ఇమామ్‌లు, మౌజన్‌ల గౌరవ వేతనాలను విడుదల చేయాలి
విజయవాడ: ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వైయస్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్‌కు వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, రాష్ట్ర మైనారిటీ విభాగం వర్కింగ్ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు వీ. ఖాదర్ బాషా, ఎమ్మెల్సీ రూహుల్లా, ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మస్తాన్, స్థానిక కార్పొరేటర్లు, పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు 2014- 2019 మధ్య ఇమామ్, మౌజమ్‌లకు మోసం చేశారని విమర్శించారు. 2019లో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక..వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఇమామ్, మౌజమ్‌లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల గౌరవ వేతనం ఇచ్చిందన్నారు. మైనారిటీల సంక్షేమానికి వైయస్ జగన్ పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. 2024 మార్చి నెల వరకు గౌరవ వేతనాలు చెల్లించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తరువాత ఈ గౌరవ వేతనం ఇక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.83 కోట్లు గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, టిడిపి మైనారిటీలకు ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయాలని హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు.