ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అనంతపురం : ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలన్నారు. శనివారం నగరంలోని ఎ–7 కన్వెన్షన్ హాల్‌లో వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు.వైయస్‌ఆర్‌సీపీ టాస్క్ ఫోర్స్ సభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి (సమన్వయం) వజ్ర భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సచివాలయ, గ్రామ స్థాయి కమిటీల నియామకంపై వారు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేయాలని చూస్తున్నారన్నారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని అన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలను కాపాడుకునేందుకు తమ జీవితాలను పణంగా పెడతామని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామని, తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులను చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా గ్రామ, సచివాలయ స్థాయి కమిటీల నియామకం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఉత్సాహవంతులు, పార్టీ కోసం పనిచేసే వారిని కమిటీల్లో తీసుకోనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ భయపడే పరిస్థితి లేదన్నారు. తమకు అధికారం ముఖ్యం కాదని, ప్రజల సంక్షేమమే లక్ష్యమన్నారు. గత ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్‌లో గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశం అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణంపై వజ్ర భాస్కర్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.