకౌంట్లలో జమ చేస్తుంటే.. మీరు ఎన్నికల ప్రచారంలో రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచి సున్నా వడ్డీ కింద రుణాలిస్తామని హామీలిచ్చి వారితో ఓట్లేయించుకున్నారు. 20 నెలలైనా వాటి ఊసే లేదు. దాదాపు రూ.5వేల కోట్లు సున్నావడ్డీ రుణాలు బకాయిలు పెట్టారు. మీ వల్ల డ్వాక్రా సంఘాల పరపతి, పొదుపు తగ్గిపోయింది. బ్యాంకులు రుణాలివ్వడం తగ్గించాయి. రూ.478 కోట్ల పొదుపు తగ్గిపోయింది. కేవలం సున్నావడ్డీ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే ఇదంతా జరిగితే... మీరు ఇంటికొక పారిశ్రామిక వేత్తను ఎలా తయారు చేస్తారు? 
గతంలో 2014-19లో కూడా రూ.14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చేయకుండా ఎగ్గొట్టడమే కాకుండా సున్నావడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టారు. దీంతో 2019లో వైయస్.జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు 2019 ఏఫ్రిల్ వరకు ఉన్న రుణాలను ఆసరా ద్వారా రూ.25,500 కోట్లకు పైగా ఇవ్వడంతో పాటు, వారి అకౌంట్లలో రూ.5వేల కోట్లకు పైగా సున్నా వడ్డీ  కూడా జమ చేసారు. డ్వాక్రా సంఘల మహిళలను మీరు ఆదుకున్నారంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఉచిత బస్సు- తుస్సు...

ఎన్నికల ప్రచారంలో అన్ని రకాల బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన మీరు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 11 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం లేకుండా చేయడమే కాకుండా... ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పిన మీరు, తీరా అమల్లో జిల్లాలకే పరిమితమైన బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ దాన్ని విజయవంతమైన పథకం అని ఎలా ప్రచారం చేసుకుంటున్నారు? 
గ్యాస్ సిలిండర్ల గురించి చాలా గొప్పలు చెప్పిన మీరు.. రాష్ట్రంలో ఉన్న 1 కోటి 59 లక్షల మంది ఎల్ఫీజీ వినియోగదారులంటే మీరు 55 లక్షల మందికి ఉచిత సిలిండర్లు ఎగరగొట్టి... పూర్తిగా అమలు చేశామని ఎలా చెప్పుకుంటారు. అదే విధంగా తల్లికి వందనం పధకం ద్వారా మహిళలకు మేలు చేశానని చెప్పుకుంటున్నారు. వైయస్.జగన్ హయాంలో 87 లక్షల మంది పిల్లల తల్లుల అకౌంట్స్ లో అమ్మఒడి కింది డబ్బులు జమ అయితే... మీరు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఈ పథకాన్ని ఎగరగొట్టి.. రెండో సంవత్సరం  20 లక్షల మంది పిల్లల తల్లుల అకౌంట్లలో డబ్బులు వేయకుండా ఎగనామం పెట్టారు. అది కూడా రూ.15 వేలకు బదులు రూ.13 వేలు మాత్రమే వేసి, ఒక్కొక్క బిడ్డకు రూ.17 వేలు ఎగనామం పెట్టి దాన్ని విజయవంతమైన పథకం అని ఎలా చెబుతారు? మహిళలను ఇంత దారుణంగా మోసం చేసిన మీరు ఏ మొహం పెట్టుకుని గొప్పలు చెప్పుకుంటున్నారు.

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత లేదు

అసెంబ్లీలోనూ, మహిళా దినోత్సవం నాడు డ్రామా తప్ప మరేమీ లేదు.. అందుకే ఎన్ డీ యే అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ కాదు నారా వారి డ్రామా అడ్మినిస్ట్రేషన్ అని మహిళలందరూ అనుకుంటున్నారు. కారణం కూటమి పాలనలో డ్రామా అడ్మినిస్ట్రేషన్ లో కధ, స్క్రీన్ ప్లే, పాటలు అంతా చంద్రబాబు ఆధ్వర్యంనే నడుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలంతా పాత్రధారులు మాత్రమే. సూపర్ సిక్స్ లో ఒక్కటీ కూడా అమలు చేయకుండా.. అన్నీ చేశామని చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లుతుంది. మహిళలకు ఆడబిడ్డ నిధి, సున్నావడ్డీ, రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు, నిరుద్యోగభృతి, మహిళలకు 50 ఏళ్లకే రూ.4వేల పెన్షన్ పథకాలిస్తామని ఎగరగొట్టారు. ఇక మహిళ భద్రత గాలికొదిలేశారు. ఇక ఏ అర్హతతో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 
మహిళలను వేధించే ఎమ్మెల్యేలను రక్షిస్తున్న మీకు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత లేదు. మీ పార్టీకి చెందిన ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధిస్తుంటే.. వారిని కంట్రోల్ చేయని మీకు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత లేదు.

వైయస్.జగన్ మహిళా పక్షపాతి- చంద్రబాబు మహిళా కక్షపాతి. 

వైయస్.జగన్ హయాంలో మహిళా పక్షపాత పాలన అందిస్తే.. ఇవాళ చంద్రబాబు నాయుడు మహిళ కక్షపాలన అందిస్తున్నారు. వైయస్.జగన్ హయాంలో మహిళలను రక్షించే పాలన అందిస్తే.. చంద్రబాబుది మహిళలను భక్షించే పాలనగా సాగుతోంది. 5 ఏళ్ల పాలనలో వైయస్.జగన్ రూ.2.48 లక్షల కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మహిళల అకౌంట్లో వేసి, వారికి అండగా నిలబడ్డారు. ఇవాళ చంద్రబాబు తానిచ్చిన తొలి హామీనే అమలు చేయలేదు. డీబీటీ ద్వారా రూ.1.89 లక్షల కోట్లు వైయస్.జగన్ హయాంలో మహిళల అకౌంట్లో జమ చేస్తే ఇవాల చంద్రబాబు 20 నెలల్లో రూ.2 లక్షల కోట్లు బకాయిలు పెట్టారు. వైయస్.జగన్ హయాంలో 84 లక్షల మంది పిల్లల తల్లులకు అమ్మఒడి అందిస్తే.. ఇవాళ చంద్రబాబు తల్లికి వందనం ద్వారా ఒక్కో బిడ్డకు రూ.17వేలు ఎగనామం పెట్టారు.
వైయస్.జగన్ హయాంలో చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉపాధి కల్పిస్తే.. చంద్రబాబు వారికి 50 ఏళ్ల మహిళలకు పెన్షన్ ఇస్తానని మాట తప్పారు.
31 లక్షల మంది మహిళలకు వైయస్.జగన్ హయాంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే... ఇవాళ చంద్రబాబు మేనిఫెస్టోలో పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు. 
అదే విధంగా వైయస్.జగన్ హాయంలో 2 ఏళ్లలో మహిళలకు 64వేల ఉద్యోగాలిస్తే... జాబ్ కేలెండర్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టి మోసం చేశారు. 

మహిళా ద్రోహి ప్రభుత్వం...

1.30 లక్షల మంది మహిళలకు వైయస్.జగన్ వాలంటీర్లగా అవకాశం కల్పిస్తే.. వారి జీతం రూ.5వేల నుంచి రూ.10వేలు జీతం పెంచుతానని ఎన్నికల్లో హామీ ఇచ్చి వారిని మోసం చేసి మహిళా ద్రోహిగా  నిలబడిన  వ్యక్తి చంద్రబాబు.  78 లక్షల మంది డ్వాక్రా మహిళలకు వైయస్.జగన్ రూ.25 వేల కోట్లు రుణమాఫీ చేసి ఆదుకుంటే.. వారికి సున్నావడ్డీ కూడా ఇవ్వకుండా డ్వాక్రా సంఘాలు కుదేలయ్యేలా చేసిన వ్యక్తి చంద్రబాబు.  వైయస్.జగన్  హయాంలో ప్రతి ఆడబిడ్డ ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యాదీవెన ద్వారా వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తే... ఇవాళ కూటమి పాలనలో  రూ.5500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగరగొట్టారు.
మహిళల రక్షణ కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొస్తూ.. మహిళల రక్షణకు వైయస్.జగన్ పెద్దపీట వేస్తే.. చంద్రబాబు వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తాము ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేసి.. మ్యూజిక్ షోలు, కామెడీ షోలతో కాలక్షేపం చేస్తూ ఆనందిస్తున్న దుస్థితి. రాష్ట్రంలో 3 మంత్రులు, 21 మంది ఎమ్మెల్యేలు  మినహా  ఏ మహిళకు న్యాయం జరగలేదు. అందుకే కూటమి ప్రభుత్వం మహిళా ద్రోహి ప్రభుత్వం. 

ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి పచ్చి అబద్దాలు చెప్పారు. తమ హామీలపై బాండ్లు పంచారు. ఒక్కో కుటుంబానికి లక్షల రూపాయలు జమ అవుతాయని చెప్పి... నిలువునా మోసం చేసారు. నీకు రూ.18వేలు, నీకు రూ.18వేలు అంటూ ప్రతి ఒక్కరినీ మోసం చేశారు. 
20 నెలలైనా ఒక్క హామీ మహిళలకు ఏం మేలు జరగలేదు. ఆ రోజు పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా, మంగళగిరి ఎమ్మెల్యే తాలాకా ఇంటూ ఇంటించికీ వెళ్లి ప్రచారం చేసిన వాళ్లంతా ఇప్పుడు కనిపించడం లేదు. ఇచ్చిన హామీలు నెరవేరవేర్చడం లేదు.

ఆడబిడ్డ నిధి- పచ్చి మోసం..

ఇక బడ్జెట్ లో సైతం మంత్రులు పచ్చి అబద్దాలు చెప్పారు. సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం అంటూ ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇవాళ మహిళల సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. ఆడబిడ్డ నిధి కింద 18-60 సంవత్సరాల వయస్సుకన్న మహిళకు ఏడాదికి రూ.18వేలు చొప్పున ఇస్తామని మహానాడు నుంచి ప్రచారం చేశారు. నేటికి మూడు బడ్జెట్లు పూర్తైన నేపధ్యంలో 16 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఏడాదికి మొత్తం రూ.32,400 కోట్లు చొప్పున మూడేళ్లకి  రూ.97 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించని దుస్థితి.
20 లక్షల ఉద్యోగాలు లేదా రూ.3వేల నిరుద్యోగభృతి అని ఊదరగొట్టి బడ్జెట్ లో దానికి రూ.1 కూడా కేటాయించలేదు. జాబ్ కేలండర్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతను చంద్రబాబు నిలువునా మోసం చేశారు. సంక్షేమం నా హృదయానికి అత్యంత సన్నిహిత అంశం అని చెప్పుకున్న చంద్రబాబు గారూ... మరెందుకు ఈ విషయాన్ని గాలికొదిలేశారు? 50 ఏళ్లు దాటిన వారికి రూ.5వేలు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి... మూడు బడ్జెట్లు గడిచిపోయినా బడ్జెట్ లో ఆ పథకానికి రూ.1 కూడా కేటాయించకుండా మోసం చేశారు. చంద్రబాబు పాలన కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుకు ఊడిపోయిన చందంగా తయారైంది. చంద్రబాబు పాలనలో ఏ పండగకూ కానుకలు లేవు. 

మూలనున్న ముసలమ్మ పనీ చేతగాని కూటమి...

వైయస్.జగన్ హయాంలో మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత లా భావిస్తూ.. అందులో అంశాలను 99.5 శాతం అమలు చేస్తూ... ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ బటన్ నొక్కి మహిళల అకౌంట్లో జమ చేశారు. ఆ రోజు చంద్రబాబు మాట్లాడుతూ... బటన్ నొక్కడం పెద్ద పనా? మూలన కూర్చున్న ముసలవ్వ కూడా బటన్ నొక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇవాల మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చి 20 నెలలైనా మూలనున్న ముసలవ్వ చేసే పనిని ఎందుకు చేయడం లేదు? మాట్లాడితే విజనరీ, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఆ ముసలమ్మ చేయగలిగిన పనిని ఎందుకు చేయలేకపోతున్నారు? ఆమె కున్న చేవ, సత్తా మూడు పార్టీల కూటమి నేతలకు లేవా? ఎందుకు బటన్ నొక్కి ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు? 

శాంతిభద్రతలు, మహిళా రక్షణలోనూ వైఫల్యమే...

