పోలీసుల‌పై టీడీపీ నాయ‌కుల దౌర్జ‌న్యం దుర్మార్గం

3 Jan, 2026 19:21 IST

 అనంతపురం: జడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో ప్రజా ప్రతినిధుల భద్రత నిమిత్తం విధుల్లో ఉన్న పోలీసులపై టిడిపి నాయకులు దౌర్జన్యంగా వ్యవహరించడం దుర్మార్గ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్ర రెడ్డి మండిప‌డ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సమక్షంలో ఆయన వర్గీయులు పోలీసులపై దుర్భాషలాడుతుంటే, వారిని ఆపకుండా ఎమ్మెల్సీ వారిని ప్రోత్సహించడం అత్యంత బాధాకరమని విమర్శించారు. ఇందుకు ఎమ్మెల్యే త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని , బాధ్యులైన టిడిపి నేతలపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ‌నివారం వెన్న‌పూస ర‌వీంద్ర‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో పోలీసులకే గౌరవం, రక్షణ లేకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జడ్పీ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సమక్షంలో ఆయన వర్గీయులు పోలీసులపై దుర్భాషలాడుతుంటే, వారిని ఆపకుండా ఎమ్మెల్సీ వారిని ప్రోత్సహించడం అత్యంత బాధాకరమని విమర్శించారు. పోలీసులను ఉద్దేశించి “ఆగండి” అంటూ మాట్లాడటం రౌడీయిజానికి సంకేతమని వ్యాఖ్యానించారు.

చట్టసభల్లో ఉండే ప్రజాప్రతినిధులు క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా మారిందన్నారు. ఇలాంటి చర్యల వల్ల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేరు రౌడీలకు అండగా నిలిచే, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రతీకగా మారుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కూటమి ప్రభుత్వం తీరును వెంటనే మార్చుకోవాలని, పోలీసులపై దౌర్జన్యంగా వ్యవహరించిన వారిని టిడిపి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వెన్నపూస రవీంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పోలీసుల పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.