ఇవాళ రాష్ట్రంలో మద్యం వీధి, వీధినా మద్యం ఏరులై పారుతుంది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. రోజుకు కనీసం ముగ్గురు మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి.  50-60 మంది మహిళలపై అఘాయిత్యాల కేసులు నమోదవుతున్నాయి. మరి మహిళా రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ ప్రభుత్వం ఏం చేసినట్లు? దిశ యాప్ ను పక్కనపెట్టి.. శక్తి యాప్ అని తీసుకొచ్చారు. తీరా అది కూడా సక్రమంగా పనిచేయడం లేదు.ఎమర్జెన్సీ కాల్ సెంటర్ 112 కు ఫోన్ చేస్తే 26 నిమిషాల వరకు రాష్ట్ర పోలీసుల నుంచి స్పందన లేదని ఇటీవలే కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా సీఎం చంద్రబాబు కు లేఖ రాశారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల యావరేజ్ 18 నిమిషాలు ఉందని.. ఇప్పటికైనా పోలీసులను సరైన మార్గంలో మహిళల రక్షణ దిశగా పనిచేయించాలని గడ్డిపెట్టారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పనితీరుకు ఇదే నిదర్శనం.

దేశంలో అట్టడుగు ఏపీ పోలీసుల పనితీరు...

ఇక కేంద్ర హోంశాఖ మన రాష్ట్ర పోలీసుల పనితీరుకు అట్టడుగ స్ధానం ఇచ్చిందంటే.. ఏపీలో శాంతిభద్రతలు ఎంత అధ్వాన్నాంగా ఉన్నాయో అర్ధం అవుతుంది.  రాష్ట్రంలో పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడ్డమే తప్ప .. బీఎన్ ఎస్ చట్టాల అమలుకు వాడ్డంలేదని స్పష్టమైంది.ఇక రాష్ట్రంలో 80-90 వేల బెల్టుషాపులున్నాయి. వీధి వీధినా మద్యం ఏరులై పారుతుంది. మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పిన హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే గంజాయి రవాణా యధేచ్చగా జరుగుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. డ్రగ్స్ విచ్చలవిడిగా రాష్ట్రంలో లభ్యమవుతున్నా నివారణ చర్యలు లేవు. సీఎం నివాసం ఉన్న నియోజకవర్గంలోనే క్రైమ్ రేట్  20 నెలల్లో 11 శాతం పెరిగడంతో పాటు.. చివరకు తిరుపతిలోనూ మహిళల మీద నేరాలు శాతం పెరిగిందంటే... ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం అవుతుంది. సాక్షాత్తూ ఎమ్మెల్యేలే మహిళలను వేధింపులకు గురిచేస్తున్నా కనీస చర్యలు లేవు. మంగళగిరి నియోజకవర్గం తుమ్మపూడిలో టీడీపీ నేత మహిళలను వేధిస్తుంటే... నిరసనగా మహిళలు అర్ధరాత్రి వరకు ధర్నా చేశారంటే... వాస్తవం ఏంటో అర్ధమవుతుంది. 

ఉన్న పిల్లల సంక్షేమం గాలికొదిలి బాబు కొత్త పాట... 

ముగ్గురు పిల్లలను కనాలని చంద్రబాబు కొత్త పొట అందుకున్నారు. ముగ్గురు పిల్లలను కంటే రూ.25వేలు ఇస్తామని చెబుతున్నారు. కానీ ఆ కుటుంబం పాతికేళ్లు ఆర్ధిక ఇబ్బందులలో పడ్డం ఖాయం. వారి జీవితాలు తలక్రిందులవ్వడం ఖాయం. 20 నెలల పాలనలో  ఉన్న పిల్లలు, విద్యార్ధులకిచ్చిన హామీలనే అమలు చేయకుండా ఎగ్గొట్టిన చంద్రబాబు... ఇంకా పిల్లలను కనమని చెప్పడం విడ్డూరం. 
రాష్ట్రంలో సంక్షేమహాస్టళ్ల నిర్వహణ అత్యంత అధ్వాన్నంగా ఉంది. కూటమి పాలనలో 900 మంది విద్యార్ధులు వసతి గృహాల్లో నాసిరకం ఆహారం కారణంగా ఆస్పత్రి పాలైన దుస్ధితి. వీటిపై దృష్టి పెట్టకుండా ఇంకా పిల్లల్ని కనండి అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. మీరు, మీ కుమారుడు మాత్రం ఒక్కరినే కంటూ ప్రజలను మాత్రం ముగ్గురిని కనమనడం ఏ రకంగా సమంజసం? మీ అబద్దాలను ప్రజలు నమ్మడం లేదు, మీరు విజనరీ కాదు పాయిజనరీ చంద్రబాబూ అని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసి.. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. అంతవరకు ఆ అర్హత లేదని స్పష్టం చేశారు.